హైదరాబాద్లో 905 ఏంది..? నిజామాబాద్లో 928 రూపాయలు ఏంది..? గ్యాస్ సిలిండర్ రేట్లలో ఎందుకీ తేడా..?

హైదరాబాద్లో 905 ఏంది..? నిజామాబాద్లో 928 రూపాయలు ఏంది..? గ్యాస్ సిలిండర్ రేట్లలో ఎందుకీ తేడా..?

హైదరాబాద్: భాగ్యనగరంలో ‘కాస్ట్ ఆఫ్ లివింగ్’ గురించి గతంలో పలు కథనాలు వెలువడ్డాయి. హైదరాబాద్ సిటీలో బతకాలంటే నెలకు కనీసం 30 వేల పైనే సంపాదన ఉండాలని మెట్రో నగరాల్లో ఆదాయవ్యయాల గురించి చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది. తాజాగా.. మెట్రో నగరాల్లో ఎల్పీజీ సిలిండర్ ధరల గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మన దేశంలోని మెట్రో నగరాలన్నింటిలో హైదరాబాద్ నగరంలోనే గ్యాస్ సిలిండర్ ధర ఎక్కువని తెలిసింది.

ఏప్రిల్ 7న(సోమవారం) కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్పై 50 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పెంపు తర్వాత కూడా ఎల్పీజీ సిలిండర్ ధర హైదరాబాద్లోనే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. సిలిండర్ ధరపై 50 రూపాయలు పెరిగాక హైదరాబాద్లో ఎల్పీజీ సిలిండర్ ధర 905 రూపాయలకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 853 రూపాయలు, కోల్ కత్తాలో 879 రూపాయలు, చెన్నైలో 868 రూపాయలు, బెంగళూరులో 855 రూపాయలు.. ఇవీ ఎల్పీజీ సిలిండర్పై 50 రూపాయలు పెంచాక దేశంలోని మెట్రో నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు.

తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు అత్యధికంగా ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో 14.2 కేజీ ఎల్పీజీ సిలిండర్కు 930 రూపాయలు చెల్లించాల్సిందే. నిజామాబాద్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ ధర 928 రూపాయలుగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్కు ఒక రేటు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఒక రేటు, నిజామాబాద్ జిల్లాలో ఒక రేటు ఏంటనే సందేహం రావడం సహజం. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. మన దేశంలో ప్రధానంగా హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కంపెనీ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ గ్యాస్ను సప్లై చేస్తున్నాయి.

Also Read:-హైదరాబాదీలకు షాక్.. డొమెస్టిక్ సిలిండర్ల రేటు మెట్రో నగరాల్లోనే టాప్.. మనకే ఎందుకట్ల?

వీటిల్లో ఒక కంపెనీకి విశాఖపట్నం నుంచి నేరుగా హైదరాబాద్ శివారు ప్రాంతంలో సర్వీస్ స్టేషన్కు డైరెక్ట్ పంప్ లైన్ ఉంది. మిగిలిన కంపెనీలు రోడ్డు మార్గం ద్వారా గ్యాస్ను విశాఖపట్నం నుంచి హైదరాబాద్ శివారుల్లో ఉండే సర్వీస్ స్టేషన్లకు తరలించి అక్కడ నుంచి సప్లై చేస్తుంటాయి. విశాఖపట్నం నుంచి సప్లై చేసే ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చుల కారణంగా వంట గ్యాస్ ధరల్లో మార్పులు ఉంటుంటాయని తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. 

కొన్ని కంపెనీలు విశాఖపట్నంతో పాటు చెన్నై, మంగళూరు నుంచి కూడా హైదరాబాద్లోని తమ సర్వీస్ స్టేషన్లకు గ్యాస్ను తరలిస్తుంటాయి. అందువల్లే గ్రేటర్ హైదరాబాద్ కంటే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఎల్పీజీ సిలిండర్ ధర ఎక్కువగా ఉంది. దీనికి తోడు కంపెనీలు నిర్ణయించే డైనమిక్ ధరలు కూడా గ్యాస్ ధరల్లో హెచ్చుతగ్గులకు మరో కారణంగా చెప్పొచ్చు.