పెండ్లికి ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్య

జగిత్యాల క్రైం, వెలుగు: పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ హైదర్ పల్లి గ్రామానికి చెందిన నలువాల మధు.. అదే ప్రాంతానికి చెందిన సౌమ్య అనే యువతి ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలిసిన ఇరు కుటుంబాల సభ్యులు నిరాకరించడంతో వారం కిందట మధు, సౌమ్య హైదర్ పల్లిలోని పాడుబడిన ఇంట్లో పురుగుల మందు తాగి ఒకే తాడుకు ఉరివేసుకున్నారు. రెండ్రోజుల నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు కంప్లైంట్ చేయడంతో తనిఖీ చేయగా ఇద్దరి శవాలు కుళ్లిన స్థితిలో కనిపించాయని పోలీసులు తెలిపారు. వీళ్లపై వారం కిందటే మిస్సింగ్ కేసు నమోదయిందని, మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు ధర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

చికిత్స పొందుతూ..

సదాశివపేట వెలుగు: ఒకరినొకరు ప్రేమించుకున్నా.. కుటుంబసభ్యులు ఒప్పుకోక అమ్మాయికి మరొకరితో పెళ్లి చేశారు. అమ్మాయికి పెళ్లయి ఐదేండ్లయినా వారు తమ ప్రేమను మరిచిపోలేకపోయారు. ఇద్దరు కలసి చనిపోవాలని నిర్ణయించుకుని..  రెండు రోజుల కింద ఆత్మహత్య ప్రయత్నం చేశారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ఖమ్మంపల్లికి  చెందిన సంపత్ కుమార్ (26), మునిపల్లి గ్రామానికి చెందిన పార్వతి  (24) ప్రేమించుకున్నారు. ఆమె తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించకుండా సదాశివపేట మండలం పొట్టిపల్లికి  గ్రామానికి చెందినయువకుడితో పెళ్లి చేశారు.  వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఈ నెల 5న ఇంట్లో నుంచి పారిపోయిన పార్వతి, సంపత్  శనివారం సాయంత్రం నార్సింగ్ మంచిరేవుల దగ్గర కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగారు. సంపత్ తన స్నేహితుడికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. స్నేహితులు పోలీసుల సాయంతో వారిని ఆసుపత్రికి తరలించగా.. ఆదివారం రాత్రి చనిపోయారు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.