- ఎంక్వైరీకి ఆదేశించిన ఎస్పీ
గద్వాల, వెలుగు : జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న మొబైల్ పేకాటకు పోలీసులు సహకరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఎస్పీ శ్రీనివాసరావు ఈ వ్యవహారంపై అడిషనల్ ఎస్పీ గుణశేఖర్ ను ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ప్లేస్ ను ముందుగానే ఫిక్స్ చేసి పేకాటరాయుళ్లకు సమాచారం ఇచ్చి లక్షల్లో పేకాట ఆడిస్తున్నట్లు సమాచారం. ఒక్కోసారి రూ.30 లక్షల నుంచి రూ. కోటి వరకు పేకాట ఆడిస్తారనే టాక్ నడుస్తోంది.
అందర్ బాహర్..మినిమం రూ.5 వేలు
మొబైల్ పేకాటలో భాగంగా అందర్ బాహర్(లోపల, బయట) ఆట ఆడిస్తున్నారు. మినిమం రూ.5 వేలు ఆడాలని రూల్ పెట్టారని, ఒక వ్యక్తి ఆట ఆడడానికి వస్తే రూ.2 వేల ఎంట్రీ ఫీజు నిర్ణయించినట్లు తెలిసింది. రాయలసీమలోని కర్నూల్, నంద్యాల, డోన్, అనంతపురం, తాడిపత్రితో పాటు ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల, వనపర్తి, గద్వాల, పెబ్బేరు ప్రాంతాల నుంచి 100 మంది వరకు పేకాట ఆడేందుకు వస్తున్నట్లు సమాచారం.
ఒక్కొక్కరి నుంచి రూ. 2 వేలతో పాటు ఆటలో ప్రతిసారి కొంత మొత్తం నిర్వాహకులకు ఇవ్వాలి. ఇలా పేకాట ఆడిస్తున్న నిర్వాహకులు పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు. ఈ డబ్బుతో అందరిని మేనేజ్ చేస్తున్నారని అంటున్నారు.
దొరికిన డబ్బు ఎంత?
గత శనివారం ఎస్బీ పోలీసులు రైడ్ చేసి పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పెద్ద మొత్తంలో డబ్బులు దొరికినా, రూ.రెండు లక్షల వరకు దొరికాయని, 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే రూ.25 లక్షలకు పైగా డబ్బు దొరికిందనే ప్రచారం జరుగుతోంది. ఈ దాడుల్లో15 సెల్ ఫోన్లు మాత్రమే స్వాధీనం చేసుకోవడం, ఒక్క బైక్ కూడా దొరకలేదని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
15 మంది పేకాట రాయుళ్లు బైకులు లేకుండా ఒకే చోటకు ఎలా వచ్చారనే విషయంపై పోలీసులు సమాధానం చెప్పలేకపోతున్నారు. అలాగే జూన్ 30న పేకాట స్థావరంపై దాడి ఘటనలో రూ.24 వేలు పట్టుకున్నట్లు చూపించారు. అప్పుడు కూడా పెద్ద మొత్తంలో దొరికిన డబ్బును పక్కదారి పట్టించారనే ఆరోపణలున్నాయి.
అన్నీ అనుమానాలే..
ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారో గుర్తించి లొకేషన్ ను అక్కడి పోలీసులకు అందించాలి. అయితే ఎస్బీ పోలీసులు దాడి చేయడం ఏమిటని అంటున్నారు. డబ్బులు తక్కువగా దొరికినట్లు చూపించారని, కొందరి దగ్గర డబ్బు, బంగారు లాక్కున్నారనే ఆరోపణలున్నాయి. ఇక కర్నూల్ స్పెషల్ బ్రాంచ్ కు చెందిన ఓ సీఐ స్థాయి ఆఫీసర్ తో పాటు మరో ఇద్దరిని ఈ కేసు నుంచి తప్పించారని అంటున్నారు. వీటన్నింటిపై ఎంక్వైరీ చేయాల్సి ఉంది.