కోనరావుపేట, వెలుగు : తమ పెండ్లికి పెద్దలు ఒప్పుకోరని ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. రాజన్న సిరిసిల్లలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన సామల శ్రీధర్ (20) టెక్స్ టైల్పార్కులో ఐటీఐ సెకండియర్చదువుతున్నాడు. శ్రీధర్, ఓ యువతి (17) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, తమ పెండ్లికి పెద్దలు ఒప్పుకోరని ఇద్దరూ మూడు రోజుల కింద ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు.
దీంతో తమ కూతురు కనిపించడం లేదని యువతి తల్లిదండ్రులు తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బుధవారం సాయంత్రం కనగర్తి, మామిడిపల్లి గ్రామాల మధ్య మూలవాగులో పత్తిచేను వద్ద యువతి, యువకుడు చనిపోయి ఉండడం చూసి గొర్రెల కాపరులు గ్రామస్తులకు సమాచారమిచ్చారు. పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్రేమికుల మృతదేహాల పక్కన గడ్డిమందు డబ్బా ఉండడంతో అది తాగి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. సిరిసిల్ల రూరల్ సీఐ సదన్ కుమార్, ఎస్సైలు ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, ఏఎస్సై శ్రీనివాస్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.