ప్రేమజంట నిర్బంధం.. వివాదంలో భవానిపురం పోలీస్ స్టేషన్

ప్రేమజంట నిర్బంధం.. వివాదంలో భవానిపురం పోలీస్ స్టేషన్

విజయవాడలోని భవానిపురం పోలీస్ స్టేషన్ మరోసారి వివాదంలో నిలిచింది. పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంటను భవానిపురం పోలీసులు నిర్బంధించారని కథనాలు వస్తున్నాయి. యువతి తరుపు బంధువులతో పోలీసులు కుమ్మక్కైనట్లు వరుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

పారిపోయి పెళ్ళి

విజయవాడకు చెందిన శివ (33), అలేఖ్య(26) గత పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. పెళ్లికి ససేమిరా అన్నారు. దాంతో, యువతీ యువకుడు ఇంటి నుంచి పారిపోయి ఆగస్టు 15న వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు రక్షణ కల్పించాలంటూ తిరుచానూరు పోలీసులను ఆశ్రయించారు. అదే సమయంలో తమ కుమార్తె(అలేఖ్య) కనిపించడం లేదని యువతి తల్లిదండ్రులు విజయవాడ భవాని పురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

యువతి యువకుడు తిరుచానూరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుసుకున్న వధువు తరుపు బంధువులు గంటల వ్యవధిలోనే అక్కడికి చేరుకున్నారు. స్టేషన్ ఆవరణలోనే ప్రేమ జంటపై దాడికి దిగారు. తిరుచానూరు పోలీసులు వారికి వార్నింగ్ ఇవ్వడంతో అక్కడి నుండి జారుకున్నారు. 

ఈ దాడి అనంతరం ప్రేమజంటను తమ ఆధీనంలోకి తీసుకున్న భవానిపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది విజయవాడ తీసుకొచ్చి వారిని స్టేషన్‌లో నిర్బంధించారు. యువతీయువకుడు మేజర్లు అయినప్పటికీ, నిర్బంధించడం ఏంటని యువకుడి తరపు బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఎస్సై, సీఐ యువతి బంధువులతో కుమ్మకక్కయ్యారని ఆరోపిస్తున్నారు. పోలీస్ కమిషనర్‪ను కలిసి ఈ ఘటనపై ఫిర్యాదు చేయనున్నట్లు యువకుడి బంధువులు వెల్లడించారు.

కాగా, తనను ఎవరూ కిడ్నాప్ చేసి తీసుకెళ్లలేదని వధువు అలేఖ్య స్పష్టం చేసింది. పదేళ్ల నుంచి శివ, తాను ప్రేమించుకున్నట్లు వెల్లడించింది. తనను ఎవరూ ఒత్తిడి చేయలేదని, ఇష్టపూర్వకంగా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపింది. తన తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదని, వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతోంది.