నీట్​లో ఓబీసీ స్టూడెంట్లకు 11 వేల సీట్లు లాస్​

ప్రస్తుతం దళిత, బహుజనులకు సంబంధించినంత వరకూ ప్రధాన సమస్య సమాచారం అందకపోవడమే. ముఖ్యంగా విద్యా రంగానికి సంబంధించి ఈ లోటు మరింత ఎక్కువగా ఉన్నది. దీని వల్ల నష్టపోతున్నది కూడా బహుజనులే. అగ్రకులాధిపత్యంతో ఉన్నతాధికారులు సమాచారాన్ని తొక్కిపెడుతున్నారు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలెయ్యడం వారికి అలవాటే.. సమాచారం అందుబాటులో లేకుండా చేయడం కూడా కుట్రలో భాగమే. నీట్​ మెడికల్/డెంటల్, పీజీ సీట్ల విషయంలోనూ అదే జరిగింది. తాజాగా 2021–-22 విద్యా సంవత్సరం నుంచి ఆలిండియా కోటాలో సైతం రిజర్వేషన్లు అమలు జేస్తామని ప్రధాని ప్రకటించారు. ఇది ఆహ్వానించాల్సిన అంశం. అయితే ఈ ప్రకటన అంత ఈజీగా రాలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మద్రాస్ హైకోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత, కోర్టు ధిక్కారణ కేసు నమోదు చేస్తామని హెచ్చరించిన తర్వాత కేంద్రం తమ పరువు కాపాడుకునేందుకు ఆలిండియా కోటాలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ వారికి రిజర్వేషన్ల అమలు ప్రకటన వచ్చింది. అయితే 2017–-20 మధ్య కాలంలో ఓబీసీలకు ఆలిండియా కోటాలో రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో దాదాపు 11 వేల మెడికల్ సీట్లను ఓబీసీ బిడ్డలు కోల్పోవాల్సి వచ్చింది. వీటిని సూపర్ న్యూమరీ సీట్ల ద్వారా భర్తీ చేయాలి. ఈ విషయాలన్నీ అర్థం కావాలంటే కొంత లోతుల్లోకి పోవాలి.

2007 వరకూ రిజర్వేషన్ల అమలు లేదు
దేశంలోని మంచి కాలేజీల్లో వైద్య విద్య చదవాలనే ప్రతిభావంతులైన విద్యార్థుల ఆకాంక్షల మేరకు కేంద్ర ప్రభుత్వం తమ అధీనంలోని ఈఎస్ఐసీ, ఏఎఫ్ఎంఎస్, ఇతర వైద్య విద్యా సంస్థల్లో అడ్మిషన్ల కోసం జాతీయ స్థాయిలో ఆలిండియా ప్రి మెడికల్ టెస్ట్(ఏఐపీఎంటీ)ని నిర్వహించేది. ఇది 1986లో మొదలైంది. దీంట్లో ఎలాంటి రిజర్వేషన్లు అమలు చేసేవారు కారు. ఎస్సీ, ఎస్టీలకు అన్ని విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని చట్టం చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. అందువల్ల ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన సీట్లను ఆధిపత్య కులాల వారే చేజిక్కించుకున్నారు. ఇట్ల అన్యాయానికి గురైన వారు కోర్టుకెక్కారు. జాతీయ మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ అభయ్ నాథ్ అనే విద్యార్థి ఢిల్లీ యూనివర్సిటీపై కేసు వేశాడు. ఆ కేసు సుప్రీంకోర్టు వరకు పోయింది. 2007లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు ప్రకారం జాతీయ మెడికల్ కాలేజీల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ప్రారంభించారు. అంటే 1986 నుంచి 2007 వరకు దళిత/గిరిజన వర్గాల విద్యార్థులు తమకు హక్కుగా దక్కాల్సిన వేల సీట్లను అధికారుల మోసాల వల్ల కోల్పోయారు.

మద్రాస్​ హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే..
ఎంబీబీఎస్, పీజీ సీట్లలో ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ తమిళనాడులో డీఎంకే, ఇతర ప్రతిపక్షాలు మద్రాస్​ హైకోర్టులో ఆలిండియా పూల్ సీట్లలోనూ రిజర్వేషన్లు కల్పించాలని కేసు వేశాయి. ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ ఆర్డర్​ వచ్చే నాటికే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. మధ్యలో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడం కష్టమని నీట్​ అధికారులు చెప్పారు. దీంతో గత ఏడాదే అమలు కావాల్సిన రిజర్వేషన్లు గల్లంతయ్యాయి. ఈసారైనా నీట్​ అడ్మిషన్ల ప్రకటనలో ఓబీసీ రిజర్వేషన్లు ఉంటాయని అందరూ భావించారు. జులై 13న విడుదల చేసిన నీట్ నోటిఫికేషన్ లో ఓబీసీల గురించి ఏమీ చెప్పకుండా కోర్టు కేసులకు అనుగుణంగా అడ్మిషన్లు ఉంటాయని ప్రకటించారు. దీంతో మరోసారి డీఎంకే మద్రాస్​ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారించిన కోర్టు ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేయకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని నీట్ నిర్వాహకులను, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిం చింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలోనే ఆలిండియా కోటాలో సైతం ఓబీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గత నెల 29న ప్రకటించారు. అయితే 2017–-20 మధ్య కాలంలో ఓబీసీలకు దక్కాల్సిన దాదాపు 11 వేలకుపైగా సీట్లు దక్కకుండా పోయాయి. ఈ సీట్లను సూపర్ న్యూమరీ కోటాలో పూర్తి చేయాలని డిమాండ్ చేద్దాం. కొట్లాడి సాధించుకుందాం. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి.. ఓబీసీ రిజర్వేషన్ల వల్ల ప్రతిభకు నష్టం జరుగుతోందని కొందరు అంటున్నారు. అయితే ఇందులో ఈడబ్ల్యూఎస్​ కోటా కూడా ఉందన్న విషయాన్ని వీళ్లు మరిచిపోతున్నారు. అయినా ఎంబీబీఎస్, డెంటల్, పీజీ పరీక్షలు పాస్ కాకుండా ఎవ్వరూ డాక్టర్​ ప్రాక్టీస్ చేయడానికి వీలుండదని వీరికి ఎవరైనా చెబితే బాగుండు.

ఇండియన్​ మెడికల్​ యాక్ట్​ను సవరించిన కేంద్రం
2007లోనే కేంద్ర ప్రభుత్వం అన్ని జాతీయ విద్యా సంస్థల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి గుడ్డిలో మెల్లలాగ అనేక ఆర్థిక నిబంధనలు పెడుతూ మెడికల్ సీట్లలో రిజర్వేషన్లను ఓబీసీలకు అమలు చేస్తున్నారు. అయితే 2016లో ఇండియన్ మెడికల్ యాక్ట్ ను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం చేర్చిన 10-Dని సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. దీని ప్రకారం జాతీయ స్థాయిలో ఒకే టెస్ట్ నీట్​ను పెట్టింది. ఇంగ్లిష్, హిందీతోపాటు స్థానిక భాషలోనూ పరీక్ష రాసుకునే అవకాశం కల్పించింది. అంతే కాదు దేశంలోని అన్ని కాలేజీల సీట్లనూ పూల్ గా చేసి అందులో ఎంబీబీఎస్​లో 85% స్థానిక విద్యార్థులకు, పీజీ స్థాయిలో 50% సీట్లు లోకల్ విద్యార్థులకు కేటాయించాలని 10-D సవరణ ద్వారా నిర్ణయించింది. ఇక్కడే సమస్యంతా వచ్చింది. 15% ఆలిండియా పూల్ ఎంబీబీఎస్​ సీట్లలో, 50% పీజీ సీట్లలో నీట్ నిర్వాహకులు ఓబీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు నిరాకరించారు. దీంతో నీట్ అమలవుతున్న 2016 నుంచి ఇప్పటి వరకు 4,500 ఎంబీబీఎస్  సీట్లు, 7,500 పీజీ సీట్లను దేశవ్యాప్తంగా ఓబీసీ విద్యార్థులు కోల్పోయారు.

- సంగిశెట్టి శ్రీనివాస్, సోషల్​ ఎనలిస్ట్​