తేజశ్రీ కేసులో నిందితుడిని తప్పించే కుట్ర : కిషన్​రెడ్డి

నిజామాబాద్, వెలుగు : ప్రేమ పేరుతో నమ్మించి తేజశ్రీని హత్య చేయడానికి కుట్ర పన్నిన నిందితుడి విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​చీఫ్​కిషన్​రెడ్డి డిమాండ్​ చేశారు. మంగళవారం సాయంత్రం జీజీహెచ్​ హాస్పిటల్​కు వచ్చిన ఆయన వెంటిలేటర్​పై ట్రీట్​మెంట్​పొందుతున్న తేజశ్రీ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ నిర్భయ, హైదరాబాద్​లో యువతిపై జరిగిన దారుణ ఘటనకు తేజశ్రీ ఉదంతం తక్కువేమీకాదన్నారు. 

నిందితుడు గంజాయి మత్తులో ఉన్నాడని, సైకో అని పోలీసులు చెప్పడం రేపు కోర్టులో అతన్ని తప్పించడానికేనన్నారు. రాజకీయ ఒత్తిళ్ల మధ్య పనిచేయొద్దని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. వెంటిలేటర్​పై చావుబతుకుల మధ్య పోరాడుతున్న యువతి ఒంటిపై తీవ్రగాయాలున్నాయని, హింసించిన ఆధారాలు కనిపిస్తున్నాయన్నారు. నిందితుడిని శిక్షించాలని ఎమ్మార్పీఎస్​ నాయకులు ధర్నా చేస్తే పోలీసులు వారిని అరెస్టు చేయడమేమీటన్నారు. తేజశ్రీ ట్రీట్​మెంట్ ​విషయంలో కూడా మొదటి నుంచి నిర్లక్ష్యం కనిపిస్తోందని  అభిప్రాయపడ్డారు. 

ఎంఐఎం అండతో ఘోరాలు

మజ్లిస్ ​పార్టీ అండతో రాష్ట్రంలో లవ్​జిహాద్​ఘటనలు జరుగుతున్నాయని కిషన్​రెడ్డి ఆరోపించారు. జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను ఆయన ప్రస్తావించారు. పేద యువతులను లక్ష్యంగా చేసుకొని ఒక వర్గం వారు ప్రేమపేరుతో లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.  కేరళలో లవ్​జిహాద్​ పేరుతో హిందూ, క్రిస్టియన్​యువతుల జాడలేకుండా చేస్తున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లవ్​జిహాద్​ నిషేధిస్తూ చట్టాలు చేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, దినేశ్​కులాచారి ఉన్నారు.