నోటాకు ఓటెయ్యండి ఇండోర్ లో ఓటర్లకు కాంగ్రెస్ పిలుపు

నోటాకు ఓటెయ్యండి ఇండోర్ లో ఓటర్లకు కాంగ్రెస్ పిలుపు

ఇండోర్: మధ్యప్రదేశ్ ఇండోర్ లోక్ సభ సెగ్మెంట్ లో నోటాకు ఓటెయ్యాలని గురువారం కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇండోర్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అక్షయ్ కాంతి బామ్‌‌ చివరి రోజు నామినేషన్​ను ఉపసంహరించుకుని బీజేపీలో చేరారు.ఈ నేపథ్యంలో నోటాకు ఓటెయ్యాలని కాంగ్రెస్ ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. ‘‘గత అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇండోర్ ఓటర్లు బీజేపీకి భారీ విజయాన్ని కట్టబెట్టారు. అయినప్పటికీ, బీజేపీ అక్షయ్ ను ప్రలోభపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఓటర్లు నోటాకు ఓటేసి బీజేపీకి తగిన సమాధానమివ్వాలి” కాంగ్రెస్ సీనియర్ నేత శోభా ఓజా తెలిపారు. ఇండోర్​లో తాము ఏ అభ్యర్థికి మద్దతివ్వబోమని అంతకు ముందు కాంగ్రెస్ ప్రకటించింది.  

మా ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయండి

తమ పార్టీ ఎమ్మెల్యేపై అనర్హత వేటు విధించాలని అస్సాం అసెంబ్లీ స్పీకర్ బిశ్వజిత్ దైమరీకి కాంగ్రెస్ లేఖ రాసింది. అసెంబ్లీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే షెర్మాన్ అలీ అహ్మద్ పై అనర్హత వేటు వేయాలని కోరింది. లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేశారంటూ 167 పేజీల ఫిర్యాదు లేఖను అధికారులకు అందజేసింది. అస్సాం కాంగ్రెస్ ఈ విషయంపై స్పీకర్ ను సంప్రదించడం ఇది రెండోసారి. ‘‘మా పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా అహ్మద్ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ వ్యతిరేక పోస్టులు పెడుతున్నారు. అందువల్ల ఆయనపై తక్షణమే చర్య తీసుకోవాలని స్పీకర్ ను కోరాం” అని కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ రకీబుల్ హుస్సేన్ పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అహ్మద్​ను 2021 అక్టోబర్​లోనే సస్పెండ్ చేసింది.