ఎల్ఆర్ఎస్ గ్రీవెన్స్ పట్టించుకుంటలే

ఎల్ఆర్ఎస్ గ్రీవెన్స్  పట్టించుకుంటలే
  • ప్లాట్ నంబర్ లేకుండానే కొందరికి ఇంటిమేషన్ లెటర్లు
  • అప్లై చేసిన టైమ్​లో దొర్లిన తప్పుల సవరణలకు నో చాన్స్​
  • పోర్టల్​లో గ్రీవెన్స్ రైజ్ చేసినా పరిష్కారం కాని సమస్యలు
  • టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు స్పందించడం లేదంటున్న పబ్లిక్​
  • 25 శాతం రాయితీకి ఇంకా ఐదు రోజులే గడువు


కరీంనగర్, వెలుగు: తమ ప్లాట్లను ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు ఓనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్ర స్థాయిలో అధికారులు పట్టించుకోవడం లేదు. ఎల్ఆర్ఎస్​కు అప్లై చేసుకునే క్రమంలో చేసిన పొరపాట్లను, ఫీజు ఇంటిమేషన్ లెటర్లలో దొర్లిన తప్పులను సవరించడం లేదు. ఎల్ఆర్ఎస్ పోర్టల్​లో ఉన్న గ్రీవెన్స్ రైజ్ ఆప్షన్ ద్వారా దరఖాస్తు పెట్టుకుని రోజులు గడిచినా పట్టించుకోవడం లేదు. స్వయంగా మున్సిపల్ ఆఫీసులకు వెళ్లి దరఖాస్తులు ఇచ్చి, సపోర్టింగ్ డాక్యుమెంట్లు సమర్పించినా ప్లాట్ల ఓనర్లకు నిరాశే ఎదురవుతున్నది. కొన్ని మున్సిపాలిటీల్లోనైతే సమాచారమిచ్చే సిబ్బందే ఉండడం లేదు.

గ్రీవెన్స్​పై ఫోన్ చేసి అడిగినా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు స్పందించడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ ప్రాసెస్​లో ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా టార్గెట్ రీచ్ కాలేని పరిస్థితి నెలకొన్నది. తాము ఫీజు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా.. ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని కొందరు ప్లాట్ల ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నాన్ లేఔట్లలోని ప్లాట్లు, నాన్ లే ఔట్ వెంచర్ల రెగ్యులరైజేషన్  కోసం 2020లో దరఖాస్తులు స్వీకరించారు. అయితే, అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా 25.68 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఇందులో సుమారు 16 లక్షల ప్లాట్లకు ఫీ ఇంటిమేషన్ లెటర్లు జనరేట్ అయినట్లు తెలిసింది. ప్రొహిబిటెడ్ సర్వే నంబర్లలో ఉన్న ప్లాట్లతో పాటు ప్రభుత్వ భూములు, చెరువు శిఖాలకు 20‌‌‌‌‌‌‌‌మీటర్ల దూరంలోని ప్రైవేట్ సర్వే నంబర్లలోని ప్లాట్లకు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు రాలేదు.
    
మాస్టర్ ప్లాన్ లో ఏదైనా రోడ్డు ప్రపోజల్ ఉంటే.. ప్రతిపాదిత రోడ్డు వెళ్లే సర్వే నంబర్ లోని మొత్తం ప్లాట్లను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చారు. గ్రేటర్ వరంగల్ పరిధి పైడిపల్లి మీదుగా 200 ఫీట్ల రోడ్డు వెళ్తుందని కొన్ని సర్వే నంబర్లను ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చడం వివాదాస్పదంగా మారింది.  
    
సర్వే నంబర్ లోని ఒక ప్లాట్ ను ఏదైనా కోర్టు కేసు కారణంగా ఐజీఆర్ఎస్ లేదా ధరణిలోని ప్రొహిబిటెడ్ లిస్టులో చేరిస్తే.. ఆ సర్వే నంబర్ లో వివాదం లేని మిగతా ప్లాట్లకు కూడా ఫీజు ఇంటిమేషన్ లెటర్లు రాలేదు. ఆ ప్లాట్లన్నింటిని ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్నట్లు చూపారు. 
    
దరఖాస్తు సమయంలో తగినన్ని డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయని వారికి కూడా ఫీజు ఇంటిమేషన్ లెటర్లు రాలేదు. అలాంటి వారు ఇప్పుడు డాక్యుమెంట్లన్ని అప్ లోడ్ చేస్తే అప్ లోడ్ సక్సెస్ ఫుల్లీ అని మెసేజ్ వచ్చినా.. తర్వాత కానట్లే చూపిస్తున్నది.
    
ఎల్ఆర్ఎస్ కు అప్లై చేసుకునే క్రమంలో కొందరు ప్లాట్ నంబర్లు, రెవెన్యూ విలేజ్ పేర్లు, ఓనర్ల పేర్లు, సర్వే నంబర్లు, ప్లాట్ విస్తీర్ణాన్ని తప్పుగా ఎంట్రీ చేశారు. దీంతో ఫీజు ఇంటిమేషన్ లెటర్లు కూడా అలాగే జనరేట్ అయ్యాయి. ఆ తప్పులను సరి చేయకుండా ఫీజు చెల్లిస్తే.. ప్రొసీడింగ్స్ కాపీలోనూ అవే తప్పులు క్యారీ ప్రమాదముందని, ఇదే జరిగితే ఒకరి ప్లాట్ నంబర్ పై మరొకరికి ఫైనల్ ప్రొసీడింగ్ కాపీ జారీ అయ్యే ప్రమాదముంది.
    
ఒకే ఏరియాలోని రెండు వేర్వేరు సర్వే నంబర్లలో ఉన్న వేర్వేరు ప్లాట్లకు విధించిన ఎల్ఆర్ఎస్ చార్జీల్లో భారీగా తేడాలు ఉన్నాయి. ఏరియా, దానికి మార్కెట్ వ్యాల్యూ ఒకటే అయినప్పటికీ ఎల్ఆర్ఎస్ చార్జీలు, 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీల్లో తేడాలు ఉంటున్నాయి. ఇలాంటి ఫీజు సమస్యలపై పోర్టల్ ద్వారా గ్రీవెన్స్ రైజ్ చేసినా సరి చేయడం లేదు. దీంతో ప్రస్తుతానికి ఎక్కువగా వచ్చిన ఫీజునే చెల్లించాలా..? లేదంటే ఫీజు సరిచేశాక చెల్లించాలా..? అనే గందరగోళంలో దరఖాస్తుదారులు ఉన్నారు.

దరఖాస్తు సమయంలో ప్లాట్ నంబర్ ను స్పష్టంగా పేర్కొన్నా.. ఫీజు ఇంటిమేషన్ లెటర్ లో ప్లాట్ నంబర్ మిస్ అయింది. అలాంటి వారు కూడా ఫీజు చెల్లించేందుకు
వెనుకాడుతున్నారు.

డాక్యుమెంట్లు అప్​లోడ్ కావట్లే.. 

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ వెంచర్​లో ప్లాట్ కొన్న వ్యక్తి.. తానే సొంతంగా ఇంట్లో నుంచి కంప్యూటర్ ద్వారా ఎల్ఆర్ఎస్ కు అప్లై చేశాడు. దరఖాస్తు సమయంలో ల్యాండ్ డాక్యుమెంట్ అప్ లోడ్ చేశారు. లేఔట్ మ్యాప్, ప్లాట్ సైట్ ప్లాన్, లింక్ డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయలేదు. ఫలితంగా ఇప్పుడు ఆయన ప్లాట్ కు ఫీజు ఇంటిమేషన్ లెటర్ జనరేట్ కాలేదు. అప్లికేషన్ స్టేటస్​లో షార్ట్ ఫాల్ చూపిస్తున్నది. మిగిలిన డాక్యుమెంట్లను ఇప్పుడు అప్ లోడ్ చేస్తే డాక్యుమెంట్ అప్ లోడెడ్ సక్సెస్ ఫుల్లీ అని వస్తున్నది. మళ్లీ అదే దరఖాస్తును చెక్ చేస్తే డాక్యుమెంట్లు అప్ లోడ్ కానట్లు చూపిస్తున్నది.  

గ్రీవెన్స్ రైజ్ చేసినా తప్పులు సరిచేయట్లే..

భూపాలపల్లి మండలం మౌజె కొంపల్లి గ్రామపరిధిలో సర్వే నంబర్ 144లోని ఓ ప్లాట్ ఓనర్.. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసిన సమయంలో తన ప్లాట్ నంబర్​కు బదులు మరో నంబర్ ఎంట్రీ చేశాడు. మీ సేవా కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ తప్పిదం కారణంగా ఇలా జరిగినట్లు గుర్తించారు. ఈ అప్లికేషన్ పై ఫీజు ఇంటిమేషన్ లెటర్ జనరేట్ అయింది. అయితే, ఫీజు ఇంటిమేషన్ లెటర్ లో ప్లాట్ నంబర్ ను సవరిస్తే తాను ఎల్ఆర్ఎస్ చార్జీలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని, తన ప్లాట్ నంబర్ సరిచేయాలని కోరుతూ ఈ నెల 16న గ్రీవెన్స్ రైజ్ చేసినప్పటికీ 10 రోజులైనా మార్చలేదు.

ఈ నెల 31 డెడ్​లైన్

25 శాతం రాయితీతో తమ ప్లాట్లను ఎల్ఆర్ఎస్ చేసుకునే గడువు ఈ నెల 31తో ముగియబోతున్నది. మరోసారి ఎల్ఆర్ఎస్ గడువు పెంచేది లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో వివిధ కారణాలతో ఇప్పుడు ఫీజు చెల్లించలేకపోతున్న దరఖాస్తుదారులు సర్కార్ ఇచ్చిన రాయితీని వినియోగించుకోలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ పోర్టల్ ద్వారా వచ్చిన గ్రీవెన్స్ తో పాటు ఆఫీసుల్లో ఇస్తున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించి 25 శాతం రాయితీతో ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.