కామారెడ్డి జిల్లాలో పొలిటికల్ ​జాతర

  •     నియోజక వర్గాల్లో  జోరుగా యాత్రలు, మీటింగ్స్ 
  •     ఇంటింటికి తిరుగుతున్న  ఆశావహ లీడర్లు
  •     స్థానిక  సమస్యలపై సోషల్​ మీడియాలో చర్చలు
  •     విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వేడి 

కామారెడ్డి , వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు మరి కొన్ని నెలలే ఉండడం.. ముందస్తు ఎన్నికల ప్రచారంతో  ప్రధాన పార్టీలన్ని పల్లెబాట పట్టాయి. ఒక్కో పార్టీ   ఒక్కో ఎజెండాతో  ఇప్పటి నుంచే  ఓటర్లను ప్రసన్నం చేసుకునే  ప్రయత్నాల్లో   బిజీ అయ్యాయి.  దీంతో కామారెడ్డి జిల్లాలోని గ్రామాల్లో నిత్యం పొలిటికల్ జాతర కనిపిస్తోంది.  వెహికల్స్​కాన్వాయ్​, మైక్​ల హోరు,  లీడర్ల హడావుడితో పల్లెల్లో రాజకీయ సందడి కనిపిస్తోంది. ఎన్నికలకు  తొమ్మిది నెలలకు ముందే  ఈ హడావుడి చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.    

జిల్లాలోని  కామారెడ్డి, ఎల్లారెడ్డి,  బాన్స్​వాడ, జుక్కల్​ నియోజక వర్గాల్లోని పల్లెల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు  హడావిడి చేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ వైఫల్యాలు,  నెరవేర్చని హామీలను ప్రతిపక్ష పార్టీలు  ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తుంటే,  అభివృద్ధి పనులు, ప్రవేశ పెట్టిన కొత్త పథకాల గురించి వివరిస్తూ  బీఆర్ఎస్​ముందుకు సాగుతోంది. బీజేపీ ‘పల్లె గోస బీజేపీ భరోసా యాత్ర’  కార్నర్​ మీటింగ్స్​, శక్తి కేంద్రాల మీటింగ్​లను కమలనాథుల నిర్వహిస్తుండగా, హాత్​సే హాత్​జోడో యాత్ర పేరుతో హస్తం పార్టీ లీడర్లు ప్రజల్లోకి వెళ్తున్నారు. బడుగు బలహీన వర్గాలను ఆకర్షించేలా  బీఎస్​పీ  చీఫ్​ కూడా  ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ పర్యటిస్తున్నారు.   

పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్​..

జిల్లాలో సిట్టింగ్​ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్​కు చెందిన వారే కావడంతో,  మళ్లీ తమ పట్టు నిలుపుకునేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పడరాని పాట్లు పడుతున్నారు.   బాన్సువాడలో స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి  ‘డబుల్’ ఇండ్ల ప్రారంభం, ఇతర డెవలప్​మెంట్ ప్రోగ్రాం పనులను పరిశీలిస్తూ  నిరంతరం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు.  జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్​షిండే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు  చేస్తూ .. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే  సురేందర్​రోజులో ఎక్కువ సేపు ప్రజలతో గడిపేందుకు కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు.  ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ 
మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులతో మమేకమవుతున్నారు.  

‘హాత్​సే హాత్​ జోడో యాత్ర’ తో హస్తం లీడర్లు..

హాత్​ సే హాత్​ జోడో యాత్ర పేరిట హస్తం లీడర్లు   బాట పట్టారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు తీస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో మాజీ మంత్రి షబ్బీర్​అలీ ర్యాలీలకు హాజరవుతూ  కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ  స్థానికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.  మహిళా కాంగ్రెస్​ స్టేట్​ ప్రెసిడెంట్​ సునీతారావు  కూడా  కామారెడ్డి టౌన్​లో పర్యటించారు.  ఎల్లారెడ్డిలో  ఇద్దరు  లీడర్లు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  సదాశివనగర్,  గాంధారి, తాడ్వాయి, లింగంపేట, ఎల్లారెడ్డి లో వడ్డేపల్లి సుభాష్​రెడ్డి,  కె. మదన్​మోహన్​రావు పోటాపోటీగా పర్యటిస్తున్నారు.  జుక్కల్​లో మాజీ ఎమ్మెల్యే గంగారం  పర్యటిస్తూ  కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే చేసే పనుల గురించి వివరిస్తున్నారు. ఇక్కడ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఎన్ఆర్ఐ  లక్ష్మీకాంతారావు కూడా నియోజకవర్గంలో తిరుగుతూ  మమేకమయ్యే పనిలో నిమగ్నమయ్యారు. బాన్స్​వాడలో నియోజకవర్గ ఇన్​చార్జి కాసుల బాల్​రాజు జోరుగా మీటింగ్స్​నిర్వహిస్తూ అధికార బీఆర్ఎస్​పై విమర్శలు గుప్పిస్తున్నారు.  ఇలా జిల్లాలోని సమస్యలపై  సోషల్​మీడియాలో పోస్టులు,  విమర్శలు, ప్రతి విమర్శలతో  పల్లెల్లో పొలిటికల్​హీట్​పెరుగుతోంది.