- మహబూబాబాద్ జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైన్స్ ఓనర్లు
- సిండికేట్‌గా మారి అదనపు వసూళ్లు
- ఆటోల్లో డైరెక్ట్‌గా బెల్ట్ షాపులకే లిక్కర్ సరఫరా
మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలో మద్యం దందా జోరుగా సాగుతోంది. షాపులు దక్కించుకున్న ఓనర్లు సిండికేట్‌గా మారి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మార్పీకి అమ్మితే గిట్టుబాటు కాదంటూ ప్రతి బ్రాండ్‌కు రూ. 20 అదనంగా వసూలు చేస్తున్నారు. తాజాగా లిక్కర్‌ను ఆటోలు, వివిధ వాహనాల ద్వారా నేరుగా బెల్ట్‌షాపులకే తరలించి అక్కడి నుంచి వీలైనంత ఎక్కువ అమ్మకాలు సాగించేలా ప్లాన్ చేస్తున్నారు.
బాటిళ్లకు స్టిక్కర్లు, స్టాంపులు
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 59 లిక్కర్ షాపులు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం అయ్యాయి. మూడు నెలలైనా పూర్తి కాకుండానే మహబూబాబాద్, మరిపెడ, చిన్నగూడురు, కురవి, డోర్నకల్, సీరోల్, ఇనుగుర్తి, కేసముద్రం, నెల్లికుదురు, నరసింహులపేట మండలాలతో పాటు ఇతర మండలాలకు చెందిన వైన్స్ ఓనర్లు సిండికేట్‌గా మారారు.
బాటిల్స్ రేటు పెంచడంతో పాటు, బెల్ట్ షాపుల్లో ఇతర మండలాలకు చెందిన లిక్కర్ అమ్మకుండా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మద్యం బాటిల్స్‌కు సిండికేట్ నిర్వాహకులు ప్రత్యేక స్టిక్కర్లు, స్టాంపులు వేస్తున్నారు. బెల్ట్ షాపు నిర్వాహకులు ఎవరైనా ఇతర మండలాల నుంచి లిక్కర్ తీసుకొస్తే తమ ప్రైవేట్ సైన్యంతో తనిఖీలు చేయిస్తూ ఇతర షాపుల లిక్కర్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, కేసులు పెట్టిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. వైన్స్ ఓనర్లు బెల్ట్ షాపు నిర్వాహకుల నుంచి రూ. 20 అదనంగా వసూలు చేస్తుండగా, వారు గ్రామాల్లో మరింత పెంచి అమ్ముతున్నారు.
డిపాజిట్ల కోసం ఒత్తిడి
బెల్ట్ షాపు నిర్వాహకుల నుంచి డిపాజిట్లు తీసుకునేందుకు వైన్స్ ఓనర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో బెల్ట్ షాపు నిర్వహణకు రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు డిపాజిట్ కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు చాలా మంది బెల్ట్ షాపు నిర్వాహకులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో వైన్స్ ఓనర్లతో వాగ్వాదం జరగడంతో డిపాజిట్ సేకరణ తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు సమాచారం.
బెల్ట్ షాపులకు డోర్ డెలివరీ
మరిపెడ, వెలుగు : మద్యం బాటిళ్లను బెల్ట్ షాపునకు డోర్ డెలివరీ చేస్తున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో వైరల్‌గా మారింది. మరిపెడకు చెందిన వైన్స్ ఓనర్లు సిండికేట్‌గా మారి లిక్కర్ కాటన్లను ఆటోలో తీసుకొని వచ్చి బెల్ట్ షాపులకు సప్లై చేస్తున్నారు. ఎల్లంపేట స్టేజీ వద్ద లిక్కర్ బాటిల్స్‌తో వాహనంలో ఉన్న ఓ వ్యక్తిని పట్టుకొని ప్రశ్నించగా వాగ్వాదం జరిగింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఒక్క లైసెన్స్.. రెండు షాపులు
కొత్తగూడ, వెలుగు : వైన్స్ నిర్వహణకు ప్రభుత్వం ఒక్కో షాప్‌కు ఒక్కో లైసెన్స్ మాత్రమే ఇస్తుంది. కానీ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోని గణేశ్ వైన్స్ నిర్వాహకులు మాత్రం ఒకే లైసెన్స్‌తో రెండు వేర్వేరు షాపులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఒక షాపులో రిటైల్‌గా లిక్కర్ అమ్ముతుండగా, మరో షాపులో హోల్‌సేల్‌గా బెల్ట్‌షాపులకు అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ ఆఫీసర్లు మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బెల్ట్ షాపులను నియంత్రించాలి
గ్రామాల్లో ఎక్కువగా బెల్ట్ షాపులు ఉండడం, విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బెల్ట్ షాపుల మూలంగా గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి. వీటి నియంత్రణకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి.
- ఒర్రె కవిత, ఇనుగుర్తి