ఏకనా స్టేడియం వేదికగా లక్నోతో జరుగుతోన్న మ్యాచ్ లో చెన్నై జట్టు భారీ స్కోర్ చేసింది. చివరి ఓవర్లో ధోనీ(28) మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టుకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ రచిన్(0) డకౌటయ్యాడు. ఆ తరువాత కాసేపటికే కెప్టెన్ రుతురాజ్(17) ఔటయ్యాడు. దీంతో నిలకడగా ఆడుతూ రహానె (36), జడేజా(54*) నిలకడగా ఆడుతూ జట్టు స్కోర్ పెంచారు.
ఈ క్రమంలోనే కృనాల్ చెన్నైకు బిగ్ షాకిచ్చాడు. రహానెను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన శివమ్ దూబె(3) కూడా నిరాశపరిచాడు. స్టాయినిస్ వేసిన 12 ఓవర్లో రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ వెంటనే రిజ్వీ(1) రూపంలో చెన్నై ఐదో వికెట్ కోల్పోయింది. దీంతో 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి చెన్నై పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జడేజాకు తోడుగా మొయిన్ అలీ(30) జోరు చూపించాడు.
ఇద్దరు కలిసి జట్టు స్కోర్ ను 150 పరుగులు దాటించారు. రవి వేసిన 18వ ఓవర్లో వరుసగా 3 సిక్సులు కొట్టిన మొయిన్ అలీ ఆ తరువాత మరో షాట్ ఆడే ప్రయత్నంలో బదోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన ధోనీ బ్యాట్ ఝళిపించాడు. ఏకంగా 9 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఇందులో 2 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. లక్నో బౌలర్లలో కృనాల్ 2 వికెట్లు పడగొట్టగా.. మోసిన్, యశ్, రవి, స్టాయినిస్ తలో వికెట్ తీశారు.