
ఐపీఎల్ 2025 లో లక్నో రాజస్థాన్ రాయల్స్ పై లక్నో సూపర్ జయింట్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మ్యాచ్ మొత్తం రాజస్థాన్ చేతిలో ఉన్నప్పటికీ చివరి ఓవర్లో ఆవేశ్ ఖాన్ మ్యాజిక్ చేయడంతో సంచలన విజయాన్ని అందుకుంది. జైపూర్ వేదికగా శనివారం (ఏప్రిల్ 19) జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ పై 2 పరుగుల తేడాతో నెగ్గింది. చివరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరం కాగా ఆవేశ్ ఖాన్ 6 పరుగులే ఇచ్చాడు.
భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (52 బంతుల్లో 74:5 ఫోర్లు, 4 సిక్సర్లు) కు తోడు కెప్టెన్ పరాగ్ (39).. 14 ఏళ్ళ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (34) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి మ్యాచ్ ఓడిపోయింది. రాజస్థాన్ కు 8 మ్యాచ్ ల్లో ఇది ఆరో ఓటమి కాగా.. మరోవైపు లక్నోకి 8 మ్యాచ్ ల్లో ఇది ఐదో విజయం.
181 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు సూర్యవంశీ, జైశ్వాల్ బౌండరీల వర్షం కురిపిస్తూ అదరగొట్టారు. తొలి వికెట్ కు 8.4 ఓవర్లలోనే 85 పరుగులు జోడించి సూపర్ స్టార్ట్ ఇచ్చారు. వీరిద్దరి ధాటికి రాజస్థాన్ పవర్ ప్లే లో 61 పరుగులు చేసింది. 9 ఓవర్లో మార్కరం సూర్యవంశీ (34)ని ఔట్ చేసి లక్నోకి తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత కాసేపటికే నితీష్ రానా 8 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో పరాగ్, జైశ్వాల్ బాధ్యతగా ఆడుతూ జట్టును ముందుకు తీసుకెళ్లారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీ కొడుతూ రాజస్థాన్ ను విజయం దిశగా తీసుకెళ్లారు.
ఈ క్రమంలో జైశ్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైశ్వాల్, పరాగ్ స్వల్ప వ్యవధిలో ఔటవ్వడంతో చివర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తీవ్ర ఒత్తిడిలో హెట్ మేయర్, జురెల్ బ్యాట్ ఝుళిపించలేకపోవడంతో రాజస్థాన్ కు ఓటమి తప్పలేదు. లక్నో బౌలర్లలో మార్కరం, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో మార్కరం (45 బంతుల్లో 66:5 ఫోర్లు, 3 సిక్సర్లు), బదోనీ (50) హాఫ్ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో హసరంగా రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆర్చర్, సందీప్ శర్మ, దేశ్ పాండే తలో వికెట్ తీసుకున్నారు.
No one saw that coming! Avesh Khan stuns with the final over as LSG pull off a heist 🎩
— ESPNcricinfo (@ESPNcricinfo) April 19, 2025
Scorecard 👉 https://t.co/IsM16mwfp9 pic.twitter.com/ZyCEusiUyn