134 ఏళ్ల రికార్డు బద్దలు.. ఒక ఓవర్‌లో 43 పరుగులు

134 ఏళ్ల రికార్డు బద్దలు.. ఒక ఓవర్‌లో 43 పరుగులు

ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో రికార్డులు బద్ధలవుతున్నాయి. రెండ్రోజుల క్రితం సర్రే బ్యాటర్ డాన్ లారెన్స్‌.. వోర్సెస్టర్‌షైర్ స్పిన్నర్ షోయబ్ బషీర్‌ను ఊచకోత కోస్తూ రాబట్టిన 38 పరుగులు రికార్డు.. గంటల వ్యవధిలోనే కనుమరుగైంది. ఇంగ్లీష్ యువ బ్యాటర్ ఒకరు ఏకంగా ఒక ఓవర్‌లో 43 పరుగులు రాబట్టాడు. పోనీ, అతనికి బంతులు సంధించిన బౌలర్.. పేలవమైనవాడా అంటే కాదు. గంటకు 145 కి.మీ వేగంగా నిలకడగా బంతులేయగల సమర్థుడు. ప్రపంచ అత్యుత్తమ పేసర్లలో ఒకరు. 

ఇంగ్లండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ బౌలింగ్‌ను.. ఓ అనామక బ్యాటర్ తునాతునకలు చేశాడు. అతను పేరు.. లూయిస్ కింబర్. ఇంగ్లాండ్ కౌంటీ జట్టు లీసెస్టర్‌షైర్ మిడిల్ ఆర్డర్ బ్యాటరైన కింబర్.. రాబిన్సన్ వేసిన 59వ ఓవర్‌లో ఓవర్‌లో కింబర్ 43 పరుగులు రాబట్టాడు. రెండు సిక్స్‌లు, ఆరు ఫోర్లు, ఒక సింగిల్‌తో 43 పరుగులు చేశాడు. మరో 6 పరుగులు నో బాల్స్ ఎక్సట్రాల రూపంలో వచ్చాయి. తద్వారా 134 ఏళ్ళ రికార్డు బద్దలైంది. 1998లో సర్రే వర్సెస్ లంకాషైర్ పోటీలో మాజీ టెస్ట్ పేసర్ అలెక్స్ ట్యూడర్ బౌలింగ్‌లో ఆండ్రూ ఫ్లింటాఫ్ చేసిన 34 పరుగులు ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకూ అత్యధికం.

 ఒక ఓవర్‌లో 77 పరుగులు

అయితే, ఫస్ట్-క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ 1990లో నమోదైంది. 1989/90లో వెల్లింగ్‌టన్ vs కాంటర్‌బరీ మధ్య జరిగిన మ్యాచ్ లో వెల్లింగ్టన్ బౌలర్ బెర్ట్ వాన్స్ ఒక ఓవర్‌లో 77 పరుగులు ఇచ్చాడు. 17 నో బాల్స్‌ సహా 22 బంతులేశాడు. అయినప్పటికీ, ఓవర్ పూర్తి కాలేదు. చట్టబద్ధంగా ఐదు బంతులు మాత్రమే వేశాడు.