తక్కువ ఖర్చు.. పర్ఫెక్ట్ రిజల్ట్

  • మ్యుటేషన్స్‌‌ గుర్తించే జినోమ్ టెక్నిక్‌‌కు రూ.9 కోట్ల ఫిన్‌‌లాండ్ టెక్నాలజీ అకాడమీ ప్రైజ్

జినోమ్ సీక్వెన్సింగ్‌‌లో సరికొత్త టెక్నిక్‌‌ను డెవలప్ చేసిన ఇద్దరు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సైంటిస్టులు సుమారు తొమ్మిది కోట్ల రూపాయల ప్రైజ్ గెలుచుకున్నారు. ఆ ఇద్దరు సైంటిస్టుల్లో ఒకరు యూకేకు చెందిన డేవిడ్ క్లెనెర్‌‌‌‌మ్యాన్ కాగా.. మరొకరు ఇండియన్ శాస్త్రవేత్త శంకర్ బాలసుబ్రమణియన్ కావడం విశేషం. వాళ్లు డెవలప్‌‌ చేసిన రెవెల్యూషనరీ డీఎన్‌‌ఏ సీక్వెన్సింగ్ టెక్నాలజీ ద్వారా కరోనా సహా కేన్సర్ వంటి జబ్బులకు సంబంధించిన మ్యుటేషన్లను తక్కువ ఖర్చులో, ఫాస్ట్‌‌గా, కచ్చితత్వంతో గుర్తించవచ్చు. దీనికి ఆ శాస్త్రవేత్తలిద్దరూ సొలెక్సా ఇల్యుమినియా నెక్స్ట్ జనరేషన్ డీఎన్‌‌ఏ సీక్వెన్సింగ్ అని పేరు పెట్టారు. ఒకేసారి లార్జ్‌‌ స్కేల్‌‌లో సీక్వెన్సింగ్‌‌  చేయగలిగే ఈ టెక్నిక్‌‌కు 2020కి గానూ ఫిన్‌‌లాండ్ టెక్నాలజీ అకాడమీ మిలినియం టెక్నాలజీ ప్రైజ్‌‌ను ప్రకటించింది. ఈ ఫిన్‌‌లాండ్ సంస్థ 2004 నుంచి ప్రతి రెండేండ్లకోసారి ఈ ప్రైజ్‌‌ను ప్రకటిస్తూ వస్తోంది.

కరోనాపై ప్రయోగాల్లో కీ రోల్
ఈ సరికొత్త జినోమ్‌‌ టెక్నిక్‌‌ను సైంటిస్టులు కరోనా మహమ్మారి మొదలవడానికి పదేండ్ల క్రితమే డెవలప్‌‌ చేశారు. ఈ టెక్నాలజీని డెవలప్ చేసిన తర్వాత సొలెక్సా అనే పేరుతో సైంటిస్టులిద్దరూ కలిసి కంపెనీని ప్రారంభించారు. దీని ద్వారా టెక్నాలజీని ప్రపంచ దేశాలకు షేర్ చేశారు. ఈ నెక్స్ట్ జెనరేషన్ డీఎన్‌‌ఏ సీక్వెన్సింగ్ టెక్నిక్ 2014 నుంచి ప్రపంచానికి విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది.  ఈ టెక్నాలజీ సాయంతో కరోనా వైరస్‌‌లో మ్యుటేషన్స్ జరుగుతున్న తీరుతో పాటు ఒక్కో పేషెంట్ల ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా రెస్పాండ్ అవుతోందన్న దానిపై కూడా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు వేగంగా ప్రయోగాలు చేస్తున్నారు. కొంత మందిలో జరుగుతున్న ఎటువంటి డీఎన్‌‌ఏ మార్పుల కారణంగా వైరస్ బారినపడిన తర్వాత తక్కువ టైమ్‌‌లోనే సీరియస్ అవుతోంది, మరణానికి దారితీస్తోందన్న ఈ రీసెర్చెస్‌‌ ద్వారా తెలియనుంది. ఈ డేటా వస్తే తీవ్రమైన ఇన్‌‌ఫ్లమేషన్‌‌కు కారణమయ్యే సింప్టమ్స్‌‌కు మూలం తెలుస్తుంది. ఫలితంగా మరణాలను తగ్గించేందుకు ఎటువంటి మెడిసిన్స్, జీన్, యాంటీబాడీ థెరపీలు సాయపడుతాయన్నది గుర్తించవచ్చు.

తక్కువ కాస్ట్.. హై స్పీడ్ సీక్వెన్సింగ్
కేంబ్రిడ్జ్ సైంటిస్టులు డెవలప్‌‌ చేసిన కొత్త డీఎన్‌‌ఏ సీక్వెన్సింగ్‌‌ సాయంతో ఒక్కో పేషెంట్‌‌ జినోమ్‌‌ పరిశీలించేందుకు చాలా తక్కువ టైమ్‌‌ పడుతుంది. అలాగే చాలా తక్కువ ఖర్చే అవుతుంది. ఒక మనిషి జినోమ్‌‌ సీక్వెన్సింగ్‌‌కు 2000 సంవత్సరంలో ఉన్న టెక్నాలజీలతో చేయాలంటే దానిని పూర్తి చేయడానికి ఏకంగా పదేండ్లు పట్టేది. అలాగే వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది. అదే ఈ కొత్త టెక్నాలజీతో 2020లో కేవలం ఒక్క రోజులోనే డీఎన్‌‌ఏ సీక్వెన్సింగ్ పూర్తి చేయగలిగే పరిస్థితిని శంకర్ సుబ్రమణియన్, డెవిడ్‌‌ల కృషి సాయపడింది. పైగా ఈ టెక్నిక్‌‌తో సీక్వెన్సింగ్‌‌కు అయ్యే ఖర్చు కూడా రూ.70 వేల లోపే.  కరోనా క్రైసిస్‌‌లో అనేక దేశాలు వేగంగా జీన్ మ్యుటేషన్లు గుర్తించి అలర్ట్‌‌ అయ్యేందుకు ఈ టెక్నిక్ ఉపయోగపడిందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ప్రపంచ వ్యాప్తంగా అనేక ల్యాబ్స్‌‌లో రోజూ కొన్ని లక్షల సంఖ్యలో డీఎన్‌‌ఏల సీక్వెన్సింగ్ జరుగుతోంది. దీనికి కచ్చితంగా ప్రపంచమంతా ఆ ఇద్దరు సైంటిస్టులకు రుణపడి ఉందని ఫిన్‌‌లాండ్ అకాడమీ అభిప్రాయపడింది.

వ్యాక్సిన్స్‌‌ రావడంలోనూ.. 
శంకర్ బాలసుబ్రమణియన్, డేవిడ్‌‌లకు టెక్నాలజీకి మిలినియం టెక్నాలజీ ప్రైజ్ ఇవ్వాలని.. కరోనా ఇంకా ప్రపంచాన్ని కమ్మేయక ముందే 2020 ఫిబ్రవరిలోనే నిర్ణయం తీసుకున్నట్లు ఫిన్‌‌లాండ్ అకాడమీ చెబుతోంది. అయితే ఇప్పుడు కేవలం అఫీషియల్ ప్రకటన వచ్చింది. ఈ ప్రైజ్‌‌ను ఒకరికంటే ఎక్కువ మందికి కలిపి ఇవ్వడం ఇదే తొలిసారి. జినోమిక్స్, మెడిసిన్, బయాలజీలో వేగంగా ట్రాన్స్‌‌ఫర్మేషన్ తీసుకురావడంలో ఈ సొలెక్స్ నెక్స్ట్ జనరేషన్ డీఎన్‌‌ఏ సీక్వెన్సింగ్ ఎంతగానో ఉపయోగపడిందని అవార్డ్ కమిటీ అభిప్రాయపడింది. ఈ ప్యాండమిక్‌‌లో వేగంగా వైరస్ కొత్త స్ట్రెయిన్స్‌‌ గుర్తించడంలో ఈ టెక్నాలజీ సాయపడిందని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తక్కువ టైమ్‌‌లోనే వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంలోనూ ఈ టెక్నాలజీ పాత్ర ఉందని కమిటీ మెంబర్స్ చెప్పారు. కొత్త స్ట్రెయిన్స్‌‌ కోసం వ్యాక్సిన్లలో కొంత మార్పు చేయాల్సి వచ్చినా అది కూడా వేగంగా పూర్తవుతుందని, అలాగే భవిష్యత్తులో ప్యాండమిక్స్‌‌ను నివారించడంలో కూడా ఇది ఉపయోగపడుతుందని అన్నారు. పైగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే జరుగుతున్న అనేక రీసెర్చ్‌‌లకు సంబంధించిన పూర్తి స్థాయి ఫలితాలు వస్తే కరోనా వల్ల మరణాలను చాలా వరకు తగ్గించేలా మందులు వస్తాయని చెప్పారు. అంతేకాదు భవిష్యత్తులో రాబోయే జబ్బులతో ఫైట్ చేయడానికి, అందరికీ ఒకే రకంగా కాకుండా పర్సనలైజ్డ్ ట్రీట్‌‌మెంట్స్ చేసేందుకు కూడా ఈ టెక్నాలజీ సాయంతో ప్రయోగాలు చేయొచ్చని అన్నారు.

కేన్సర్‌‌, అగ్రికల్చర్ ప్రయోగాల్లోనూ సాయం
సొలెక్స్ నెక్స్ట్ జనరేషన్ డీఎన్‌‌ఏ సీక్వెన్సింగ్.. కేన్సర్‌‌‌‌ ట్రీట్‌‌మెంట్‌‌లో రెవెల్యూషనరీ మార్పులకు కారణమైంది. వేర్వేరు రకాల కేన్సర్ల జెనిటిక్ బేసిస్‌‌ను అర్థం చేసుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతోంది. బ్లడ్ శాంపిల్స్ పరీక్షించడం ద్వారా ఎర్లీ స్టేజ్‌‌లోనే కేన్సర్లను గుర్తించడంలోనూ దీని పాత్ర ఉంది. అలాగే పర్సనలైజ్డ్ థెరపీలు చేసేందుకు కూడా బాటలుపడ్డాయి. కేవలం మెడికల్ ఫీల్డ్‌‌లోనే కాకుండా అగ్రికల్చర్, బయోడైవర్సిటీ ప్రయోగాల్లోనూ ఈ టెక్నాలజీ ఉపయోగపడుతోంది.