మంటల్లో లాస్ ఏంజిల్స్..కాలిబూడిదైన వేలాది ఇండ్లు..మరో 23 వేల ఇండ్లకు ముప్పు

మంటల్లో లాస్ ఏంజిల్స్..కాలిబూడిదైన వేలాది ఇండ్లు..మరో 23 వేల ఇండ్లకు ముప్పు
  • సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన స్థానికులు, హాలీవుడ్  సెలబ్రిటీలు

వాషింగ్టన్ : అమెరికాలో హాలీవుడ్  సెలబ్రిటీలు, అత్యంత సంపన్నుల నగరాల్లో ఒకటైన లాస్ ఏంజిల్స్  కార్చిచ్చులో చిక్కుకుంది. లాస్ ఏంజిల్స్ కు ఈశాన్య ప్రాంతంలో మంగళవారం 20 ఎకరాల్లో ప్రారంభమైన దావానలం.. కొన్ని గంటల్లోనే 1200 ఎకరాలకు విస్తరించింది. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు హాలీవుడ్  సెలబ్రిటీలతో పాటు స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ కార్చిచ్చులో కొన్నివేల ఇండ్లు ఆహుతి అయినట్లు తెలుస్తోంది. ఇంకా 23 వేల ఇండ్లకు ముప్పు పొంచి ఉందని అధికారులు భావిస్తున్నారు.

హెలికాప్టర్ల సాయంతో మంటలను ఆర్పేందుకు 250 మందికిపైగా ఫైర్ ఫైటర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ అగ్నికీలలు అదుపులోకి రావడం లేదు. అయితే, కార్చిచ్చు వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని లాస్ ఏంజిల్స్ ఫైర్  చీఫ్​ క్రిస్టిన్ క్రోవ్ లీ తెలిపారు. 30 వేల మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించామని ఆమె వెల్లడించారు. మంటలను ఆర్పేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా.. హాలీవుడ్  సెలబ్రిటీలు, ప్రముఖుల ఇండ్లు కూడా కార్చిచ్చులో చిక్కుకున్నాయి.

ఈమేరకు కొంతమంది నటులు ‘ఎక్స్’ లో వీడియోలు పోస్టు చేశారు. తన ఇంటి సమీపంలో విస్తరిస్తున్న మంటలను యాక్టర్  జేమ్స్ వుడ్స్  వీడియో తీసి ‘ఎక్స్’ లో పెట్టారు. సేఫ్​ ప్లేస్​కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నానని ఆయన ట్వీట్  చేశారు. స్థానికులు కార్  కీస్ ను అందులోనే వదిలివెళ్లాలని, దీంతో ఫైర్  ట్రక్కులు వెళ్లేందుకు రూట్  క్లియర్  చేయడానికి వీలవుతుందని మరో యాక్టర్  స్టీవ్  గుటెన్ బర్గ్  సూచించారు.