రాష్ట్ర అవసరాలు పట్టని షరతుల సాగు

 

రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అందేలా మార్కెట్‌‌లో రేటు ఉన్న పంటలే పండించాలని ‘షరతుల సాగు’ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో పెట్టింది. దీనిపై వ్యవసాయ శాఖ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. ఈ విధానం కింద రాష్ట్రంలో పత్తి 46 లక్షల నుంచి 60.16 లక్షల ఎకరాలు, వరి 41.18 లక్షల ఎకరాల నుంచి 52.50 లక్షల ఎకరాలు, కంది 7.38 లక్షల ఎకరాల నుంచి 10.75 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. వర్షాలు బాగా కురవడంతో ఈ సంవత్సరం వానాకాలంలో 134.23 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. సీఎం ఆదేశంతో వరి పంటలో 20 లక్షల ఎకరాలు సన్నధాన్యం వేశారు. అయితే పంటల ధరలను నిర్ణయించడానికి ప్రభుత్వం ‘ధరల నిర్ణాయక సంఘాన్ని’ ఏర్పాటు చేయలేదు. కేంద్రం చెప్పిన ధరలనే అమలు చేస్తున్నది. సన్నధాన్యం ఎకరాకు సగటున 20 క్వింటాళ్ల దిగుబడి కాగా, దొడ్డు ధాన్యాల దిగుబడి 25 క్వింటాళ్లు వస్తోంది. పైగా సన్నధాన్యం పెట్టుబడి ఎకరాకు రూ.6,000 ఎక్కువ. కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాలు వరికి రూ.1,888. అదే ధరను సన్న ధాన్యానికి అమలు చేయడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్‌‌లో అయితే సన్నధాన్యం పంటను కాల్చి నిరసన తెలిపారు.

రాష్ట్రాన్ని, దేశానికి ధాన్యాగారంగా మార్చామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ధాన్యాగార రాష్ట్రంలో వ్యవసాయ దిగుమతులపై నేటికీ ఆధారపడుతున్నాం. షరతుల సాగు విధానం శాస్త్రీయంగా అమలు జరగాలంటే ముందు భూసార పరీక్షలు నిర్వహించాలి. భూసారానికి అనుగుణంగా పంటలను నిర్ణయించాలి. రాష్ట్ర అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.

వాస్తవానికి దొడ్డు బియ్యాన్ని కేంద్రం మిల్లర్ల నుంచి కిలో రూ.32.73 పైసలకు కొనుగోలు చేసి రాష్ట్రాలకు రూ.29.73 పైసలకు సరఫరా చేస్తున్నది. హెల్త్​ మినిస్టర్​ ఈటల రాజేందర్‌‌ సన్న ధాన్యం చౌక డిపోలకు సరఫరా చేస్తామని అన్నారు. సన్న ధాన్యానికి క్వింటాల్​కు రూ.2,500 నిర్ణయించినప్పటికీ కిలో బియ్యం ధర రూ.37 మాత్రమే ఉంటుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం రూ.4.27 అదనంగా సబ్సిడీ ఇచ్చి సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు కొంత మేరకైనా గిట్టుబాటు ధర కల్పించాలి. రాష్ట్రానికి పౌరసరఫరాల శాఖ ద్వారా 20 లక్షల టన్నుల బియ్యం అవసరం. రాష్ట్రంలో 87.55 లక్షల రెషన్‌‌ కార్డులుండగా కేంద్రం ఆమోదించింది 53.30 లక్షల కార్డులే. కేంద్రం తలకు 5 కిలోలు నిర్ణయించగా, రాష్ట్రం 6 కిలోలకు పెంచింది. కేంద్రం కేజీకి రూ.29.73 సబ్సిడీ ఇస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,500 కోట్లకు మించి భారం పడదు. ప్రస్తుతం రూ.1,800 కోట్లు భారం భరిస్తున్నది. రూ.700 కోట్లు మాత్రమే అదనంగా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 2019–-20 వానాకాలంలో 47.08 లక్షల టన్నులు, యాసంగి 64.16 లక్షల టన్నులు ధాన్యాన్ని సేకరించింది. అందువలన రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దగా భారం పడదు.

మన వాతావరణం అన్ని పంటలకు అనుకూలం

షరతుల సాగులో రాష్ట్రాలను బహుముఖంగా పంటల్లో అభివృద్ది చేయాలి. తెలంగాణలో సమశీతోష్ణ పరిస్థితుల కారణంగా అన్ని పంటలు పండడానికి అవకాశాలున్నాయి. కానీ, అందుకు తగిన పరిశోధనలు జరగడంలేదు. రాష్ట్రంలో 27 వ్యవసాయ పరిశోధన కేంద్రాలు ఉన్నప్పటికీని, వాటికి తగిన భూములున్నప్పటికీ, 3 వేల ఎకరాల్లో ఇక్రిశాట్‌‌ పరిశోధన కేంద్రం ఉన్నప్పటికీ ఇక్కడ పరిశోధనలకు తిలోదకాలు ఇచ్చి ఐదేండ్లు గడుస్తున్నది. అందువలన టెక్నాలజీని కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే దుస్థితిలో ఉన్నాం. వ్యవసాయ విశ్వవిద్యాలయం, హార్టికల్చర్‌‌ విశ్వవిద్యాలయంతోపాటు పరిశోధకులు సరిపడినంత మంది శాస్త్రవేత్తలున్నారు. వారి సేవలను వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించలేదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పాదకతను పెంచడానికి గల అవకాశాలు వినియోగంలో లేవు. అవసరాలను బట్టి సాగు విస్తీర్ణం తగ్గుతుండగా, జనాభా 1.9% పెరుగుతున్నది. అందువలన ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర అవసరాల మేరకు ఉత్పాదకతను పెంచడంతో పాటు ప్రపంచంలో ఎగుమతికి గల అవకాశాలను పరిశీలించి ఆ వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలి.

విత్తన ఎగుమతులను ప్రోత్సహించాలి

సమశీతోష్ణ పరిస్థితుల కారణంగా తెలంగాణ ‘విత్తన గోదాం’గా అభివృద్ధి చెందింది. రష్యా, టర్కీ, పశ్చిమ దేశాలకు విత్తనాలు ఎగుమతి చేస్తున్నాం. ఇప్పటికీ విత్తనోత్పత్తి రంగంపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో రైతులను కంపెనీల వారు కోట్ల రూపాయల్లో మోసాలు చేస్తున్నారు. సిద్దిపేట, మహబూబ్‌‌నగర్‌‌, జోగులాంబ గద్వాల, మెదక్‌‌, సంగారెడ్డి, వరంగల్‌‌, కరీంనగర్‌‌ తోపాటు మరి కొన్ని జిల్లాలో పెద్దఎత్తున విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రధానంగా కూరగాయల విత్తనాల ఎగుమతికి ప్రాచుర్యం ఉంది. ఈ అవకాశాలను ప్రణాళికాబద్దంగా వినియోగించుకోవాలి. నూనె గింజల కొరతను తీర్చడానికి ఆయిల్‌‌పాం తోటలను పెంచాలని, దీనికి 90% సబ్సిడీ ఇవ్వాలని ప్రణాళికలు ఉన్నాయి. 2017–-18 నాటికి రాష్ట్రంలో 3,490 ఎకరాలలో ఆయిల్‌‌పాం తోటలు వేశారు. మార్చి 2018 నాటికి 45,230 ఎకరాలు వేయాలన్న లక్ష్యం అమలు కాలేదు. ఆయిల్‌‌పాం తోటలు వేయడం వల్ల నూనె కొరత అధిగమించవచ్చు. 3 లక్షల ఎకరాల్లో ఆయిల్‌‌పాం తోటలు వేసే కార్యక్రమానికి పూనాదులు వేయాలి. గతంలో లక్ష ఎకరాలు వేసిన చెరుకు పంట నేడు 50 వేల ఎకరాలకు తగ్గింది. చెరుకు ఉత్పత్తి వల్ల మోలాసిస్‌‌, ఆల్కహాల్‌‌, బయోడీజిల్‌‌ ఉత్పత్తి చేయవచ్చు. ఆయిల్‌‌పాం, చెరుకు పంటల వల్ల డీజిల్‌‌ కొరతను, కాస్మోటిక్స్‌‌ తయారీలో వాడే మూల పదార్థాల కొరతను నివారించవచ్చు. చెరుకును పంచదార కోసమే కాక, మోలాసిస్‌‌ ఉత్పత్తికి అవకాశం కల్పించి అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా వ్యాపారం సాగించవచ్చు.

వరి, పత్తితోనే అభివృద్ధి జరగదు

ధనిక దేశాలు మన దేశాన్ని, రాష్ట్రాన్ని తమ దిగుమతులకు కేంద్రంగా చేసుకునే దుష్ట విధానానికి వ్యతిరేకంగా మనకున్న సాగు భూముల్లో ఉత్పత్తులను పెంచుకునే అవకాశాలు సృష్టించుకోవాలి. అప్పుడే వ్యవసాయ రంగంలో గుర్తింపు పొందిన రాష్ట్రంగా మనం నిలబడతాం. అంతే కానీ వరి, పత్తి పంటలతో వ్యవసాయ రంగం, తద్వారా రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఆశించడం అశాస్త్రీయమే అవుతుంది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ వనరులను వాడుకోవడం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తులు రాష్ట్ర అవసరాలకు పోను ఎగుమతి అవకాశాలు కల్పించుకోవడానికి ప్రణాళికలు రూపొందించాలి. గతంలో టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం ఇజ్రాయిల్‌‌కు పంటల పరిశీలనకు పంపిన కేబినెస్​ కమిటీ సాధించిందేమిటి?

విత్తనంతో వ్యవసాయ విప్లవం

రాష్ట్ర ప్రభుత్వం ధరల నిర్ణాయక సంఘాన్ని ఏర్పాటు చేసి ఉత్పత్తి వ్యయానికి తగిన విధంగా పంటల ధరలను నిర్ణయించాలి. కూరగాయలు తదితర కొన్ని పంటలు పండిన ఉత్పత్తిలో 30 శాతం వినియోగానికి రాక నష్టపోతున్నాయి. రైతులేకాక ప్రభుత్వ ఆదాయం దెబ్బతింటోంది. వ్యవసాయ శాఖ, హార్టికల్చర్‌‌ శాఖ, మార్కెటింగ్‌‌, సివిల్‌‌ సప్లయిస్‌‌ శాఖలను సమన్వయ పరిచి ప్రణాళికలు రూపొందించాలి. వ్యవసాయ, హార్టికల్చర్‌‌ విశ్వవిద్యాలయాలలో ఎంపిక చేసిన రైతులకు గ్రూపుల వారీగా శిక్షణ ఇవ్వాలి. ప్రతి మార్కెట్‌‌ కమిటీ వ్యవసాయ శిక్షణ ఇచ్చే సంస్థలుగా రూపొందాలి. భూసార పరీక్షలు ప్రతి మూడేండ్లకు ఒకసారి జరపాలి. రైతులకు ఫలితాల కార్డులు ఇవ్వాలి. ఆధునిక యంత్రాల ద్వారా వ్యవసాయం చేయడానికి రైతులకు ఉపయోగపడే చిన్న యంత్రాలను పెద్దఎత్తున మార్కెట్‌‌లోకి తేవాలి. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా విత్తనాలను రూపొందించాలి. విత్తనంతోనే వ్యవసాయ రంగంలో విప్లవం వస్తోంది. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలైన పాడి, పౌల్ట్రీ, చిన్న పశువుల పెంపకం, చేపల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ ఆదాయానికి తోడు మరింత ఆదాయాన్ని జతపరచాలి. అప్పడే పల్లె సీమల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ ప్రణాళిక అమలు చేయడం ద్వారా మాత్రమే షరతుల సాగు విధానానికి ఒక రూపం, గుర్తింపు వస్తుంది. దీనికి నిధుల వ్యయం అంతగా ఉండదు. ప్రభుత్వం మధ్య దళారీల ఒత్తిడికి లొంగి విధానాలు మార్చుకోకుండా ఉన్నపుడే ఈ ప్రణాళిక సాధ్యమవుతుంది. చివరికి విదేశీ ఒత్తిడి కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తట్టుకోవాల్సి ఉంటుంది.

మూడ్‌‌ శోభన్‌‌, రాష్ట్ర సహాయ కార్యదర్శి,

తెలంగాణ రైతు సంఘం