
- ఒకేసారి వేలాది మంది ఓపెన్ చేస్తుండడమే కారణం
కరీంనగర్, వెలుగు: ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌లో భాగంగా పేమెంట్స్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌తో లాగిన్ అయ్యాక ఫీ పేమెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయగానే ‘సర్వర్ ఎర్రర్’ అని వస్తోంది. పలుమార్లు ప్రయత్నిస్తే గానీ అప్లికేషన్ నంబర్, పేమెంట్ చేయాల్సిన చార్జీల వివరాలు కనిపించడం లేదు. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెలాఖరులోగా ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలు చెల్లించిన ప్లాట్ల ఓనర్లకు ప్రభుత్వం 25 శాతం రాయితీ ఇస్తోంది. దీంతో ఈ స్కీమ్‌ను వినియోగించుకోవాలని ఆయా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఆఫీసర్లు విస్తృతంగా ప్రచారం చేస్త్నునారు. అంతేకాకుండా దరఖాస్తుదారుల సెల్ నంబర్లకు అప్లికేషన్ వివరాలతో మెసేజ్‌లు సైతం పంపుతున్నారు.
దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది దరఖాస్తుదారులు పోర్టల్ ఓపెన్ చేస్తున్నారు. ఒకే సారి ఎక్కువ మంది పోర్టల్‌ను ఓపెన్ చేస్తుండడంతో సర్వర్ ఎర్రర్ అని చూపిస్తోంది. ఎల్ ఆర్ఎస్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలకుపైగా అప్లికేషన్లు రాగా ఇందులో సుమారు 9 లక్షల దరఖాస్తులనే పరిష్కరించారు. 25 శాతం రాయితీలో ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలు చెల్లించేందుకు మార్చి 31 వరకు గడువు ఉంది. దీంతో చాలా మంది ప్లాట్‌లకు ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు కూడా పోర్టల్‌ను ఓపెన్ చేస్తున్నారు. దీంతో సర్వర్‌పై లోడ్ పడి ఎర్రర్ వస్తున్నట్లు తెలుస్తోంది.