హైదరాబాద్లో విషాదం.. లవర్ ఫ్యామిలీ వార్నింగ్.. ఊహించని ఎండింగ్

హైదరాబాద్లో విషాదం.. లవర్ ఫ్యామిలీ వార్నింగ్.. ఊహించని ఎండింగ్

మేడ్చల్ జిల్లా: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహంకాళి నగర్లో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఓ యువతి,  సునీల్ అనే డిగ్రీ విద్యార్థి మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వీరి ప్రేమను తిరస్కరించారు. అయినప్పటికీ ఆ యువతి, సునీల్ ప్రేమను కొనసాగించడంతో యువతి కుటుంబం ఆగ్రహానికి లోనైంది. అగ్ర కులానికి చెందిన తమ అమ్మాయి వెంటపడొద్దని యువతి బంధువులు సోమవారం రాత్రి సునీల్ ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటనతో కుటుంబం పరువు పోయిందని సునీల్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. 

నలుగురిలో కలిసి తిరిగే స్వభావం కావడంతో తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఇకపై ఉండదని తీవ్రంగా చింతించాడు. జరిగిన పరిణామాన్ని అవమానంగా భావించిన సునీల్ ఈరోజు ఉదయం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సునీల్ ఇంటిపై దాడి చేసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటన స్థానికులను షాక్ కు గురిచేసింది. బస్తీలో అందరితో ఎంతో స్నేహంగా ఉండే సునీల్ ఆత్మహత్య చేసుకోవడాన్ని స్నేహితులు జీర్ణించుకోలేకపోయారు.