హద్దులు లేవు.. ప్లాట్లు దొరుకతలేవు వెరిఫికేషన్​ వేరీ స్లో

హద్దులు లేవు.. ప్లాట్లు దొరుకతలేవు వెరిఫికేషన్​ వేరీ స్లో
  • నెల గడిచినా మూడు శాతమే పూర్తి
  •  జిల్లాలో 2,12,971 లక్షల అప్లికేషన్లు వెరిఫికేషన్​ చేసింది 5902

యాదాద్రి, వెలుగు : ఎల్ఆర్ఎస్(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం) అప్లికేషన్ల వెరిఫికేషన్​ యాదాద్రి జిల్లాలో స్లోగా సాగుతోంది. అప్లికేషన్లలో పేర్కొన్న సైట్​కు వెళ్లిన వెరిఫికేషన్​ టీమ్​కు   హద్దులు కన్పించడం లేదు.  అసలు  ప్లాట్లే దొరకడం లేదు .  అక్టోబర్ నెలాఖరుకు పూర్తి చేయాల్సిన ప్రక్రియ ఇప్పటివరకూ 3 శాతంలోపే పూర్తయింది.  

2,12,971 అప్లికేషన్లు

 2020 ఆగస్టు 26 కంటే ముందుగా కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడానికి అప్పటి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్లాట్​కు రూ. వెయ్యి, వెంచర్​కు రూ. 10 వేలుగా ఫీజు నిర్ణయించింది. దీంతో లే అవుట్ల క్రమబద్దీకరణకు భారీ స్పందన వచ్చింది. మున్సిపాలిటీల్లో, పంచాయతీల నుంచి భారీ ఎత్తున అప్లికేషన్లు వచ్చాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, హెచ్​ఎండీఏ పరిధిలోని మండలాల నుంచి మొత్తంగా 2,12,971 అప్లికేషన్లను స్వీకరించడంతో రూ. 87 లక్షల ఇన్​కం వచ్చింది.

మున్సిపాలిటీల పరిధిలో 55,627, పంచాయతీల్లో 62,293, హెచ్​ఎండీఏ పరిధిలో 95,051 అప్లికేషన్లు ఉన్నాయి. కాగా క్రమబద్ధీకరణను వ్యతిరేకిస్తూ అప్పట్లో కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఎల్ఆర్ఎస్ పెండింగ్లో  పడింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆఫీసర్లు ఆగస్టులో వర్క్​ ప్రారంభించారు.
 
3 శాతమే వెరిఫికేషన్​ ...

రెగ్యులరైజేషన్​ కోసం ప్లాట్ల ఓనర్స్​ చేసుకున్న అప్లికేషన్లు గందరగోళంగా ఉన్నాయి. అప్లికేషన్లు చేసుకున్న వారిలో కొందరు డాక్యూమెంట్స్​ సరిగా అప్లోడ్​ చేయలేదు. మరికొందరు ఈసీ అప్లోడ్​ చేయలేదు. ఇంకొందరు తమకు హద్దులుగా ఉన్న ప్లాట్ల నెంబర్లను పేర్కొనలేదు. అప్రూవ్​ లే అవుట్ల అంటూ అప్లికేషన్​ చేసుకున్న వారు లేవుట్​ సబ్బిట్​ చేయలేదు.

దీంతో వెరిఫికేషన్​కు వెళ్లిన టీమ్స్​కు చుక్కలు కన్పిస్తున్నాయి. అప్లికెంట్లు తమ అప్లికేషన్​లో పేర్కొన్న ప్లేస్​కు వెళ్లిన టీమ్స్​కు చాలా చోట్ల హద్దులు కన్పించలేదు. ఎక్కడ ఏ ప్లాట్​ ఉందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. దీంతో అప్లికేషన్​లో పేర్కొన్న సెల్​ నెంబర్​కు ఫోన్​ చేసినా కొందరు లిఫ్ట్​ చేయలేదు. మరికొందరు తాము ప్లాట్​ అమ్మేసుకున్నామని చెబుతున్నారు. ఇంకొంరైతే.. రూ. వెయ్యి ఫీజు చెల్లించాము.. రెగ్యులరైజేషన్​ ఎప్పుడు చేస్తారంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. టీమ్స్​ మెంబర్స్​కు ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది. దీంతో వచ్చిన అప్లికేషన్లలో మొత్తంగా ఇప్పటి వరకూ 5902 అప్లికేషన్లనే ఎల్​ వన్​ టీం వెరిఫికేషన్​ చేసింది. ఇందులోనూ మున్సిపాలిటీల్లోని ప్లాట్లనే ఎక్కువగా వెరిఫికేషన్​ చేశారు. 

డబుల్ లే అవుట్​

యాదగిరిగుట్ట మండలంలోని ఒకే లేవుట్​ను రెగ్యలరైజేషన్​ చేయాలని ఇద్దరు వేర్వేరుగా అప్లయ్​ చేసుకున్నారు. ​ ఇద్దరి వద్ద లే అవుట్​కు సంబంధించిన రిజిస్ట్రేషన్​  డ్యాక్యూమెంట్స్​ ఉన్నాయి. ఇద్దరూ వెంచర్​ తమదంటే తమదే అని ఆఫీసర్లకు చెబుతున్నారు. దీంతో వెరిఫికేషన్​కు వెళ్లిన టీమ్స్​కు ఏం చేయాలో పాలుపోలేదు.

మూడు దశల్లో.. వెరిఫికేషన్​

ఎల్​ఆర్​ఎస్​ అప్లికేషన్లను మూడు దశల్లో  వెరిఫికేషన్​ చేయాల్సి ఉంది.  ప్రతి పంచాయతీ, వార్డుకు ఎల్​-1 పేరుతో ప్రత్యేకంగా ఒక్కో టీమ్ ఏర్పాటు చేశారు. ఈ టీమ్​లో రెవెన్యూ ఇన్​స్పెక్టర్​, ఇరిగేషన్​ ఏఈ, పంచాయతీ సెక్రెటరీ మెంబర్లు, మున్సిపాలిటీల్లో సెక్రెటరీకి బదులుగా టౌన్​ ప్లానింగ్​ సూపర్​వైజర్స్​ ఉన్నారు. LRS 2020 Inspection పేరుతో సెంటర్​ ఫర్​ గుడ్​గవర్నెన్స్​ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా ఎవరి పరిధిలోని గ్రామం లేదా వార్డుకు సంబంధించిన ఎల్​ఆర్​ఎస్​ అప్లికేషన్లే కన్పిస్తాయి.

ప్లాట్​ లేదా వెంచర్​కు సంబంధించిన సర్వే నెంబర్లోని భూమి​ ప్రైవేటుకు చెందినదే అయితే దాన్ని ఓకే చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ, చెరువులు, వక్ఫ్​, దేవాదాయ భూములకు సంబంధించిన పక్షంలో తిరస్కరిస్తారు. రెండో దశలో టీపీవోలు, తహసీల్దార్లు కూడా వాటిని పరిశీలించి ఫీజు నిర్ణయిస్తారు. దరఖాస్తుదారులు నిర్ణీత ఫీజు చెలించిన తరువాత స్థానిక సంస్థల మున్సిపల్ కమిషనర్లు, డీపీవో, ఆదనపు కలెక్టర్ స్థాయిలో పరిశీలిస్తారు. చివరగా కలెక్టర్ పరిశీలించి లోపాలు ఉంటే తిరస్కరిస్తారు. అన్ని సక్రమంగా ఉంటే ఆమోదిస్తారు.