- అప్లికేషన్ల ప్రక్రియ 45 రోజుల్లో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్
- దరఖాస్తుల ప్రాసెస్ స్లో అవ్వడంతో అధికారులపై సర్కార్ సీరియస్
- 25.67 లక్షల అప్లికేషన్లలో పూర్తయింది 80 వేల లోపే..
- అప్లికేషన్ల ప్రాసెస్‌కు త్వరలో డెడ్లైన్ ప్రకటించాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: ఎల్ఆర్‌ఎస్ (ల్యాండ్ రెగ్యులేషన్ స్కీం)కు డెడ్ లైన్ పెట్టాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. అప్లికేషన్ల ప్రాసెస్ స్లో అవుతుండటంతో స్పెషల్ డ్రైవ్ పెట్టి.. 45 రోజుల్లో పూర్తిచేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ప్రాసెస్ త్వరగా పూర్తి చేయాలని ఇప్పటికే పలుమార్లు కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ అనుకున్న స్థాయిలో ప్రక్రియ వేగవంతం అవ్వకపోవడంతో త్వరలోనే డెడ్ లైన్ పెట్టి గడువుపై ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎస్ కింద సుమారు 25.67 లక్షల దరఖాస్తులు అందాయి.
మున్సిపాలిటీల్లో 10.54 లక్షలు, గ్రామ పంచాయతీల పరిధిలో 10.76 లక్షలు రాగా.. మిగిలినవి కార్పొరేషన్ల పరిధిలో వచ్చాయి. ఇందులో ఇప్పటివరకు 4.90 లక్షల అప్లికేషన్ల పరిశీలన మాత్రమే పూర్తయింది. వీటిలో 85 వేలలోపు అప్లికేషన్లను ఆమోదించారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై ఇప్పటివరకు సీఎం ఒకసారి, రెవెన్యూ శాఖ మంత్రి మూడు సార్లు సమీక్షలు నిర్వహించారు.
గత ఆగస్టులోనే స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసుకుని అప్లికేషన్ల పరిశీలన చేపట్టాలని, వీలైనంత త్వరగా వాటిని ఆమోదించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బీఆర్ఎస్ హయాంలో 2020 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే ఎల్‌ఆర్‌ఎస్ అప్లికేషన్లు తీసుకున్నారు. వివిధ కారణాలతో ఎల్‌ఆర్‌ఎస్ అమలును వాయిదా వేస్తూ వచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాత అప్లికేషన్ల దుమ్ము దులిపింది. 2020 ఆగస్టు 31న జారీ చేసిన జీవో 131కు కొనసాగింపుగా 2023 జులై 31న జీవో 135 జారీ చేసింది. 2020 ఆగస్టు 26కు ముందు రిజిస్టర్ చేసిన అనుమతి లేని, చట్టవిరుద్ధమైన లేఅవుట్లు, ప్లాట్లకు మాత్రమే పథకం వర్తిస్తుందని పేర్కొంది. అయితే, జిల్లాల వారీగా కలెక్టర్లు దరఖాస్తులను పరిశీలించి.. అర్హులకు క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది.
వచ్చే ఆదాయం ఆయా మున్సిపాలిటీలకే.. ప్రభుత్వ భూములను రక్షిస్తూ..
అర్హత ఉన్న లేఅవుట్లను క్రమబద్ధీకరించే బాధ్యతలను కలెక్టర్లకు సర్కార్ అప్పగించింది. మున్సిపాలిటీలు,
రెవెన్యూ శాఖలే కాకుండా అవసరమైతే ఇతర శాఖలకు చెందిన సిబ్బందిని కూడా నియమించుకుని దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తి చేసేందుకు కలెక్టర్లకు అనుమతి ఇచ్చింది. ములుగు, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, వనపర్తి తదితర జిల్లాల్లో అప్లికేషన్ల పరిశీలన, అప్రూవల్‌లో వెనుకబడి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ పథకం అమలుకు నాలుగేళ్లుగా లక్షల మంది ఎదురుచూస్తున్నారని, అయితే, గ్రౌండ్ లెవల్‌లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎల్‌ఆర్‌ఎస్ అప్లికేషన్లలో ప్లాట్లకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో 25.53 లక్షలు ప్లాట్లకు చెందినవి కాగా.. లేఅవుట్ల దరఖాస్తులు 13 వేలు మాత్రమే ఉన్నాయి. ఎల్‌ఆర్‌ఎస్ అప్లికేషన్ల ఆమోదం తర్వాత వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీలకే జమ చేయాలని నిర్ణయం తీసుకుంది.