LSG vs CSK: హాఫ్ సెంచరీతో పంత్ ఒంటరి పోరాటం.. చెన్నై టార్గెట్ ఎంతంటే..?

LSG vs CSK: హాఫ్ సెంచరీతో పంత్ ఒంటరి పోరాటం.. చెన్నై టార్గెట్ ఎంతంటే..?

చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జయింట్స్ బ్యాటింగ్ లో తడబడింది. సోమవారం (ఏప్రిల్ 14) ఎకనా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో కెప్టెన్ రిషబ్ పంత్ (49 బంతుల్లో 63: 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీకి తోడు.. మార్ష్ (30), సమద్ (20) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగుల ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. 63 పరుగులు చేసి పంత్ టాప్ స్కోరర్ గా  నిలిచాడు. చెన్నై బౌలర్లలో పతిరానా, జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఖలీల్ అహ్మద్, కంబోజ్ లకు చెరో వికెట్ దక్కింది.         

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నోకి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్ లో ఉన్న మార్కరం 6 పరుగులే చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో ఔటయ్యాడు. కాసేపటికే కంబోజ్ నికోలస్ పూరన్ ను ఔట్ చేసి చెన్నై జట్టుకు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. దీంతో లక్నో 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో లక్నోని కెప్టెన్ రిషబ్ పంత్, మిచెల్ మార్ష్ ఆదుకున్నారు. ఆచితూచి ఆడుతూ లక్నో ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. మూడో వికెట్ కు 50 పరుగులు జోడించిన తర్వాత 30 పరుగులు చేసిన మార్ష్ జడేజా బౌలింగ్ లో బౌల్డయ్యాడు. 

ఆ తర్వాత వచ్చిన బదోనీ తో కలిసి పంత్ స్వల్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. నాలుగో వికెట్ కు 32 పరుగులు జోడించారు. బదోనీ (22) ఔటైనా.. చివర్లో సమద్ (20) తో కలిసి పంత్ మెరుపులు మెరిపించాడు. దీంతో లక్నో 160 పరుగుల మార్క్ చేరుకుంది. ఒకవైపు వికెట్లు పడుతున్నా చివరి ఓవర్ వరకు క్రీజ్ లో ఉన్న పంత్ 63 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.