కేసీఆర్ కు కొడుకుపైనే ప్రేమ.. రైతుల మీద లేదు: రేవంత్ రెడ్డి

వరంగల్ లో కేటీఆర్ షో చేశారు

నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు ఇవ్వాలి

ఇందుకోసం రూ.వెయ్యి కోట్లు రిలీజ్ చేయాలి

సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ

హైదరాబాద్, వెలుగు: ‘మీకు ప్రత్యామ్నాయంగా కేటీఆర్ ను చూపించే తాపత్రయం తప్ప, ప్రజల కష్టాలను, రైతుల ఆవేదనను తీర్చే చిత్తశుద్ధి మీ చర్యల్లో ఇసుమంతైనా లేదు. మీకు కొడుకుపై ఉన్న ప్రేమ రైతులపై లేదు..” అని సీఎం కేసీఆర్ నుద్దేశించి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. వర్షాలు– పంట నష్టం పై సీఎం కేసీఆర్ కు రేవంత్ బుధవారం లెటర్ రాశారు. కొడుకు వారసత్వాన్ని పటిష్టం చేయడానికి ఈ సమయాన్ని కూడా సీఎం వాడుకున్నారని విమర్శించారు. వరంగల్ లో మున్సిపల్ మంత్రి కేటీఆర్ షో చేసి బాధ్యత తీర్చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్, భూపాలపల్లి, ములుగు, జనగామ, కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతోపాటు దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా నష్టం జరిగిందన్నారు.

వరికి నష్టం జరగలేదా?

ఈ వర్షాలతో వరి పంటకు నష్టం లేదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటన చేయడం దారుణమన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రెండేండ్లు రైతులు కట్టిన ప్రీమియం డబ్బు బీమా కంపెనీ ఖాతాల్లోనే మూలుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతో బీమా కంపెనీల నుంచి రైతులకు అందాల్సిన రూ.960 కోట్లు ఆగిపోయాయన్నారు. వ్యవసాయశాఖ మంత్రి కింది స్థాయిలో పర్యటించి పంటనష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు ఇవ్వాలని, దీని కోసం రూ.వెయ్యి కోట్లు రిలీజ్ చేయాలన్నారు. ఎరువుల కొరత తీర్చాలని, విత్తనాలు అందుబాటులో ఉంచాలని కోరారు. వ్యవసాయ భూముల్లో ఇసుక మేటలను తొలగించు కునేందుకు ఎకరాకు రూ.5 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రియాంక వర్గం లో చేరలేదు

తాను ప్రియాంకా గాంధీ వర్గంలో చేరానని, ఆమె నాయకత్వాన్ని ప్రమోట్ చేస్తున్నానని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు రేవంత్ చెప్పారు. కాంగ్రెస్​లో వర్గాలు లేవని, అందరం కలిసి పని చేస్తున్నామన్నారు.