ప్రేమ పెండ్లికి పేరెంట్స్‌‌ ఒప్పుకోవడం లేదని యువతి ఆత్మహత్య

ప్రేమ పెండ్లికి పేరెంట్స్‌‌ ఒప్పుకోవడం లేదని యువతి ఆత్మహత్య
  • మనస్తాపంతో పురుగుల మందు తాగి యువకుడు మృతి

కోల్​బెల్ట్/బెల్లంపల్లి రూరల్, వెలుగు: ప్రేమ పెండ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న యువకుడు మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి చనిపోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టు, నెన్నెల మండలం చిత్తాపూర్‌‌ గ్రామంలో జరిగింది. మామిడిగట్టు గ్రామానికి చెందిన నాంపెల్లి సంగీత (21) డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది.

సంగీత నెన్నెల మండలం చిత్తాపూర్‌‌ గ్రామానికి చెందిన తీగుళ్ల భగవాన్‌‌ (24) కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. బుధవారం సంగీత ఇంట్లో పెండ్లి ప్రస్తావన రావడంతో ప్రేమ పెళ్లి వద్దంటూ తల్లి మందలించింది. తర్వాత తండ్రి ఓదెలు, తల్లి గంగ పనికోసం బయటకు వెళ్లగానే సంగీత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు రామకృష్ణాపూర్‌‌ ఎస్సై రాజశేఖర్‌‌ చెప్పారు. అయితే సంగీత మరణవార్త తెలుసుకున్న భగవాన్‌‌ బుధవారం సాయంత్రం బెల్లంపల్లి మండలం దుగినేపల్లి సమీపంలోని మామిడితోట వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసనట్లు తాళ్లగురిజాల ఎస్సై నరేశ్‌‌ చెప్పారు.