LSG vs MI: లక్నో థ్రిల్లింగ్ విక్టరీ.. భారీ లక్ష్య ఛేదనలో పోరాడి ఓడిన ముంబై

LSG vs MI: లక్నో థ్రిల్లింగ్ విక్టరీ.. భారీ లక్ష్య ఛేదనలో పోరాడి ఓడిన ముంబై

ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జయింట్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఏకనా క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 12 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్ లో మార్ష్ (60), మార్కరం (53) హాఫ్ సెంచరీలు తోడు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఈ టోర్నీలో రెండో గెలుపు  నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులకు పరిమితమైంది.    

204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఊహించని షాక్ తగిలింది. ఓపెనర్లు విల్ జాక్స్ (5), రికెల్ టన్(7) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. రెండో ఓవర్లో ఆకాష్ డీప్ బౌలింగ్ లో జాక్స్ ఔట్ కాగా.. మూడో ఓవర్ లో శార్దూల్ ఠాకూర్ రికెల్ టన్ ను పెవిలియన్ కు పంపాడు. దీంతో ముంబై 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో నమన్ ధీర్, సూర్య కుమార్ యాదవ్ జట్టును నిలబెట్టారు. ముఖ్యంగా నమన్ దీర్ పవర్ ప్లే లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆకాష్ దీప్ వేసిన నాలుగో ఓవర్ లో 21 పరుగులు రాబట్టాడు. 

►ALSO READ | IND vs ENG: టీమిండియాతో టెస్ట్ సిరీస్.. ఇద్దరు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లు ఔట్!

నమన్ ఆటతో ముంబై పవర్ ప్లేలో 64 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత నమన్ దీర్ (46) ఔటైనా.. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ (24) ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో సూర్య 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి  చేసుకున్నాడు. చివరి 5 ఓవర్లలో జట్టు విజయానికి 61 పరుగులు కావాల్సిన దశలో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.ఈ దశలో లక్నో బౌలర్లు ఒత్తిడిలో అద్భుతంగా మ్యాచ్ గెలిపించారు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్ ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ తలో వికెట్ తీసుకున్నారు.     

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. మార్ష్ మెరుపులకు తోడు మార్కరం హాఫ్ సెంచరీతో ముంబై ముందు టఫ్ టార్గెట్ పెట్టింది. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్య 5 వికెట్లు పడగొట్టాడు. అశ్వని కుమార్, విగ్నేష్ కుమార్, బౌల్ట్ తలో ఒక వికెట్ తీసుకున్నారు.