Women's U19 World Cup: ఇదేమి ప్రపంచ కప్ అయ్యా.. వంద కొడితే గెలిచినట్టే..!

Women's U19 World Cup: ఇదేమి ప్రపంచ కప్ అయ్యా.. వంద కొడితే గెలిచినట్టే..!

మలేషియా, కౌలాలంపూర్ వేదికగా జరుగుతోన్న మహిళల అండర్‌-19 ప్రపంచకప్‌‌లో సంచలన ఫలితాలు నమోదు అవుతూనే ఉన్నాయి. ఏ జట్టును విజయం వరిస్తుందో చెప్పలేని పరిస్థితి. పసికూన జట్ల ముందు బలమైన జట్లు ఢీలా పడిపోతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు వంద పరుగులు చేసిందంటే.. దాదాపు గెలుపు ఖాయమైనట్టే. స్వల్ప లక్ష్యాలను అగ్రశ్రేణి జట్లు చేధించలేకపోతున్నాయి. 70 నుంచి 80 పరుగులు చేయడానికే వారికి తల ప్రాణం తోకకొస్తోంది.

మహిళల అండర్‌-19 ప్రపంచకప్‌‌లో చాలా వరకు మ్యాచ్‍ల్లో అత్యల్ప స్కోర్లు నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ జరిగిన 40కి పైగా మ్యాచ్‌ల్లో సగం వాటిలో 50 పరుగుల లోపే ఫలితం వచ్చినవే. 44, 47, 51, 58,59, 64, 66.. ఇలా తక్కువ స్కోర్లకే ఆలౌట్ చేయడం.. తరువాత లక్ష్యాలను ఛేదించడం జరుగుతోంది. ఒకవేళ ఇంతకు మించి పరుగులు చేశారంటే.. హోరాహోరీ పోరు తప్పడం లేదు. అందుకు మంచి ఉదాహరణ.. నైజీరియా చేతిలో న్యూజిలాండ్ మహిళలు ఓటమి పాలవ్వడం. 

Also Read :- సునీల్ గవాస్కర్ తర్వాత టీమిండియాలో అతడే బెస్ట్ ఓపెనర్

నైజీరియన్లు నిర్ధేశించిన 65 పరుగులు లక్ష్యాన్ని కివీస్ జట్టు చేధించలేకపోయింది. బుధవారం(జనవరి 29) ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ అటువంటి ఫలితమే. లంక మహిళలు నిర్ధేశించిన 100 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా మహిళలు చేధింలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 87 పరుగులకే పరిమితమయ్యారు.

భళా భారత మహిళలు

ఈ స్వల్ప స్కోర్లకు భారత జట్టు మినహాయింపు అని చెప్పుకోవాలి. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌ల్లో తలపడిన భారత జట్టు అన్నింటా విజయం సాధించింది. ఈ ఐదింటిలో రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థిని 50 పరుగుల లోపు ఆలౌట్ చేసి లక్ష్యాన్ని చేధించింది. మరో రెండు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేయగా.. భారీ స్కోర్లు నమోదయ్యాయి.  స్కాట్లాండ్ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో భారత వనితలు ఏకంగా 200పై చిలుకు లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఒక్క ఇన్నింగ్స్‌లో 30కిపైగా బౌండరీలు నమోదు చేశారు.

చూస్తుంటే.. ఈ టోర్నీలో మరిన్ని సంచలన విజయాలు నమోదయ్యేలా కనిపిస్తున్నాయి. పాకిస్థాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల పరిస్థితి గందరగోళంగా ఉంది.