అగ్రి చట్టాలతో రైతులకు నష్టమే

కొత్త చట్టాల పేరిట దేశంలో వ్యవసాయాన్ని, రైతులను కార్పొరేట్లు, బడా కంపెనీలకు తాకట్టు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త కుట్రకు తెరలేపింది. వారి దోపిడీని చట్టబద్ధం చేసేందుకు వీలుగా నిత్యావసర సరుకుల(సవరణ) చట్టం, రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) చట్టం, రైతులకు(సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద చట్టాలను రూపొందించింది. పార్లమెంట్ లో కనీస చర్చ లేకుండానే ఆమోదించి అమల్లోకి తీసుకొచ్చిన మూడు అగ్రి చట్టాలు రైతులకు మరణ శాసనాలుగా మారబోతున్నాయి. మరోవైపు ఉమ్మడి జాబితాలో వ్యవసాయం ఉన్నప్పటికీ.. ఫెడరల్​ స్ఫూర్తికి విరుద్ధంగా చట్టాలు చేసి ఈ రంగాన్ని కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

కాంట్రాక్ట్​ ఫార్మింగ్​తో ముప్పే

రైతులకు(సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద చట్టం వ్యవసాయంలో కాంట్రాక్ట్ పద్ధతికి చట్టబద్ధత కల్పించింది. కాంట్రాక్ట్​ వ్యవసాయానికి సంబంధించిన అనుభవాలు తెలంగాణలో చాలా ఉన్నాయి. మన రాష్ట్రంలో పలు విత్తన కంపెనీల వాళ్లు రైతుతో సాదా కాగితాలపై ఒప్పందాలు చేసుకుంటున్నారు. కంపెనీల ఏజెంట్‌‌గా ఆర్గనైజర్లను పెట్టుకుని పత్తి, వరి విత్తనాలు పండిస్తున్నారు. తీరా పంటచేతికి అందిన తర్వాత విత్తన సైజు సరిగ్గా లేదని, తేమ శాతం అధికంగా ఉందని, రంగు మారిందని కొర్రీలు పెడుతున్నారు. ఈ సాకులు చూపి డబ్బు చెల్లించేటప్పుడు కోతలు పెడుతున్నారు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇలాంటి పద్ధతికే ఇప్పుడు కేంద్రం ఆమోదముద్ర వేస్తూ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టంతో అమాయక, చదువురాని రైతుల నుంచి పంట కొనేటప్పుడు వ్యాపారస్తులదే పైచేయి అయ్యే ప్రమాదం ఉంది. రైతులు తమకు జరిగిన అన్యాయంపై కోర్టుల చుట్టూ తిరగలేక, లాయర్​ ఫీజు చెల్లించలేక తమ పంటను తక్కువ ధరకు తెగనమ్ముకునే పరిస్థితి వస్తుంది.

బడా కంపెనీలకే ప్రయోజనం

కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాల్లో అత్యంత ప్రమాదకరమైనది నిత్యావసర వస్తువుల చట్టం. పైరెండు చట్టాలకూ ఇదే ఆయువుపట్టు. ప్రస్తుతం అమలులో ఉన్న నిత్యావసర సరుకుల చట్టం 1955కి కీలక సవరణలు చేసి బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. కొన్ని రకాల ఆహార పదార్థాలు, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు వంటివి నిత్యావసరాలుగా పేర్కొనడానికి ఈ చట్టం కేంద్రానికి అధికారం ఇస్తుంది. అలాంటి నిత్యావసరాల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాన్ని నియంత్రించడానికి, నిషేధించడానికి కేంద్రానికి అధికారం ఉంటుందని చెబుతూనే బడా వ్యాపారులకు, మల్టీ నేషనల్​ కంపెనీలకు మేలు చేసేలా చట్టంలో వీలు కల్పించింది.

బ్లాక్ ​మార్కెటింగ్​కు చాన్స్

పంట పండించేవారి నుంచి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, గోదాం, రవాణా, పంపిణీదారు వరకు ఎవరికీ నిల్వల విషయంలో పరిమితులు లేవని ఈ చట్టం చెబుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల వాల్యూ చైన్ పార్టిసిపెంట్లకు కూడా ఈ నిల్వ పరిమితి వర్తించదని పేర్కొంది. పండించిన పంటను నిల్వ చేసుకునే వెసులుబాటు ఇప్పటికే రైతులు, రైతు సహకార సంఘాలకు ఉంది. కానీ ఈ మినహాయింపు పరిధిలోకి ఇప్పుడు కంపెనీలను, పంపిణీదారులను చేర్చింది. ఈ చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని బడా వ్యాపారస్తులు, మాల్స్​ నిర్వాహకులు రైతుల నుంచి తమ సొంత కొనుగోలు కేంద్రాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను కొని భారీగా నిల్వ చేసుకునే ప్రమాదం ఉంది. తద్వారా బ్లాక్ మార్కెటింగ్​ కు పాల్పడే అవకాశం ఉంది. ఈ చట్టం ద్వారా లాభపడేది వ్యాపారులు మాత్రమే.

కనీస మద్దతు ధర ప్రస్తావన లేదు

కొత్త చట్టంలో కనీస మద్దతు ధర(ఎంఎస్​పీ) ప్రస్తావనే లేదు. ఎంఎస్​పీ ఉన్న 23 రకాల పంటలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నుంచి నేరుగా కొనే అవకాశం ఉండదు. కేంద్రం ఇప్పటికే పంటల బీమా పథకంపై చేతులెత్తేసింది. ఏటా బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి, వడ్డీలేని పంట రుణాలకు చరమగీతం పాడబోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వం వ్యవసాయానికి ఇచ్చే రాయితీలను రద్దు చేయబోతోంది. ఈ చట్టాల వల్ల ఏకకాలంలో రైతుల ఆదాయం తగ్గడమేగాక వినియోగదారుడిపై మోయలేని భారం పడే ప్రమాదముంది. విద్యను ప్రైవేట్​పరం చేయడం వల్ల సామాన్య కుటుంబాలకు అందుబాటులో లేకుండాపోయింది. వైద్య రంగం కార్పొరేట్​ వ్యవస్థగా మారి పేద, మధ్యతరగతి కుటుంబాకులకు మెరుగైన వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అదే దారిలో ఇప్పుడు వ్యవసాయాన్ని కార్పొరేట్​ పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.

ఎక్కడైనా అమ్మే పరిస్థితి లేదు

వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) చట్టం చెబుతోంది. కానీ దేశంలో ఆ పరిస్థితులు లేవు. సాగు చేస్తున్న వారిలో 86% మంది చిన్న, సన్నకారు రైతులే. వీళ్లు ఎకరం, రెండెకరాల్లో పండించిన కొద్దిపాటి పంటను మార్కెట్లకు తరలించి అమ్ముకునేందుకు ఆసక్తి చూపడం లేదు. తమ ఉత్పత్తులను కల్లాల్లోనే కాంటా పెట్టి, స్థానిక వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు, కుటుంబ పోషణ కోసం డబ్బు అవసరం కావడంతో వారు ఇలా చేయాల్సి వస్తున్నట్లు అనేక సర్వేల్లో తేలింది. మిగతా సగం మంది తమ పంటలను ట్రాక్టర్లపై దగ్గర్లోని వ్యవసాయ మార్కెట్లకు తరలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రైతు దేశంలో ఎక్కడికైనా వెళ్లి పంట అమ్మడం సాధ్యమా? అనేది సందేహమే.కోదండరెడ్డి, ఉపాధ్యక్షుడు, ఆలిండియా కిసాన్ కాంగ్రెస్.