- రాణించిన డికాక్, అవేశ్ ఖాన్, హోల్డర్
- రసెల్ పోరాటం వృథా
ఐపీఎల్–15లో కొత్త జట్ల హవా కొనసాగుతున్నది..! టాప్ ప్లేస్ కోసం గుజరాత్, లక్నో సూపర్‌జెయింట్స్ తీవ్రంగా పోటీపడుతున్నాయి..! క్వింటన్ డికాక్ (29 బాల్స్ లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50), దీపక్ హుడా (27 బాల్స్ లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41) బ్యాట్లతో మెరుపులు మెరిపిస్తే.. బౌలింగ్‌లో అవేశ్ ఖాన్ (3/19), హోల్డర్ (3/31) దుమ్మురేపడంతో.. కోల్‌కతాపై లక్నో టాప్ షో చూపెట్టింది..! ఫలితంగా 16 పాయింట్లతో టాప్ ప్లేస్‌తో ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది.!!
పుణె: ఐపీఎల్–15లో లక్నో సూపర్‌జెయింట్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ.. పవర్ హిట్టర్లు ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఈజీగా చెక్ పెట్టింది. దీంతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 75 రన్స్ భారీ తేడాతో నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 176/7 స్కోరు చేసింది. డికాక్, హుడాతో పాటు స్టోయినిస్ (28) రాణించాడు. తర్వాత కోల్‌కతా 14.3 ఓవర్లలో 101 రన్స్‌కు ఆలౌటైంది. రసెల్ (19 బాల్స్ లో 3 ఫోర్లు 5 సిక్సర్లతో 45) మినహా అందరూ విఫలమయ్యారు. అవేశ్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
డికాక్, హుడా షో..
మొదట ఓపెనర్ డికాక్, మిడిల్‌లో హుడా, చివర్లో స్టోయినిస్ మెరుపులతో లక్నో మంచి స్కోరు సాధించింది. తొలి ఓవర్లోనే కెప్టెన్ రాహుల్ (0) రనౌటై డైమండ్ డకౌట్‌గా వెనుదిరగ్గా.. డికాక్‌తో కలిసి హుడా ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ పోటీపడి బౌండ్రీలు సాధించడంతో పవర్ ప్లేలో లక్నో 66/1తో నిలిచింది. తర్వాతి ఓవర్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాక డికాక్‌ను నరైన్ పెవిలియన్ పంపడంతో రెండో వికెట్‌కు 71 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. అనంతరం క్రునాల్ పాండ్యా (25), హుడా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. దీంతో 11వ ఓవర్లోనే 100 మార్క్ దాటిన లక్నో స్కోరు 200 దాటేలా కనిపించింది. కానీ ఈ సమయంలో గొప్పగా పుంజుకున్న కోల్ కతా బౌలర్లు జెయింట్స్ బ్యాటర్ల జోరుకు అడ్డుకట్ట వేశారు. వరుస ఓవర్లలో హుడా, క్రునాల్‌ను రసెల్ పెవిలియన్ పంపాడు. వీరి బౌలింగ్ దాటికి బదోని (15 నాటౌట్) పరుగులు చేసేందుకు ఇబ్బందిపడగా.. శివం మావి వేసిన 19వ ఓవర్లో ఐదు సిక్సర్లతో స్టోయినిస్, హోల్డర్ (13) జట్టుకు మంచి స్కోర్ అందించారు. వీరి దూకుడుకు 18 ఓవర్లలో 142/4గా ఉన్న స్కోర్ ఏకంగా 19వ ఓవర్ ముగిసే సరికి 176/7కు చేరింది. ఆఖరి ఓవర్లో హోల్డర్, చమీర (0) వికెట్లు కోల్పోయిన లక్నో కేవలం నాలుగు రన్సే సాధించింది.
పెవిలియన్‌కు క్యూ..
ఛేజింగ్‌లో లక్నో బౌలర్ల దెబ్బకు కోల్‌కతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. తొలి ఓవర్లోనే ఇంద్రజిత్ (0) రూపంలో మొదటి వికెట్ కోల్పోయిన రైడర్స్.. నాలుగో ఓవర్లో కెప్టెన్ శ్రేయస్ (6) వికెట్ చేజార్చుకుంది. ఫించ్ (14), నితీష్ రాణా (2) కూడా నిరాశపర్చడంతో 6.5 ఓవర్లలో 25/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో రసెల్ కాసేపు పోరాడాడు. లక్నో బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఎదురుదాడికి దిగాడు. అతడికి రింకూ సింగ్ (6) సపోర్ట్ ఇచ్చా-డు. హోల్డర్ వేసిన 9వ ఓవర్లో 6,6,6,4 బాదిన రసెల్ తర్వాతి ఓవర్లోనూ మరో సిక్సర్‌తో రెచ్చిపోయాడు. 11వ ఓవర్లో రింకూ ఔటైనా.. వచ్చీరాగానే 6,4తో నరైన్ (22) జోరు చూపించాడు. అయితే కాసేపటికే అవేశ్ ఖాన్.. రసెల్, అనుకూల్ రాయ్ (0)ను ఔట్ చేసి కేకేఆర్ ను దెబ్బకొట్టాడు. ఇక హోల్డర్ వేసిన 15వ ఓవర్లో నరైన్, సౌథీ (0)తో పాటు హర్షిత్ (2) రనౌట్ కావడంతో లక్నోకు విక్టరీ ఖాయమైంది.
స్కోర్ బోర్డు
లక్నో: డికాక్ (సి) మావి (బి) నరైన్ 50, రాహుల్ (రనౌట్) శ్రేయస్ 0, హుడా (సి) శ్రేయస్ (బి) రసెల్ 41, క్రునాల్ (సి) ఫించ్ (బి) రసెల్ 25, బదోని (నాటౌట్) 15, స్టోయినిస్ (సి) శ్రేయస్ (బి) మావి 28, హోల్డర్ (సి) రింకూ సింగ్ (బి) సౌథీ 13, చమీర (రనౌట్) 0, ఎక్స్ ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 176/7. వికెట్ల పతనం : 1–2, 2–73, 3–107, 4–122, 5–160, 6–175, 7–176. బౌలింగ్: సౌథీ 4–0–28–1, మావి 4–0–50–1, నరైన్ 4–0–20–1, అనుకూల్ 3–0–27–0, హర్షిత్ 2–0–27–0, రసెల్ 3–0–22–2.
కోల్ కతా: ఇంద్రజిత్ (సి) బదోని (బి) మోసిన్ 0, ఫించ్ (సి) డికాక్ (బి) హోల్డర్ 14, శ్రేయస్ (సి) బదోని (బి) చమీర 6, రాణా (బి) అవేశ్ 2, రింకూ సింగ్ (సి) క్రునాల్ (బి) బిష్నోయ్ 6, రసెల్ (సి) హోల్డర్ (బి) అవేశ్ 45, నరైన్ (సి) క్రునాల్ (బి) హోల్డర్ 22, అనుకూల్ (సి) డికాక్ (బి) ఆవేశ్ 0, మావి (నాటౌట్) 1, సౌథీ (సి) ఆవేశ్ (బి) హోల్డర్ 0, హర్షిత్ (రనౌట్) 2, ఎక్స్ ట్రాలు: 3, మొత్తం: 14.3 ఓవర్లలో 101 ఆలౌట్. వికెట్ల పతనం: 1–0, 2–11, 3–23, 4–25, 5–69, 6–85, 7–85, 8–99, 9–99, 10–101. బౌలింగ్: మోసిన్ 3–1–6–1, చమీర 3–0–14–1, అవేశ్ 3–1–19–3, హోల్డర్ 2.3–0–31–3, బిష్నోయ్ 3–0–30–1.