ఆర్మీ కొత్త చీఫ్​గా మనోజ్​ పాండే

న్యూఢిల్లీ: తదుపరి ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్​ జనరల్​ మనోజ్​ పాండే నియమితులు కానున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్​ జనరల్​ ఎంఎం నరవాణే పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండడంతో ఆయన స్థానంలో మనోజ్​పాండే బాధ్యతలు స్వీకరించనున్నారు. లెఫ్టినెంట్​ జనరల్​ పాండే ప్రస్తుతం వైస్​ చీఫ్​ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ గా ఉన్నారు. అంతకుముందు సిక్కిం, అరుణాచల్​ప్రదేశ్​సెక్టార్లలో లైన్​ ఆఫ్ యాక్చువల్​ కంట్రోల్(ఎల్ఏసీ) వద్ద ఈస్టర్న్ ఆర్మీ కమాండ్​ హెడ్​గా బాధ్యతలు నిర్వహించారు. 1982 డిసెంబర్​లో బాంబే సపర్స్​తో లెఫ్టినెంట్​ జనరల్​ పాండే కెరీర్​ మొదలైంది. తన సుదీర్ఘ కెరీర్​లో ఆయన ఎన్నో కీలకమైన బాధ్యతలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఎన్నోరకాల కౌంటర్​ ఇన్​సర్జన్సీ ఆపరేషన్లలో భాగస్వామిగా ఉన్నారు. జమ్మూకాశ్మీర్​ లో ఆపరేషన్​ పరాక్రమ్​ సమయంలో లైన్​ ఆఫ్ కంట్రోల్​ వద్ద ఇంజనీర్​ రెజిమెంట్​కు నేతృత్వం వహించారు. వెస్ట్రన్​ లడాఖ్​ ఏరియాల్లో మౌంటెడ్​ డిజిజన్​కు హెడ్​గా ఉన్నారు. ఇథియోపియా, ఎరిత్రియాల్లో యూఎన్​ మిషన్లలో చీఫ్​ ఇంజనీర్​గా ఆయన సేవలందించారు. 2020 జూన్ నుంచి 2021 మే వరకు అండమాన్, నికోబార్​ కమాండ్​కు కమాండర్​ ఇన్​ చీఫ్​గానూ వ్యవహరించారు. ఆయన అందించిన సేవలకు గానూ పరమ్​ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, విశిష్ట సేవా మెడల్ వంటి పురస్కారాలు పొందారు.