ప్రేమ ఫెయిలైందని ప్రాణాలు తీసుకున్నారు

ప్రేమ విఫలమైందని ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట, ఆదిలాబాద్​ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం మరిమాముల గ్రామానికి చెందిన అనిల్(23) మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తండ్రి తన కుమారుడు కడుపునొప్పి భరించలేక గ్రామ శివారులో  పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మద్దూరు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ యువకుడు అతడి చావుకు కారణాలు చెబుతూ తీసుకున్న సెల్ఫీ వీడియో బుధవారం  వెలుగులోకి వచ్చింది.  మృతుని సెల్​ఫోన్​లోని వీడియోను గమనించిన కొందరు సన్నిహితులు దాన్ని సామాజిక మాధ్యమాల్లో అప్​లోడ్​చేశారు. అనిల్​వీడియోలో తాను  అదే గ్రామానికి చెందిన  ఓ యువతిని కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నానని, యువతి తండ్రికి ఈ విషయం తెలిసి కొన్ని రోజులుగా తనను పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడని తెలిపాడు. ఇటీవల ఆమె నిశ్చితార్థం  వేరే అబ్బాయితో జరిగిందని, అది చూసి తట్టుకోలేకపోయానని… ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని చెబుతూ పురుగుల మందు తాగాడు. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాలు గమనించకుండా ఒత్తిడి పెట్టవద్దని, పిల్లల మీద ఒత్తిడి తెచ్చే మీరు పీఎం, సీఎంలు అయ్యారా అని ప్రశ్నించాడు. దాదాపు 8 నిమిషాల వీడియోలో తన ప్రేమ, బాధ,  ఆవేశం, ఆవేదన తెలియజేశాడు. జిల్లాలో ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది.

ఉరేసుకుని…

ఎదులాపురం, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా గుడిహత్నూర్‍ మండలం మన్నూర్‍ గ్రామానికి చెందిన ఓంకార్‍(20) కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‍కు డ్యాన్స్ నేర్చుకునే నిమిత్తం వెళ్లాడు. ఈ క్రమంలో హైదరాబాద్‍లో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇటీవల ఆ అమ్మాయికి పెండ్లి కుదరడంతో తనకు దక్కదనే మనస్తాపానికి గురయ్యాడు. ఈ నెల 19న హైదరాబాద్‍ నుంచి ఆదిలాబాద్‍కు వచ్చాడు. అప్పటి నుంచి ఆదిలాబాద్‍లోని లాడ్జ్ లో ఉంటున్నాడు. మంగళవారం రాత్రి తాను ఉంటున్న రూమ్‍లో ఫ్యాన్‍కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం గమనించిన లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వన్‍ టౌన్‍ సీఐ  సురేష్‍, ఎస్సై గుణవంత్​ సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రిమ్స్ హాస్పిటల్​కు తరలించారు.