ఆరుగాలం కష్టానికి నష్టమే మిగులుతోంది

కష్టకాలంలో ఆదుకునే రంగం ఏదైనా ఉందంటే అది వ్యవసాయమే. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలోనూ దేశానికి వెన్నెముకగా నిలిచింది ఈ రంగమే. కానీ, ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెరిగిన పెట్టుబడులు ఒకవైపు.. తగ్గిన దిగుబడులు మరోవైపు.. కల్తీ పురుగు మందులు, ఎరువులు ఇంకోవైపు రైతులను చుట్టుముడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు సాగుపై చిన్నచూపు చూడడంతో రైతులకు ఆసరా దొరకడం లేదు. సేద్యం గిట్టుబాటు కావడం లేదన్న సంగతి రైతులకు తెలిసిన విషయమే అయినా.. చేసేది లేక నష్టంతో నైనా సాగు చేస్తూ జీవిస్తున్నారు.

వ్యవసాయం సహా ఏ రంగమైనా ఖర్చు తగ్గించుకోవడం అనేది ముఖ్యమైన ఆర్థిక సూత్రం. దశాబ్ద కాలంగా సాగులో పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నాయి. పెట్టుబడులను నియంత్రించడంపై రైతులకు సరైన అవగాహన ఉండటం లేదు. దీనికి కావలసిన సమాచారం ప్రభుత్వం నుంచి అందడం లేదు. వ్యవసాయ అధికారులు రైతులకు సరైన సూచనలు అందించడం లేదు. దీంతో రైతులకు పెట్టుబడి వ్యయం పెరిగి.. రాబడి తగ్గిపోతోంది. ఇటీవల చాలా రాష్ట్రాల్లో విత్తనాల ధరలు విపరీతంగా పెరిగాయి. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం వల్ల రైతుకు ఎటూ పాలుపోవడం లేదు. పంట వేసే సమయంలో ఉన్న ధర అమ్మే సమయంలో లేకపోవడం వల్ల పెట్టుబడులు తలకు మించిన భారంగా మారుతున్నాయి.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం
మార్చి 2021 నాటికి టోకు ధరల సూచీ 7.39% నమోదైంది. ఎనిమిదేండ్లుగా ద్రవ్యోల్బణం ఎప్పుడూ ఇంత ఎక్కువగా లేదు. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల జనాల్లో కొనుగోలు శక్తి పడిపోతోంది. ఇది వ్యవసాయ ఉత్పత్తులపైనా ప్రభావాన్ని చూపుతోంది. పంటకు మార్కెట్​లో సరైన ధర పలకకపోవడంతో రైతుకు తీవ్ర నష్టం జరుగుతోంది. 2020 జనవరితో పోలిస్తే 2021 జనవరిలో 2.51%, 2020 ఫిబ్రవరితో పోలిస్తే 2021 ఫిబ్రవరిలో 4.17% ధరలు పెరిగాయి. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారుల వల్ల కూడా రైతులునష్టపోతున్నారు. ఈ మోసాలను నియంత్రించకపోవడం వల్లే ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరిగిపోతోంది.

గిరాకీ ఉన్న పంటలను వేయట్లే
గిరాకీ ఉన్న పంటలను వేసుకునే విషయంలో ప్రభుత్వాలు సరైన సూచనలు చేయకపోవడం వల్ల రైతులు తమకు నచ్చిన పంటనే వేస్తున్నారు. అలాగే గిరాకీ ఉన్న పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేసే పంట కాలనీలు ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో లేవు. ఇలాంటి కాలనీలను ఏర్పాటు చేస్తే రైతుల ఆదాయం పెరగవచ్చని ఐదేండ్లుగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచిస్తోంది.అలాగే 2022నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2016లో ప్రకటించింది. వీటిపై చర్యలకు కేంద్రం పదే పదే రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తున్నా తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు దీనిని అంత సీరియస్​గా తీసుకోవడం లేదు.

తృణధాన్యాలకు మస్తు డిమాండ్
జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో తృణధాన్యాలకు మంచి గిరాకీ ఉంది. కానీ వీటిపై రైతులు ఆసక్తి చూపడం లేదు. కమర్షియల్​ పంటలైన పత్తి, మిర్చి వంటి వాటికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో మాదిరిగా తృణధాన్యాల సాగుకు రైతులు ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణం.. తృణధాన్యాలు పండించడానికి భూమి అనుకూలంగా లేకపోవడం వల్లనే అని చెప్పవచ్చు. గతంలో సహజమైన ఎరువులను వాడి తృణధాన్యాలు పండిస్తే అధిక దిగుబడి వచ్చేది. కానీ, ప్రస్తుతం కమర్షియల్ పంటలకు ఉపయోగించే ఎరువులు, పురుగుమందులు తృణధాన్యాలకు ఉపయోగించడం వల్ల దిగుబడి తగ్గిపోతోంది. దీంతో రైతులు తృణధాన్యాలపై మొగ్గు చూపడం లేదు.  

ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతున్నం
గతేడాది ఖరీఫ్​లో తెలంగాణలో కోటి 34 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే, అందులో పత్తి 60 లక్షలు, వరి 58 లక్షల ఎకరాల్లో వేశారు. ఈ సీజన్​లో దేశంలోనే అత్యధికంగా 52 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసి అగ్రస్థానంలో నిలిచింది. కానీ, ప్రజలకు నిత్యం అవసరమయ్యే టమాటాలు, ఉల్లిగడ్డల వంటి ఆహార ఉత్పత్తుల కోసం కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ పై ఆధారపడాల్సి వస్తోంది.

రైతులకు అవగాహన కల్పించాలె
చాలా మంది వ్యవసాయ అధికారులు తమకు నచ్చిన పురుగు మందులనే వాడాలని సూచిస్తున్నారు. వాటి వల్ల లాభమో? నష్టమో? తెలియకపోయినా రైతులు అవే వాడేస్తున్నారు. సేంద్రియ సాగు పద్ధతులకు తోడు సమగ్ర పోషక యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతుల గురించి రైతులకు వివరించి చెప్పే ఓపిక ఆ ఆఫీసర్లు చూపడం లేదు. గతంలో సంప్రదాయ పద్ధతిలో విత్తనాలను భద్రపరచుకునే ఆచారం పల్లెల్లో ఉండేది. కానీ ఆధునిక సాగు విధానం వచ్చాక ఏటా కొత్త విత్తనాలు కొనుగోలు చేయడానికి అలవాటు పడ్డారు. అయితే మార్కెట్లో నాణ్యమైన విత్తనాలు దొరకకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు అందజేయాలి. కొత్త వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలి. ప్రతి రైతుకు పంట రుణంతోపాటు పండించిన పంటను అమ్ముకునేందుకు అవసరమైన నైపుణ్యాలు మెరుగుపరుచుకునేలా సాయం అందించాలి. అప్పుడే సేద్యం లాభసాటిగా మారుతుంది.

సబ్సిడీలు పెరగలేదు
రైతుకు అవసరమైన పురుగు మందులు, ఎరువులు, నాణ్యమైన విత్తనాలు అధిక ధరలకు కొనుగోలు చేయడం వల్ల పంట పండించిన తర్వాత అతనికి మిగిలేది కొద్దిగానే ఉంటోంది. కొన్ని సమయాల్లో నష్టాలే మిగులుతున్నాయి. ముఖ్యంగా రైతుకు అందాల్సిన సబ్సిడీలను ప్రభుత్వాలు తగ్గించడం వల్ల రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. గతంలో ఎరువుల ఉత్పత్తి ఖర్చులు పెరిగినప్పుడు ఆ భారం రైతుల మీద పడకుండా ప్రభుత్వం ఎరువులు ఇచ్చేది. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా పెట్రోల్ సహా అన్ని ధరలు పెరిగి.. దాని ప్రభావం ఎరువులపైనా పడుతోంది. పెరుగుతున్న ఎరువుల ధరలకు అనుగుణంగా సబ్సిడీని పెంచకపోవడంతో రైతుల మీదే భారం పడుతోంది. 

- డాక్టర్  రక్కిరెడ్డి ఆదిరెడ్డి, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కాకతీయ యూనివర్సిటీ, వరంగల్