- 10 వేలకు పైగా లగ్జరీ ఇండ్లు, ఆఫీసులు ఆహుతి
- రోడ్డునపడిన 30 వేల మంది బాధితులు
లాస్ఏంజెలిస్: అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తున్నది. గాలులు బలంగా వీయడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటివరకు 10 వేలకు పైగా లగ్జరీ ఇండ్లు, ఆఫీసులు ఇతర నిర్మాణాలు కాలిబూడిదయ్యాయి. పది మంది చనిపోయారని అధికారులు ప్రకటించారు. కార్చిచ్చు కారణంగా మొత్తం రూ.12లక్షల కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు ఆక్యూ వెదర్ అనే సంస్థ అంచనా వేసింది.
శాంటామోనికా, మాలిబు మధ్య ఉన్న పాలిసేడ్స్ ఫైర్, పసడేనా సమీపంలోని ఎటన్ ఫైర్ మొత్తం 34 వేల ఎకరాలను బూడిద చేశాయి. లాస్ ఏంజెలిస్ చరిత్రలోనే ఇది అతిపెద్ద కార్చిచ్చు అని అక్కడి అధికారులు తెలిపారు. వేలాది ఫైరింజన్లను రంగంలోకి దించినప్పటికీ.. కార్చిచ్చు వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నట్లు చెప్పారు. హెలికాప్టర్ల ద్వారా మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు వివరించారు. విజయ్ మాల్యా కొడుకు సిద్ధార్థ, అతని భార్య జాస్మిన్.. పాలిసేడ్స్ ఫైర్ బాధితులుగా నిలిచారు. బాలీవుడ్ సినీ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, నోరా ఫతేహి కూడా కార్చిచ్చుకు ప్రభావితమయ్యారు.
విలువైన వస్తువులు లూటీ
ఈ కార్చిచ్చు కారణంగా సుమారు 30వేల మంది కట్టుబట్టలతో రోడ్డునపడ్డారు. సుమారు 2 లక్షల మంది తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఇండ్లను వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయితే, ఇదే అదనుగా కొందరు దొంగలు ఇండ్లు, ఆఫీసులను లూటీ చేస్తున్నారు. తాళాలు పగులగొట్టి విలువైన వస్తువులు ఎత్తుకెళ్తున్నారు. దీంతో లాస్ ఏంజెలిస్ పోలీసులు కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. 20మందిని అరెస్టు చేసినట్లు పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.
చాలా ప్రాంతాల్లో శ్వాసపరమైన ఇబ్బందులు
చాలా ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించడంతో చిన్నారులు, వృద్ధులు శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాస్ ఏంజెలిస్ అంతా వ్యాపించిన పొగ, మంటలు స్పేస్‌లోని శాటిలైట్లకు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా మాక్సర్ సంస్థ విడుదల చేసిన శాటిలైట్ ఫొటోలు.. పాలిసేడ్స్ ఫైర్, ఈటన్ ఫైర్ సృష్టించిన బీభత్సాన్ని కండ్లకు కట్టాయి. కాలిబూడిదైన ప్రదేశాలు
స్పష్టంగా కనిపిస్తున్నాయి. చెట్లు కాలిపోయిన ప్రాంతమంతా రెడ్ కలర్లో.. ఇండ్లు, ఆఫీసులు బూడిదైన ఏరియా బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి.
బాధితులను ఆదుకుంటాం: బైడెన్
లాస్ ఏంజెలిస్ పక్కన ఉండే పసిఫిక్ పాలిసేడ్స్ మొత్తం కాలిబూడిదైంది. సుమారు 5,300 నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎటన్ ఫైర్ కారణంగా మరో 4వేల నుంచి 5వేల బిల్డింగ్లు డ్యామేజ్ అయ్యాయి. సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకుంటామని బైడెన్ ప్రకటించారు. రానున్న ఆరు నెలల పాటు బాధితులందరికీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మేజర్ డిజాస్టర్‌గా ఆయన ప్రకటించారు.
శిథిలాల తొలగింపు, తాత్కాలిక షెల్టర్లు, అత్యవసర ఖర్చులకు సంబంధించి పూర్తి రీయింబర్స్మెంట్ అందిస్తామని తెలిపారు. మంటలు అదుపు చేసేందుకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.
లాస్ ఏంజెలిస్ మీద అటామిక్ బాంబు పడిందా? అన్నట్లు ఉందని, కార్చిచ్చు చాలా విషాదాన్ని
మిగిల్చిందని అక్కడి అధికారులు తెలిపారు.
సెలబ్రిటీల ఇండ్లు, ఆఫీసులు కాలిబూడిద
ఈటన్ ఫైర్ 13 వేల ఎకరాలను దహించగా.. పాలిసేడ్స్ ఫైర్ సుమారు 20 వేల ఎకరాలను బూడిద చేసింది. పసిఫిక్ పాలిసేడ్స్‌లో ఎక్కువగా సెలబ్రిటీలు ఉంటారు. వాళ్లందరి ఇండ్లు కాలి బూడిదయ్యాయి. మాలిబులోనూ కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. 5 చర్చిలు, ఓ ప్రార్థనా మందిరం, 7 స్కూళ్లు, 2 లైబ్రరీలు, బొటిక్స్, బార్లు, రెస్టారెంట్లు, బ్యాంకులు, కిరాణా షాపులన్నీ కాలిబూడిదయ్యాయి. కొన్నిచోట్ల మూగ జీవాలు సజీవ దహనం అయ్యాయి.
మాలిబు బీచ్ ముందున్న ఇండ్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. అటు, కెన్నెత్ ఫైర్ కూడా వేగంగా వ్యాపిస్తున్నది. శాన్ ఫెర్నాండో వ్యాలీకి 3.2 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాలాబాసాస్ నుంచి కార్చిచ్చు ప్రారంభమై వెంచురా కౌంటీని తాకింది. దీంతో అక్కడి ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సేఫ్ ప్లేస్‌కు తరలిస్తున్నారు. ఇక్కడ 1,000 ఎకరాలు కాలి బూడిదయ్యాయి. దట్టమైన పొగ కమ్ముకున్న ప్రాంతాల్లోని స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.