- 6 వికెట్ల తేడాతో ఓడిన సీఎస్కే
- గైక్వాడ్ వంద వృథా
చెన్నై : ఐపీఎల్17లో చెన్నై సూపర్ కింగ్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ మరోసారి పైచేయి సాధించింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ చెన్నైని ఓడించింది. చెపాక్‌లో మంగళవారం జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో మార్కస్ స్టోయినిస్ (63 బాల్స్‌లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో 124 నాటౌట్) ఖతర్నాక్ సెంచరీతో చెలరేగడంతో 6 వికెట్ల తేడాతో సీఎస్కేపై గెలిచింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బాల్స్‌లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 108 నాటౌట్) సెంచరీ, శివం దూబే (27 బాల్స్‌లో 3 ఫోర్లు
7 సిక్సర్లతో 66) ఫిఫ్టీతో భారీ స్కోరు చేసినా బౌలింగ్ ఫెయిల్యూర్‌తో చెన్నైకి ఓటమి తప్పలేదు. తొలుత సీఎస్కే 20 ఓవర్లలో 210/4 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో లక్నో 19.3 ఓవర్లలో 213/4 స్కోరు చేసి గెలిచింది. నికోలస్ పూరన్ (15 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34) రాణించాడు. స్టోయినిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
గైక్వాడ్, దూబే ధమాకా
కెప్టెన్ రుతురాజ్, దూబే ధనాధన్ బ్యాటింగ్‌తో సీఎస్కే భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఆ జట్టు ఆరంభంలో మాత్రం ఇబ్బంది పడింది. ఇన్నింగ్స్ ఆరో బాల్‌కే ఓపెనర్ అజింక్యా రహానె (1)ను ఔట్ చేసిన హెన్రీ షాకిచ్చాడు. గైక్వాడ్ స్టార్టింగ్ నుంచే వరుస బౌండ్రీలతో హోరెత్తించినా వన్‌డౌన్ బ్యాటర్ డారిల్ మిచెల్ (11) నిరాశ పరిచాడు. ఎదుర్కొన్న రెండో బాల్‌కే ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న అతను యశ్ ఠాకూర్ వేసిన ఆరో ఓవర్లో దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చాడు. దాంతో పవర్ ప్లేలో సీఎస్కే 49/2తో నిలిచింది.
రుతురాజ్ దూకుడు కొనసాగిస్తూ 28 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. రవీంద్ర జడేజా ( 17) శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మోసిన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 12 ఓవర్లకు సీఎస్కే 102/3తో నిలవగా.. దూబే రాకతో స్కోరు బోర్డు దూసుకెళ్లింది. స్టోయినిస్ బౌలింగ్‌లో తొలి సిక్స్ కొట్టిన అతను దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. యశ్ ఠాకూర్ వేసిన 16వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో అలరించాడు. మరో ఎండ్‌లో గైక్వాడ్ సైతం స్పీడు పెంచాడు. ఠాకూర్ తర్వాతి ఓవర్లో 6. 4, 4 రాబట్టిన అతను 56 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మోసిన్ వేసిన 19వ ఓవర్లో 6, 4, 6 కొట్టిన దూబే 22 బాల్స్‌లోనే ఫిఫ్టీ మార్కు దాటాడు. తర్వాతి బాల్‌కే అతనిచ్చిన క్యాచ్‌ను డికాక్ డ్రాప్ చేశాడు. స్టోయినిస్ వేసిన ఆఖరి ఓవర్ తొలి బాల్‌కు సిక్స్‌తో స్కోరు 200 దాటించిన దూబే నాలుగో బాల్‌కు రనౌట్‌గా వెనుదిరగ్గా చివరి బాల్‌కు ఫోర్ కొట్టిన ధోనీ (4 నాటౌట్) ఇన్నింగ్స్‌ను ముగించాడు. హెన్రీ, మోసిన్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.
మార్కస్ తడాఖా
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో లక్నోకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలినా వన్‌డౌన్ బ్యాటర్ మార్కస్ స్టోయినిస్ అద్భుత పోరాటంతో జట్టును గెలిపించాడు. ఇన్నింగ్స్ మూడో బాల్‌కే ఓపెనర్ క్వింటన్ డికాక్ (0)ను డకౌట్ చేసిన దీపక్ చహర్ చెన్నైకి అదిరిపోయే ఆరంభం అందించాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (16) ఓ ఫోర్, సిక్స్‌తో జోరుమీద కనిపించినా.. ముస్తాఫిజుర్ వేసిన ఐదో ఓవర్లో రుతురాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న స్టోయినిస్ శార్దూల్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదగా పవర్ ప్లేను లక్నో 45/2తో ముగించింది.
పవర్ ప్లే తర్వాత జడేజా బౌలింగ్‌లో సిక్స్, మొయిన్ అలీ ఓవర్లో 4, 6 బాదిన అతను 26 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కానీ, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన దేవదత్ పడిక్కల్ (19 బాల్స్‌లో 13) నిరాశ పరిచాడు. పతిరణ 151.1 కి.మీ వేగంతో వేసిన యార్కర్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయినా మరో ఎండ్‌లో స్టోయినిస్ వెనక్కుతగ్గలేదు. తుషార్ వేసిన 13వ ఓవర్లో 6,4తో మళ్లీ వేగం పెంచాడు. అతనికి పూరన్ కూడా తోడయ్యాడు. శార్దూల్ బౌలింగ్‌లో అతను వరుసగా 6,4,6తో విజృంభించడంతో స్కోరు 150 దాటింది. ఈ దశలో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన పతిరణ..
పూరన్‌ను ఔట్ చేసి చెన్నైని రేసులోకి తెచ్చాడు. చివరి మూడు ఓవర్లలో లక్నోకు 47 రన్స్ అవసరం అయ్యాయి. తీవ్ర ఒత్తిడిలో ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన స్టోయినిస్ వెంటనే డబుల్ తీసి సెంచరీ పూర్తి చేసుకోగా..చివరి బాల్‌కు దీపక్ హుడా కూడా (17 నాటౌట్) సిక్స్ రాబట్టాడు. దాంతో సమీకరణం 12 బాల్స్‌లో 32 రన్స్‌గా మారింది. 19వ ఓవర్లో హుడా మూడు ఫోర్లు సహా 15 రన్స్ రాబట్టగా.. ఆఖరి ఓవర్లో స్టోయినిస్ వరుసగా 6, 4, 4, 4తో జట్టును గెలిపించాడు.