50 రోజుల తర్వాత అతి తక్కువ కరోనా కేసులు

50 రోజుల తర్వాత అతి తక్కువ కరోనా కేసులు
  • కరోనా కేసులు లక్షన్నరే
  • మరో 3,128 మంది మృతి.. 91.6 శాతానికి పెరిగిన రికవరీ రేటు
  • 18 రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ

న్యూఢిల్లీ: కరోనా తీవ్రత మెల్లమెల్లగా తగ్గుతోంది. దేశంలో 50 రోజుల తర్వాత అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1,52,734 మందికి వైరస్ సోకింది. చివరి సారిగా ఏప్రిల్ 10న 1.45 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,80,47,534కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 20,26,092కి పడిపోయింది. 18 రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా 2,38,022 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 2,56,92,342 మంది రికవర్ అయ్యారు. రికవరీ రేటు 91.6 శాతానికి పెరగ్గా.. యాక్టివ్ కేసుల సంఖ్య 7.22 శాతానికి తగ్గింది. గత వారం వరకు ఎక్కువ కేసులు నమోదైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అస్సాం రాష్ట్రాల్లో ఇప్పుడు వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది.

మే నెలలోనే తక్కువ డెత్స్
24 గంటల వ్యవధిలో 3,128 మంది చనిపోయారు. మే నెలలో ఇంత తక్కువ డెత్స్ నమోదవడం ఇదే తొలిసారి. మహారాష్ట్రలో 814 మంది, తమిళనాడులో 493 మంది, కర్నాటకలో 381 మంది చనిపోయారు. మొత్తం డెత్స్ 3,29,100కి చేరాయి. ఇందులో మహారాష్ట్రలోనే 94,844, కర్నాటకలో 28,679, ఢిల్లీలో 24,151, తమిళనాడులో 23,754, యూపీలో 20,346 డెత్స్ నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 16,83,135 టెస్టులు చేశారు. ఇప్పటిదాకా 34,48,66,883 శాంపిల్స్ పరీక్షించారు. డైలీ పాజిటివిటీ రేటు 9 శాతంగా ఉంది. గత 7 రోజులుగా పాజిటివిటీ రేటు 10 శాతం లోపే ఉంటోంది. వీక్లీ పాజిటివిటీ రేటు కూడా 9 శాతంగా ఉంది. ఇప్పటిదాకా 21.31 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.

కొందరిలో జీవితాంతం ఇమ్యూనిటీ
కరోనా బారినపడి కోలుకున్నోళ్లు, వ్యాక్సిన్ తీసుకున్నోళ్లకు కనీసం ఏడాది పాటు ఇమ్యూనిటీ ఉంటుందని తాజాగా రెండు స్టడీలు వెల్లడించాయి. కొందరిలో జీవితాంతం రోగనిరోధక శక్తి ఉంటుందని తెలిపాయి. రీ ఇన్ఫెక్షన్ రాకుండా రక్షణ ఉంటుందా? లేదా? అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ కరోనాతో ఎక్కువ కాలం పోరాడగల యాంటీబాడీలను మాత్రం మానవ శరీరం అభివృద్ధి చేయగలదని తెలిపాయి. కొందరిలో ఏడాది పాటు, ఇంకొందరిలో జీవితమంతా ఇమ్యూనిటీ ఉంటుందని సైంటిస్టులు అంచనా వేశారు. కరోనాతో పొరాడేందుకు అవసరమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేయడంలో బోన్ మ్యారో ఇన్వాల్వ్ అవుతోందని గుర్తించారు. బోన్ మ్యారోలో రోగనిరోధక శక్తి కణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ‘‘ఈ కణాలు బోన్ మ్యారోలో ఉంటాయి. యాంటీబాడీలు అవసరమైనప్పుడు ఉత్పత్తి చేస్తాయి. కరోనా నుంచి కోలుకున్న కొన్ని నెలల తర్వాత రక్తంలో యాంటీబాడీలు తగ్గడం మొదలవుతుంది’’ అని రీసెర్చర్లు పేర్కొన్నారు. అయితే 11 నెలల తర్వాత కూడా యాంటీబాడీలు ఉన్నట్లు వారు గుర్తించారు. వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మళ్లీ సోకితే వెంటనే గుర్తించి, అడ్డుకు నేలా ఇమ్యూన్ సిస్టమ్​ను ప్రేరేపిస్తాయని చెప్పారు. ‘యాంటీబాడీల ఉత్పత్తిలో బోన్ మ్యారో ప్రమేయం వల్ల.. కరోనా వేరియంట్లపై శరీరం పోరాడగలదు’’ అని వివరించారు.