- పరిశీలనకు కొత్త కమిటీల నియామకానికి ప్రభుత్వం ఆదేశాలు
- స్క్రూటినీ అయ్యాకే ఫీజు వసూలు
- మరోవైపు గ్రేటర్లో మొదలు కానున్న ఫీల్డ్ సర్వే
- ఇప్పటికీ వేధిస్తున్న సిబ్బంది కొరత
హైదరాబాద్, వెలుగు: ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్) అప్లికేషన్లకు ఏడాదిగా పరిష్కారం చూపని ప్రభుత్వం తాజాగా ఫీల్డ్ సర్వేకు అనుమతించింది. తొందరలోనే ప్లాట్ల సర్వే మొదలుకానుంది. ఇది పూర్తయ్యే వరకు ఫీజు చెల్లించే అవకాశం లేదు. మున్సిపాలిటీలు, వార్డులు, సర్వే నంబర్ల వారీగా వచ్చిన అప్లికేషన్లను పరిశీలనకు కొత్తగా కమిటీలను నియమించారు. ఇవి పూర్తయ్యాకే ఫీజుల చెల్లింపుపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గ్రేటర్ లో మొత్తం 3 లక్షల 60 వేల ఎల్ఆర్ఎస్అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలవే. అప్లికేషన్లను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించడానికి ఓ వైపు సిబ్బంది కొరత వేధిస్తుంటే, మరో వైపు కమిటీలు పరిశీలన పూర్తి చేసేందుకు మరో రెండు నెలల పట్టేలా ఉంది. అంతకుముందే 2015లో హెచ్ఎండీఏ పరిధిలో, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకోసారి, రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను ప్రభుత్వం అమలు చేసింది. అక్రమ లే ఔట్ల రెగ్యులరైజ్ కు ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ లో మరోసారి ఎల్ఆర్ఎస్ నోటిషికేషన్ ను జారీ చేసింది. వచ్చిన అప్లికేషన్లను ఇప్పటి వరకు పరిష్కరించకపోగా రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతులు ఆగిపోయాయి. ఫీజులు చెల్లించే వరకు అనుమతులు రాక ప్లాట్ల యజమానులు, రియల్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. జీపీ లే ఔట్ల విషయంలో ఎల్ఆర్ఎస్ పై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో మరింత ఆలస్యమవుతోంది.
ఆగిన ప్రక్రియ
గతేడాది ఎల్ఆర్ఎస్ నోటిఫికేషన్ హడావుడిగా జారీ చేయగా తీవ్ర వ్యతిరేకతలు రావడమే కాకుండా చార్జీల భారం తగ్గించాలనే డిమాండ్ చేయగా ప్రభుత్వం సవరించింది. ఆ తర్వాత ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇటీవల పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేసేందుకు కొత్తగా కమిటీలను నియమించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా జిల్లాలో కలెక్టర్లు, మున్సిపాలిటీల్లో కమిషనర్ల ఆధ్వర్యంలో రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ సిబ్బంది, కమిటీలు కలిసి సర్వే చేయాల్సి ఉంటుంది. ఇప్పటికైతే కమిటీల నియామకం జరిగినా, స్క్రూటినీ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. గ్రేటర్లో లక్ష అప్లికేషన్లు, హెచ్ఎండీఏ పరిధిలో 63 వేలు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో దాదాపు రెండు లక్షలు, మొత్తంగా 3 లక్షల 60 వేల మంది ఎల్ఆర్ఎస్ కోసం అప్లయ్ చేశారు. నెలరోజుల వ్యవధిలో ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పినా, ఇప్పటికి పెండింగ్‌లోనే ఉన్నాయి. తాజాగా అప్లికేషన్ల పరిశీలనతో ప్రక్రియ మళ్లీ స్టార్ట్ కానుంది.
పూర్తవ్వాలంటే మూడు నెలలపైనే
అప్లికేషన్ల పరిశీలన తర్వాత అధికారులు, ఎల్ఆర్ఎస్ ఫీజులను ఎంత మొత్తంలో చెల్లించాలనే దానిపై ఆదేశాలు ఇవ్వనున్నారు. స్క్రూటినీ ప్రక్రియ ముగియగానే, దరఖాస్తుదారులకు మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తారు. ఆ తర్వాత ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా పూర్తి కావాలంటే కనీసం మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ నామమాత్రంగా తనిఖీలు చేస్తే, అక్రమంగా వెలిసిన ప్లాట్లు రెగ్యులరైజ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బఫర్ జోన్, ఎఫ్టీఎల్, ప్రభుత్వ భూముల్లోని ప్లాట్లు కూడా రెగ్యులరైజ్ చేయొచ్చు. పరిశీలన పక్కాగా సాగితేనే ప్రక్రియ ముందుకు సాగదని హెచ్ఎండీఏలోని ఓ అధికారి పేర్కొన్నాడు. స్క్రూటినీ, ఫీజుల చెల్లింపు, ఫైనల్ ప్రొసీడింగ్ చేతికి రావడానికి కనీసం నాలుగైదు నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. ఇప్పటికే హెచ్ఎండీఏ పరిధిలో ఎల్ఆర్ఎస్ ఫీజులను చెల్లించారు. ఇప్పటికీ ఫైనల్ ప్రొసీడింగ్స్ పొందని అప్లికేషన్లు కూడా ఉన్నాయి.