ప్రజలారా జాగ్రత్త..! వైద్యుడి నుంచి రూ. 48 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

ప్రజలారా జాగ్రత్త..! వైద్యుడి నుంచి రూ. 48 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

కూటి కోసం కోటి విద్యలు.. అన్నట్లు కోట్లు కొట్టేయడానికి సైబర్ నేరగాళ్లు శతకోటి విధాలుగా ప్రయత్నిస్తున్నారు. రోజుకో మార్గాన్ని అనుసరిస్తూ అమాయక చక్రవర్తుల నుండి అందినకాడికి దోచుకుంటున్నారు. వీరి బారిన పడుతున్న వారిలో చదువుకోని వారి కంటే చదువుకున్న వారే ఎక్కువుగా ఉంటున్నారు. తాజాగా, లక్నోకు చెందిన ఓ డాక్టర్ నుండి సైబర్ మోసగాళ్లు రూ.40 లక్షలు కొట్టేశారు. 

కొరియర్ పేరుతో భయపెట్టి.. 

ఆగస్ట్ 20న డాక్టర్ అశోక్ సోలంకికి ముంబైలోని ఫెడెక్స్ కొరియర్ సర్వీస్‌ ఉద్యోగిగా ఒక వ్యక్తి కాల్ చేశాడు. డాక్టర్ సోలంకి పేరుతో నకిలీ పాస్‌పోర్టులు, ల్యాప్‌టాప్‌లు, పెన్ డ్రైవ్‌లు, డ్రగ్స్‌తో కూడిన పార్శిల్‌ను ఇరాన్‌కు పంపినట్లు తెలిపారు. ఆ మాటలు విన్న డాక్టర్ సోలంకి కంగారు పడిపోయారు. ఆపై కొద్దిసేపటికి ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారిగా నటిస్తూ మరో వ్యక్తి స్కైప్ ద్వారా డాక్టర్‌కు ఫోన్ చేశాడు. 

తనను తాను ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాడు.. డాక్టర్ ఖాతా ద్వారా కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు బెదిరించాడు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఏసీబీ), డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఈడీ) అధికారులు తన ఖాతా బదిలీలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపాడు. ఖాతాలో మిగిలిన డబ్బు మొత్తాన్ని 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) ఖాతాలకు బదిలీ చేయాలని సూచించాడు. విచారణ అనంతరం డబ్బును తిరిగి ఇస్తామని చెప్పాడు. 

అప్పటికే భయపడిపోయిన డాక్టర్ సోలంకి సైబర్ నేరగాళ్ల సలహా మేరకు అతని ఖాతాలో ఉన్న డబ్బు మొత్తాన్ని వారు చెప్పిన ఖాతాకు బదిలీ చేసాడు. అనంతరం రోజులు గడుస్తున్నాడాక్టర్ డబ్బు తిరిగి రాలేదు.. సైబర్ నేరగాళ్లు ఫోనూ చేయలేదు. ఆయన తనకొచ్చిన ఫోన్ నంబర్లను సంప్రదించగా స్విచ్ ఆఫ్ వచ్చాయి. దాంతో, మోసపోయానని గ్రహించిన డాక్టర్ పోలీసులను ఆశ్రయించాడు. తాను గంటల తరబడి వైద్య సేవలందించి సంపాదించిన మొత్తమని.. ఎలాగైనా తిరిగొచ్చేలా చూడాలని పోలీసులను వేడుకున్నాడు. 

ప్రజలారా జాగ్రత్త..!

ఇప్పుడు బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం.. మేము బ్యాంకు అధికారులం.. OTP చెప్పండి అనే రోజులు పోయాయి. ఇప్పడంతా మీ పేరుతో కొరియర్ వచ్చింది. ఆ పార్శిల్‌లో ఉన్న వస్తువులు కావాలంటే డబ్బులు చెల్లించాలి.. లేదా మీ పేరుతో వచ్చిన పార్శిల్ లో డ్రగ్స్, గన్స్ ఉన్నాయంటూ భయపెట్టడం మొదలుపెట్టారు. ఒకవేళ మీకు అటువంటి మోసపూరిత కాల్స్ వచ్చినప్పటికీ.. మోసపోకండి. మీ దగ్గరలోని పోలీస్ అధికారులను సంప్రదించండి. మీరు భయపడిపోయి అవతలి వ్యక్తి మాటలు నమ్మరా..! మీ అకౌంట్లో ఉన్న డబ్బులు పోయినట్లే.. జాగ్రత్త సుమీ..!