తక్కువ ఖర్చుతో ప్రహరీ కట్టుకోవచ్చు : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ​జితేశ్ ​వి పాటిల్​ 

తక్కువ ఖర్చుతో ప్రహరీ కట్టుకోవచ్చు : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ​జితేశ్ ​వి పాటిల్​ 
  • స్థానిక మట్టితో తయారు చేసిన ఇటులతో నిర్మించిన ప్రహరీ పరిశీలన 


ములకలపల్లి, వెలుగు : స్థానికంగా లభించే నాణ్యమైన మట్టితో మంచి ఇటుకలు తయారవుతాయని, తక్కువ ఖర్చుతో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రహరీల నిర్మాణం చేపట్టవచ్చని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్ అన్నారు. శనివారం మంగపేట గిరిజన ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి ఈ ఇటులతో కడుతున్న ప్రహరీని ఆయన పరిశీలించారు. ఇటుకలు తయారీ చేసిన రామాంజనేయపురం గ్రామస్తులు నాగార్జునతో, మేస్త్రి శ్రీనుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

మట్టి ఇటుకలతో ప్రహరీ నిర్మాణం ప్రయోగాత్మకంగా ములకలపల్లిలో ప్రారంభించినందున ఇది మోడల్ గా నిలుస్తుందని చెప్పారు. వ్యవసాయ భూముల్లో రహదారుల నిర్మాణానికి సైతం ఇటుకలనే వాడేలాప్రణాళిక సిద్ధం చేయాలని ఎంపీడీవో, ఇంజినీరింగ్ శాఖ అధికారులకు సూచించారు. అనంతరం సీతారాంపురం పంచాయతీ పాతూరులో రైతు ఈదర మురళి సాగు చేస్తున్న ఫామ్ పౌండ్ లో చేపల పెంపకాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.

రైతులు ఒక్క పంట పైనే ఆధారపడకుండా అంతర్ పంటగ చేపల పెంపకం, మునగ, నాటు కోళ్లు, తేనెటీగల పెంపకం.. తదితర ప్రయోగాలు చేయాలని చెప్పారు. కలెక్టర్ వెంట ఎంఆర్​వో  పుల్లారావు, ఎంపీడీవో రేవతి, ఏఈ సురేశ్, ఎంపీవో లక్ష్మయ్య ఉన్నారు. 

 కొండరెడ్ల గ్రామంలో పర్యటన 

దమ్మపేట :  మండలంలోని పూసుకుంటలో కొండరెడ్ల గిరి జన కుటుంబాలను ఐటీడీఏ పీవో బి. రాహుల్ తో కలిసి కలెక్టర్​ పర్యటించారు. ఇంటింటికి తిరిగి కొండరెడ్ల కుటుంబాలతో మాట్లాడారు. కొండరెడ్ల గిరిజన కుటుంబాలకు చదువుకున్న పిల్లలు ఉంటే వారి చదువుకు తగిన కంప్యూటర్, మొబైల్ రంగాలకు సంబంధించిన శిక్షణలు ఇప్పించనున్నట్లు తెలిపారు. రోగాల బారిన పడినప్పుడు మూఢనమ్మకాలను నమ్మకుండా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాని చెప్పారు. ఉమ్మడి కుటుంబాలతో కలిసి ఉన్నవారికి బర్రెలు, గొర్రెలు, ఆవులు, మేకలు ఇప్పిస్తామన్నారు.

పశువుల మేత కోసం మునగ చెట్లు, వేరు శెనగ, సుబాబుల్ మొక్కలు వేసుకునేలా శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఫారెస్ట్ లో ప్లాంటేషన్ ఏర్పాటు కోసం మండలంలోని పాఠశాలల పిల్లల ద్వారా గింజలు నాటించి, వాటి సంరక్షణ చూడాలని, ఆ పిల్లలకు ప్రోత్సాహకాలు అందిస్తామని ఫారెస్ట్ అధికారులకు సూచించారు. భూ సమస్యలు ఉన్నవారికి పరిష్కరిస్తామని, ఆధార్ కార్డులు అందిస్తామని, రవాణా సౌకర్యం కోసం ట్రాలీ ఆటోలు అందిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, తహసీల్దార్ వాణి, ఆర్ అండ్ బీ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ శ్రీనివాస్, ఐటీడీఏ డీఈ బాపనయ్య, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో సుధాకర్, డీఎఫ్​వో కరుణాకరచారి, జేడీఎం హరికృష్ణ, ఇతర శాఖల సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.