LPL 2024: కోట్లు కొల్లగొట్టాడు.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా CSK పేసర్ రికార్డు

LPL 2024: కోట్లు కొల్లగొట్టాడు.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా CSK పేసర్ రికార్డు

ఐపీఎల్ తరహాలో శ్రీలంక వేదికగా లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2020 నుంచి నిర్వహిస్తున్న ఈ టోర్నీ  కోసం ఆటగాళ్లను ఐపీఎల్ తరహాలోనే వేలం వేస్తుంటారు. తాజాగా నిర్వహించిన ఎల్‌పీఎల్ వేలంలో శ్రీలంక యువ పేసర్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన బౌలర్ మతీష పతిరాణా కోట్లు కొల్లగొట్టాడు. లక్షా 20వేల అమెరికన్ డాలర్ల ధర పలికి లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

కనీస ధర 50వేల డాలర్లు

50వేల డాలర్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన పతిరాణా కోసం ప్రాంఛైజీలు పోటీ పడ్డాయి. మొదట దంబుల్లా థండర్స్ 70 వేల డాలర్లతో బిడ్ వేయగా.. గాలే మార్వెల్స్ పోటీలోకి రావడంతో అతని ధర అమాంతం లక్ష డాలర్లకు చేరింది. ఆ సమయంలో అతను ప్రాతినిథ్యం  వహిస్తోన్న కొలంబో స్ట్రయికర్స్ రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ద్వారా అతన్ని 1.20 లక్షల డాలర్లకు సొంతం చేసుకుంది. శ్రీలంక రూపాయలతో ఇది 3.60 కోట్లు. దీంతో లంక ప్రీమియర్‌ లీగ్‌లోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా పతిరాణా రికార్డులకెక్కాడు.

ఎల్‌పిఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు గతంలో శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంక పేరిట ఉంది. ఈ లెఫ్టార్మ్ పేసర్‌ని గత వేలంలో జాఫ్నా కింగ్స్ 92వేల అమెరికన్ డాలర్లకు సొంతం చేసుకుంది. ఒక్కో జట్టు దగ్గర 5 లక్షల డాలర్ల పర్స్ ఉండగా.. కొలంబో పతిరాణా కోసమే 1.2 లక్షల డాలర్లు ఖర్చు చేయడం గమనార్హం.

ఐపీఎల్ పదిహేడో సీజన్‌లో కేవలం 6 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన పతిరాణా 8 కంటే తక్కువ ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. గాయం కారణంగా అతను వైదొలగడం చెన్నై జట్టు విజయాలపై తీవ్ర ప్రభావం చూపింది. రాబోయే సీజన్ కోసం సీఎస్కే అతన్ని అంటి పెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.