గాడి తప్పుతున్న విద్యావ్యవస్థ

గాడి తప్పుతున్న విద్యావ్యవస్థ
  • వనపర్తి జిల్లాలో ఒక్క రెగ్యులర్​ ఎంఈవో కూడా లేరు! ​
  • ఆరుగురు ఇన్​చార్జి ఎంఈవోలకు 15 మండలాల బాధ్యతలు
  • నష్టపోతున్న హోం​స్కూల్​ స్టూడెంట్లు

వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో ఉన్న ఒక్క రెగ్యులర్​ ఎంఈవో ఇటీవల రిటైర్డ్​ కావడంతో.. రెగ్యులర్​ ఎంఈవో లేని జిల్లాగా మారింది. జిల్లాలో 15  మండలాలు ఉండగా, ఆరుగురు ఇన్​చార్జి ఎంఈవోలు పని చేస్తున్నారు. ఒక్కొక్కరికి రెండు నుంచి నాలుగు మండలాల బాధ్యతలు అప్పగించడంతో పాఠశాలల పర్యవేక్షణ జరగడం లేదు. అలాగే ఇన్​చార్జి ఎంఈవోలకు సంబంధించిన స్కూల్​లో ఆ సబ్జెక్ట్​ బోధన అంతంతమాత్రంగానే జరగడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. 

ఇన్​చార్జి బాధ్యతలతో సతమతం..

వనపర్తి ఇన్​చార్జి ఎంఈవో శ్రీనివాస్​గౌడ్​కు గోపాల్​పేట, రేవల్లి, కొత్తగా ఏర్పడిన ఏదుల ఇన్​చార్జి బాధ్యతలు ఇచ్చారు. పెద్దమందడి మండలం బలిజపల్లి గెజిటెడ్​ హెచ్ఎం జయశంకర్ ​ఖిల్లాగణపురం మండలం సోలీపూరుకు ట్రాన్స్​ఫర్​ అయ్యారు. అప్పటికే పెద్దమందడి ఎంఈవోగా ఉన్న ఆయనకు పాన్​గల్​ ఇన్​చార్జి బాధ్యతలు ఇచ్చారు. 

ఇలా ఒక్కో ఇన్​చార్జి ఎంఈవోకు రెండు నుంచి నాలుగు మండలాల బాధ్యతలు ఇవ్వడంతో వారు సరైన న్యాయం చేయలేకపోతున్నారని టీచర్లు పేర్కొంటున్నారు. వనపర్తి జిల్లాలో ఉన్న ఒక్కగానొక్క రెగ్యులర్​ ఎంఈవో​ జులై 31న రిటైర్​ అయ్యారు.  దీంతో 15 మండలాలు ఉన్న వనపర్తి జిల్లాలో ప్రస్తుతం ఏ ఒక్క మండలానికి రెగ్యులర్​ ఎంఈవో లేకుండా పోయారు.

ఎంఈవోల బాధ్యతలేంటి?

స్కూల్​ కాంప్లెక్స్​ హెడ్​మాస్టర్​కు కాంప్లెక్స్​ పరిధిలోని 15 ప్రైమరీ, అప్పర్​ ప్రైమరీ స్కూళ్ల బాధ్యతలు అప్పగించడంతో ఎంఈవోలకు కొంత భారం తగ్గినట్లయింది. కానీ, రెగ్యులర్​ ఎంఈవోలు కాకపోవడంతో ఇన్​చార్జిగా ఉంటూనే తాము పని చేసే స్కూల్​ బాగోగులు, పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి నాలుగు మండలాల బాధ్యతలు ఇవ్వడంతో హోమ్​ స్కూల్​ను సీనియర్​ స్కూల్​ అసిస్టెంట్​కు అప్పగించి పోవాల్సి వస్తోంది. ఆయన తనకెందుకు తలనొప్పి అనుకుంటే.. ఇక ఆ స్కూల్​ సంగతి అంతే. 

జిల్లాలోని గెజిటెడ్​ హెచ్ఎంలు ప్రమోషన్లపై నియమితులయ్యారు. కాబట్టి, గతంలో స్కూల్​ అసిస్టెంట్​గా ఏ సబ్జెక్టు చెప్పారో గెజిటెడ్​ హెచ్ఎంగా పని చేసే చోట కూడా అదే సబ్జెక్టు చెప్పాల్సి ఉంటుంది. ఎంఈవోలు ఎల్ఎఫ్ఎన్, ఎల్ఐపీ ప్రోగ్రామ్​లను పర్యవేక్షించాలి. స్కూళ్లలో మిడ్​ డే మీల్స్, పాఠ్యపుస్తకాలు, నోట్​బుక్కుల పంపిణీ, టీచర్ల హాజరు నమోదు, లేట్​గా వస్తే నోటీసులు ఇవ్వడం, మెడికల్​ లీవ్​లు పెట్టుకుంటే ప్రొసీడింగ్స్​ శాంక్షన్​ చేయడం. స్కూళ్లలో టీచర్ల బోధన తీరు, స్టూడెంట్ల విద్యాసామర్థ్యం ఇలా పలు అంశాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అదనపు భారంతో ఇవేమిపెద్దగా పట్టించుకోవడంలేదు. ఏదో ఒక స్కూల్​ను మొక్కుబడిగా విజిట్​ చేసి అక్కడ మిడ్​ డే మీల్స్​​రుచి చూసి, ఒక క్లాసులో స్టూడెంట్స్​తో మాట్లాడి వస్తున్నారు. 

కోర్టు స్టేతో నిలిచిన నియామకాలు..

ఎంఈవో​పోస్టులను ప్రభుత్వ స్కూళ్లలో పని చేసే వారితోనే భర్తీ చేయాలని, జడ్పీ హైస్కూళ్లలో పని చేసే గెజిటెడ్​ హెచ్ఎంలతో భర్తీ చేయవద్దనే విషయంలో కోర్టులో కేసు నడుస్తోంది. దీంతో గత కొన్నాళ్లుగా రెగ్యులర్​ ఎంఈవోల నియామకాలు జరగడంలేదు. ఇన్​చార్జీగా కొనసాగుతున్న వారిని అలాగే కొనసాగించాలని, వారు రిటైర్​ అయితే వారి స్థానంలో వేరే వారికి ఇన్​చార్జి ఇవ్వవద్దని, పక్క మండలానికి చెందిన ఎంఈవోకే ఇన్​చార్జిగా బాధ్యతలు ఇవ్వాలని ఆదేశాలు ఉండడంతో ఒక్కొక్కరు నాలుగు మండలాలు చూస్తున్నారు.  

 అదనపు బాధ్యతలతో ఇబ్బందులు..

నాకు నాలుగు మండలాల బాధ్యతలు ఇచ్చారు. అన్ని మండలాలు తిరిగి స్కూళ్లను విజిట్​ చేయాలంటే ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం ఎంఈవోలను​నియమిస్తామని చెప్పింది. దాన్ని అమలు చేస్తే మండలానికో ఆఫీసర్​ వచ్చి స్కూళ్లకు న్యాయం జరుగుతుంది.

- శ్రీనివాస్​గౌడ్, ఇన్​చార్జి ఎంఈవో, వనపర్తి