
ఏకనా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జయింట్స్ బ్యాటింగ్ లో నిరాశ పరిచింది. పూరన్, బదోని మాత్రమే రాణించగా మిగిలిన వారందరూ విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లందరూ కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. 44 పరుగులు చేసిన పూరన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. బదోని (41) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జయింట్స్ కు తొలి ఓవర్ లోనే బిగ్ షాక్ తగిలింది. టోర్నీలో రెండు హాఫ్ సెంచరీలు ఫామ్ లో ఉన్న మిచెల్ మార్ష్.. అర్షదీప్ బౌలింగ్ లో డకౌటయ్యాడు. ఆ తర్వాత మార్కరం పవర్ ప్లే లో కొన్ని మెరుపులు మెరిపించి ఔటయ్యాడు. కెప్టెన్ రిషబ్ పంత్ వచ్చి కేవలం 2 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో లక్నో 35 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును పూరన్, బదోని ఆదుకున్నారు. నాలుగో వికెట్ కు 54 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు.
బౌండరీలతో ఊపు మీదున్న పూరన్ 44 పరుగులు చేసి చాహల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. మిల్లర్ (19) కలిసి బదోని ఒక చిన్న భాగస్వామ్యం నెలకొల్పాడు. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో బదోనీ క్రీజ్ లో పాతుకుపోయాడు. చివర్లో అబ్దుల్ సమద్ మెరుపులు మెరిపించడంతో పంజాబ్ గౌరవ ప్రథమమైన స్కోర్ చేసింది. సమద్ 12 బంతుల్లోనే 27 పరుగులు చేయడం విశేషం. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు. లాకీ ఫెర్గుసన్, మ్యాక్స్ వెల్, మార్కో జాన్సెన్, చాహల్ తలో వికెట్ తీసుకున్నారు.