- తండ్రి మందలింపుతో ఇద్దరి ఆత్మహత్య
- వరంగల్ జిల్లా రామచంద్రుని చెరువులో దూకిన జంట
- మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు
రాయపర్తి, వెలుగు: పెండ్లయి ఇద్దరు పిల్లలున్నయువకుడు వరుసకు చెల్లెలయ్యే యువతిని ప్రేమించాడు. ఇంట్లో తెలిసి తండ్రి మందలించడంతో ప్రేమించిన యువతితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా పగిడపల్లి గ్రామం మధ్యగూడెం ప్రాంతానికి చెందిన సాంగాల దిలీప్(28)కు కొంత కాలం కిందట పెండ్లయి ఇద్దరు బిడ్డలున్నారు. వరంగల్ హంటర్ రోడ్డు సమీపంలోని టైల్స్ సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలం కిందట అతడి గ్రామానికే చెందిన వరుసకు చెల్లెలయ్యే తిక్క అంజలి(25)తో ప్రేమలో పడ్డాడు. ఆమె నర్సింగ్ చేస్తోంది.
ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో తండ్రి గణపతి కొడుకును మందలించాడు. ఆదివారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని చెప్పిన దిలీప్ బయటకు వెళ్లాడు. ఇంటికి రాకపోవడంతో ఎక్కడికో వెళ్లి ఉంటాడని అనుకున్నారు. ఆదివారం ఇద్దరూ కలిసి వరంగల్ జిల్లా రాయపర్తిలోని రామచంద్రుని చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నారు. వర్ధన్నపేట ఏసీపీ అంబటి నరసయ్య, సీఐ సురేశ్, ఎస్సై ప్రవీణ్ క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. దూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.