- ప్రైవేటు ఫైర్ సిబ్బంది నియామకం
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా ఉన్న లాస్ ఎంజెలెస్ సిటీలో కార్చిచ్చు కొనసాగుతూనే ఉంది. మంటలు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే 12 వేలకు పైగా ఇండ్లు, అపార్ట్‌మెంట్ బిల్డింగులు, వాణిజ్య భవనాలు కాలి బూడిదయ్యాయి. లక్ష మందికి పైగా ప్రజలు తమ ఇండ్లను ఖాళీ చేయవలసి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో లాస్ ఎంజెలెస్‌లోని మిలియనీర్లు తమ ఖరీదైన, విలాసవంతమైన ఇండ్లను కాపాడుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
అందులో భాగంగా ప్రైవేటు ఫైర్ సర్వీసెస్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇందుకోసం భారీగా డబ్బులు చెల్లిస్తున్నారు. ప్రైవేటు ఫైర్ సర్వీసెస్, కస్టమ్ ఫైర్ ప్రొటెక్షన్ కోసం లాస్ ఎంజెలెస్‌లోని కొంతమంది మిలియనీర్ల గంటకు 2 వేల డాలర్లు (సుమారు రూ. 1.7 లక్షలు) చెల్లిస్తున్నారు. అయినా మంటలు అదుపులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదని స్థానిక వార్తా సంస్థలు నివేదించాయి. దీనిపై ఓ ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీ యజమాని క్రిస్ డన్ మాట్లాడుతూ.."విలాసవంతమైన తమ ఆస్తులను మంటలు తాకకుడా కాపాడుకోవడానికి పలువులు మిలియనీర్లు ఈ ప్రైవేట్ సిబ్బందిని నియమించుకున్నారు.
సంక్షోభం దృష్ట్యా ఇలాంటి సేవలకు డిమాండ్ పెరిగింది. శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్‌కి చెందిన ఒక జర్నలిస్ట్.. మంటలను ఆపడానికి రాత్రిపూట ప్రైవేట్ అగ్నిమాపక సిబ్బందితో ఇంటి పైకప్పుపై నీరు పోయించాడు. ఫైర్ సిబ్బంది ఇండ్లకు స్ప్రింక్లర్‌లను అమర్చి.. రాత్రంతా కాపలాగా ఉన్నారు" అని వివరించారు. లాస్ ఎంజెలెస్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం.. ప్రైవేటు ఫైర్ సర్వీసెస్ కంపెనీలు..ఇండ్ల చుట్టూ ఫైర్ రిటార్డెంట్(మంటల తీవ్రతను తగ్గించే పదార్థం)ను చల్లుతున్నాయి. ఫైర్‌ప్రూఫ్ మెటీరియల్‌తో కవర్ చేస్తున్నాయి.
కార్చిచ్చుతో 24 మంది మృతి
కార్చిచ్చు కారణంగా చనిపోయిన వారి సంఖ్య 24కు చేరిందని అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. మంటలను అదుపు చేయడానికి వారం రోజులుగా ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. వాతావరణ మార్పులతో ఇప్పుడిప్పుడే మంటలు కాస్త అదుపులోకి వస్తున్నాయి. కానీ గాలులు మళ్లీ వీచే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. అదే జరిగితే..కాలిపోయిన ఇండ్లు, లోయల్లో మళ్లీ మంటలు చెలరేగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.