నత్తనడకన ఎల్ఆర్ఎస్​.. ఆన్​లైన్​లో ప్లాట్ల కొలతల్లో తేడాలు

 నత్తనడకన ఎల్ఆర్ఎస్​.. ఆన్​లైన్​లో ప్లాట్ల కొలతల్లో తేడాలు
  • కొందరి వివరాలు కనిపించట్లే 
  • సరిచేసుకుందామంటే సర్వర్ బిజీ​
  • ఈ నెల 31తో ముగియనున్న 25 శాతం రాయితీ గడువు
  • నిజామాబాద్​జిల్లాలో దరఖాస్తుదారుల ఎదురుచూపులు

నిజామాబాద్, వెలుగు: ఎల్ఆర్​ఎస్​ రుసుము చెల్లించి, స్థలాలను రెగ్యులరైజేషన్​చేసుకునేందుకు చేపట్టిన స్పెషల్​డ్రైవ్​ నత్తనకడన సాగుతోంది. జిల్లాలో 35 వేల ప్లాట్లను రెగ్యులరైజ్​చేసుకునేందుకు దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. మరో వారం రోజుల్లో ఎల్​ఆర్​ఎస్​ గడువు ముగియనుండటంతో ఆలోగా క్రమబద్ధీకరణ పూర్తవుతుందా లేదా అన్నది అనుమానంగా మారింది.

యాక్టివ్​గా లేని హెల్ప్​డెస్క్ లు..

25 శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించేందుకు ప్రభుత్వం ఈ నెల 31 వరకు గడువు విధించింది.​ రుసుము చెల్లించాలనుకుంటున్నవారికి టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నాయి. అప్లికేషన్​ చేసినప్పటి వివరాలకు ఆన్​లైన్​లో జనరేట్​అయిన వివరాలకు పొంతన ఉండటం లేదు. సరిచేసుకుందామంటే సర్వర్ బిజీ అని వస్తోంది. ఎల్ఆర్ఎస్ కోసం మున్సిపాలిటీల్లో  ఏర్పాటు చేసిన హెల్ప్​డెస్క్​లు యాక్టివ్​గా లేకపోవడం కూడా శాపంగా మారింది. 2020కి ముందు అప్లికేషన్ పెట్టుకున్న వారి వివరాలేవీ ఆన్​లైన్ లో కనిపించకపోవడంతో గందరగోళం నెలకొంది.

200 గజాలుంటే150 గజాలుగా..

 అర్బన్​ ఏరియాలో  ప్లాట్ల రెగ్యులైజేషన్​కు గత ప్రభుత్వం నిజామాబాద్​జిల్లా నుంచి 35 వేల దరఖాస్తులు తీసుకుంది.  రూ.1,000 రిజిస్ట్రేషన్​ ఫీజుతో 31 అక్టోబర్​2020 నాటికి గడువు విధించింది. ఆ తర్వాత ఎల్ఆర్ఎస్ ను  గ్రామ పంచాయతీలకు వర్తింపజేయడంతో 530 జీపీల పరిధిలో 19 వేల మంది ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్నారు.  అంతకుముందు 2019లో  రూ.10 వేల ఫీజుతో సుమారు 1,500 అప్లికేషన్లు తీసుకున్నారు.  కాంగ్రెస్​ సర్కారు వచ్చాక దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధమైంది. 

వారిపై ఆర్థిక భారం పడకూడదని భావించి, 25 శాతం రాయితీ ప్రకటించింది.  అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి మరో రకంగా ఉండటం సమస్యగా మారింది. చదువుకున్న వ్యక్తులు ఆన్​లైన్​లో ఫీజు చెల్లించడానికి సిద్ధపడగా వివరాలు తప్పుగా కనిపిస్తున్నాయి. రిజిస్ర్టేషన్​డాక్యుమెంట్​లో 200 గజాలున్న ప్లాట్150 గజాలుగా, రిజిస్ట్రేషన్​ టైంలో ఉన్న ఫీజు ఎక్కువగా చూపిస్తున్నాయి.  కొందరి వివరాలేవీ కనిపించడం లేదు. సరిచేసుకోడానికి మున్సిపల్ ఆఫీస్​లకు పరుగులు తీస్తుండగా అక్కడ ఆశించిన సహాయం అందడం లేదు. సర్వర్​ బిజీ అంటూ టౌన్​ప్లానింగ్​స్టాఫ్​ చేతులెత్తేస్తున్నారు. ​ 

ప్రోసీడింగ్స్ వెంటనే ఇవ్వట్లే..

మీసేవ సెంటర్లను ఆశ్రయిస్తే 5 ఎంబీ సైజ్​కు మించకుండా పీడీఎఫ్ ఫైల్​గా అప్​లోడ్​ చేయాల్సి ఉండగా, డాక్యుమెంట్​పై  అవగాహన లేకపోవడంతో శ్రమ వృథా అవుతోంది. పేమెంట్​చేసిన వారికి ప్రొసీడింగ్స్​వెంటనే ఇవ్వకుండా తర్వాత ఇస్తామని చెప్పడంతో దరఖాస్తుదారులు వెనుదిరుగుతున్నారు. ఈ పరిణామాలన్నీ ఎల్ఆర్ఎస్​ను అనుకున్నంత స్పీడ్​గా ముందుకు తీసుకెళ్లడం లేదు. బాల్కొండ మున్సిపాలిటీలో మొత్తం 1,453 మంది దరఖాస్తుదారులకు గానూ ఇప్పటివరకు 68 మంది మాత్రమే ప్లాట్లను రెగ్యులైజ్ చేసుకున్నారు. 

ఆర్మూర్ టౌన్ లో 4,125 మందికి 344, ​ బోధన్​ టౌన్​లో 13,855 మందికి 104, నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో 16 వేలకు పైగా అర్జీదారులు ఉంటే కేవలం 920 మంది ప్లాట్లు క్రమబద్ధీకరణ జరిగి, ప్రభుత్వ ఖాతాకు రూ.13 కోట్ల ఆదాయం చేరింది. రాయితీ గుడువు సమీపిస్తుండగా టార్గెట్​చేరడం ఆఫీసర్లకు కష్టంగా మారింది. 

కొందరు ప్లాట్లు అమ్మేశారు.. 

ఎల్ఆర్ఎస్​కు దరఖాస్తు చేసుకున్న వారిలో  కొంతమంది తమ ప్లాట్లను వేరే వారికి అమ్మేశారు. ఆ వివరాలు ఇప్పుడు మున్సిపాలిటీలో లేవు. రెగ్యులైజేషన్​కోసం రమ్మని దరఖాస్తుదారులకు ఫోన్​చేస్తే వారు తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో ప్లాట్ల రెగ్యులైజేషన్​ మరీ  నెమ్మదిగా ఉంది. 2019 నాటి దరఖాస్తుల ఊసే ఆన్​లైన్​లో  లేదు. అసలు తమ అర్జీలు ఉన్నట్లా? లేనట్లా?  అర్థంకాక సుమారు 1,500 మంది ఆయోమయంలో పడ్డారు.