ఎల్ఆర్ఎస్​కు స్పందన అంతంతే .. అప్రూవల్ ఇచ్చినా ఫీజు కట్టేందుకు విముఖత

ఎల్ఆర్ఎస్​కు స్పందన అంతంతే .. అప్రూవల్ ఇచ్చినా ఫీజు కట్టేందుకు విముఖత
  • 25 శాతం రాయితీని ఉపయోగించుకున్నది20 శాతం మందే 
  • 89,015 మందికి అనుమతినిస్తే.. కట్టింది 17,912 మంది  మాత్రమే
  • ఉమ్మడి జిల్లాలో రూ.82.91 కోట్ల ఫీజు వసూలు 

ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎల్ఆర్ఎస్(ల్యాండ్​రెగ్యులరైజేషన్​స్కీమ్​)కు దరఖాస్తుదారుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది. గతంలో దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపించిన చాలా మంది, ఇప్పుడు 25 శాతం రాయితీతో డబ్బులు చెల్లించేందుకు మాత్రం విముఖత చూపించారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీలు, మండలాల్లో కలిపి 89,015 మంది దరఖాస్తుదారులకు ఫీజు చెల్లించేందుకు అధికారులు అప్రూవల్ ఇవ్వగా, వారిలో 20 శాతం మంది మాత్రమే రాయితీ స్కీమ్​ ను ఉపయోగించుకున్నారు. 

మొత్తం 17,912 మంది దరఖాస్తుదారులు రూ.82.91 కోట్లు ఎల్ఆర్ఎస్​ఫీజు రూపంలో ప్రభుత్వ ఖజానాకు డబ్బులు జమ చేశారు. మొత్తానికి అధికారులు ఆశించిన స్థాయిలో ఆదాయాన్ని పొందలేకపోయారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే రూ.100 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేసినా, రూ.67.50 కోట్లు మాత్రమే జమయ్యాయి. అయితే అధికారులు మాత్రం రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఖమ్మం జిల్లాకు ఎల్ఆర్ఎస్​ ఆదాయం తొలి నాలుగు స్థానాల్లో ఉందంటున్నారు. 

ఎక్కడ.. ఏ పరిస్థితి..? 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎల్ఆర్ఎస్​ కోసం మొత్తం 1,15,601 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఖమ్మం జిల్లాలో 1,00,439 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఖమ్మం మున్సిపల్​ కార్పొరేషన్, మధిర, సత్తుపల్లి, వైరా, ఏదులాపురం మున్సిపాలిటీల్లో కలిపి 65,174, స్తంభాద్రి అర్బన్​ డెవలప్​ మెంట్ అథారిటీ (సుడా) పరిధిలో 21,011, ఇతర మండలాల్లో కలిపి 14,854 అప్లికేషన్లున్నాయి. మొత్తం 79,561 అప్లికేషన్లను ఫీజు కట్టేందుకు అప్రూవల్ ఇచ్చారు. మిగిలిన దరఖాస్తులను వేర్వేరు కారణాలతో పెండింగ్ పెట్టారు. చెరువు శిఖం భూములు ఉండడం, మున్నేరు బఫర్​ జోన్​ లో ఉండడం లాంటి రీజన్స్ ఇందులో ఉన్నాయి. ఫీజు కట్టేందుకు అనుమతి ఇచ్చిన వారిలో 15,860 మంది దరఖాస్తుదారులు సోమవారం రాత్రి 8 గంటల వరకు రూ.67.50 కోట్లు ఫీజు రూపంలో డబ్బులు చెల్లించారు.  

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 15,162 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అశ్వారావుపేట, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు మున్సిపాలిటీల్లో కలిపి 11,814 అప్లికేషన్లు రాగా, ఇతర మండలాల్లో కలిపి 3,348 అప్లికేషన్లు వచ్చాయి. వాటిలో 9,454 అప్లికేషన్లను అధికారులు ఎల్ఆర్ఎస్​ఫీజు కట్టేందుకు అప్రూవ్ చేశారు. నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయని 3,146 దరఖాస్తులను పక్కనపెట్టారు. ​9,454 అప్లికేషన్లలో 2,052 మంది మాత్రమే రూ.15.41 కోట్లు ఫీజు రూపంలో చెల్లించారు. ఇంకో 7,402 మంది ఫీజు కట్టేందుకు ఆసక్తి చూపించలేదు. చాలా మంది ఈ గడువును ప్రభుత్వం పొడిగిస్తుందని అంచనా వేశారు. అయితే అలాంటి పొడిగింపు ఉండబోదని ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.