భద్రాచలం, వెలుగు: పెండ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదని ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ఓ ప్రేమజంట శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేటకు చెందిన జాహ్నవి(19), గణేశ్(20) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో గత మంగళవారం ఇంటి నుంచి వెళ్లిపోయి పెండ్లి చేసుకున్నట్లు బంధువులకు తెలిసింది. దీంతో గణేశ్ బావపై జాహ్నవి బంధువులు దాడి చేశారు.
విషయం తెలుసుకున్న జాహ్నవి, గణేశ్ తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోనందున చనిపోవాలనుకుంటున్నట్లుగా సెల్ఫీ వీడియో తీసి శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారి ఫోన్‌నంబర్‌ను ట్రేస్ చేసి సారపాక సమీపంలోని వారు ఉన్న లొకేషన్‌కు వెళ్లారు. అప్పటికే వారు ఇద్దరూ పురుగుల మందు తాగిపడిపోయారు. వెంటనే వారిని పోలీసులు భద్రాచలం ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.