- జియోతో కలసి ప్రయోగాలు జరుగుతున్నాయి
- అత్యంత అల్పాదాయ వారికి సైతం స్మార్ట్ ఫోన్ అందించాలనేదే ప్రధాన లక్ష్యం
- ఆసియా-పసిఫిక్ ప్రాంత మీడియాతో వర్చువల్ విధానంలో మాట్లాడిన సుందర్ పిచాయ్
వాషింగ్టన్: సమాజంలోని అత్యంత అల్పాదాయ వర్గాల వారికి సైతం స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తేవాలనే లక్ష్యానికి కట్టుబడి ముందుకెళుతున్నామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. దాదాపు ఇదే లక్ష్యంతో ఉన్న జియోతో కలసి గత ఏడాది ఒప్పందం చేసుకుని ప్రయోగాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. పేద, అల్పాదాయ వర్గాల వారికి అందని ద్రాక్షగా మారిన స్మార్ట్ ఫోన్ వారి చేతుల్లోకి అందే స్థాయిలోకి తీసుకురావాలనే లక్ష్యానికి కట్టుబడి ముందుకెళుతున్నామని.. జియో అన్ని ప్లాట్ ఫామ్స్ లలో పెట్టుబడులు పెట్టడం జరిగిందని ఆయన వివరించారు. ఆసియా-పసిఫిక్ ప్రాంత మీడియాతో వర్చువల్ విధానంలో మాట్లాడిన సుందర్ పిచాయ్ తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ అందించడం తమ లక్ష్యాల్లో ముఖ్యమైన భాగమని, అందుకే తాము చవక ధర స్మార్ట్ ఫోన్ విషయంలో జియోతో కలిసి ముందుకు నడుస్తున్నామని చెప్పారు. గత ఏడాది జియోలో 33 వేల కోట్లు పెట్టుబడలు పెట్టి 7.7 శాతం వాటాను తీసుకోవడం జరిగిందని సుందర్ పిచాయ్ గుర్తు చేశారు.
దైనందిన జీవితంలో అందరికీ ఉపయోగపడే సదుపాయాలున్న అన్ని ఫీచర్స్ తో చవకైన స్మార్ట్ ఫోన్ కోసం జియోతో ఒప్పందం కుదుర్చుకున్నామని.. ప్రయోగాలు పూర్తయిన వెంటనే స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు. ఇండియా డిజిటలైజేషన్ ఫండ్ లో 10 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశాలను అన్వేషిస్తున్నామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచంలో తెచ్చిన మార్పుల గురించి ప్రస్తావిస్తూ కరోనా వైరస్ సంక్షోభం ప్రజల జీవితాల్లో సాంకేతికత ప్రాముఖ్యతను ఎత్తిచూపిందని, కట్టడి కోసం టెక్నాలజీ ఉపయోగపడేందుకు తాము తీవ్రంగా
శ్రమిస్తున్నామని సుందర్ పిచాయ్ వివరించారు.
స్థానిక చట్టాలకు గూగుల్ కట్టుబడి ఉంది: సుందర్ పిచాయ్
దేశం ఏదైనా అక్కడి స్థానిక చట్టాలను గౌరవించడానికి గూగుల్ కట్టుబడి ఉందని, రెగ్యులేటరి విధానాల్లో ప్రభుత్వాలతో కలసి పనిచేస్తామని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. భారత దేశంలో బుధవారం నుంచి కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి వచ్చిన విషయంపై ఆయన స్పందించారు. మేం పనిచేసే చోట అక్కడి స్థానిక చట్టాలను పూర్తిగా గౌరవిస్తామని, మా నివేదికలన్నీ పారదర్శకంగా ఉంటాయన్నారు. ప్రభుత్వాల సూచనలకు అనుగుణంగా చేసే మార్పులను కూడా నివేదికల్లో పొందుపరచడం జరుగుతోందన్నారు. స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ విలువ తమకు బాగా తెలుసునని.. ప్రపంచ వ్యాప్తంగా ఏ నియంత్రణ సంస్థలతోనైనా మేం కలసి పనిచేస్తామని.. న్యాయపరమైన ప్రక్రియలకు కట్టుబడి ఉంటామన్నారు. మా ఉత్పత్తుల్లో మార్పులు తెస్తున్నామని, చట్టవిరుద్ధమైన కంటెంట్ ను అడ్డుకోవడానికి.. ఆయా దేశాల చట్టాల మేరకు వనరులు, సిబ్బందిని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటామన్నారు. ఈ నిబంధన వల్ల యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందంటూ వాట్సప్ కోర్టును ఆశ్రయించడంపై భారత ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. తమ యాజమాన్య సంస్ధ ఫేస్ బుక్ చెప్పిన తర్వాత కూడా వాట్సప్ ఇదే వాదన చేస్తుండడంపై కేంద్రం స్పందించింది. భారతదేశంలో శాంతి భద్రతలకు, దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన తీవ్రమైన విషయాల్లో మాత్రమే ప్రభుత్వం యూజర్ల వ్యక్తిగత సమాచారం కోరుతుందని కేంద్రం వివరణ ఇచ్చింది.