- రాణించిన రాహుల్, డికాక్
లక్నో: వరుసగా రెండు ఓటముల తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ పెర్ఫామెన్స్ చేసింది. వరుసగా రెండు భారీ విజయాలతో దూసుకెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు చెక్ పెట్టింది. బౌలర్లకు తోడు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (53 బాల్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 ), క్వింటన్ డికాక్ ( 43 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 54) సత్తా చాటడంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ 8 వికెట్ల తేడాతో సీఎస్కేను ఓడించింది.
లీగ్‌లో నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. వన్‌సైడ్ మ్యాచ్‌లో మొదట చెన్నై 20 ఓవర్లలో 176/6 స్కోరు చేసింది. రవీంద్ర జడేజా (40 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 57 నాటౌట్) ఫిఫ్టీతో సత్తా చాటాడు. ఓపెనింగ్‌లో అజింక్యా రహానె (24 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 36) మెరవగా.. చివర్లో మొయిన్ అలీ (20 బాల్స్‌లో 3 సిక్సర్లతో 30), ఎంఎస్ ధోనీ (9 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 నాటౌట్) రాణించారు. లక్నో బౌలర్లలో క్రునాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్‌లో లక్నో 19 ఓవర్లలో 180/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. కేఎల్ రాహుల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఆదుకున్న జడేజా.. ముగించిన ధోనీ
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన సీఎస్కే వరుసగా వికెట్లు కోల్పోయింది. జడేజా ఇన్నింగ్స్‌ను నిలబెట్టగా.. చివర్లో ధోనీ ఇచ్చిన సూపర్ ఫినిషింగ్‌తో మంచి స్కోరు సాధించింది. తొలి ఓవర్లో హెన్రీ నాలుగు రన్సే ఇవ్వగా.. రెండో ఓవర్ తొలి బాల్‌కే రచిన్ రవీంద్ర (0)ను గోల్డెన్ డకౌట్ చేసిన మోసిన్ ఖాన్ చెన్నైకి షాకిచ్చాడు. మరో ఓపెనర్ రహానె ధాటిగా ఆడినా ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (17) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఎదుర్కొన్న 12వ బాల్‌కు గానీ బౌండ్రీ సాధించలేకపోయిన అతడిని తర్వాతి బాల్‌కే యశ్ ఠాకూర్ పెవిలియన్ చేర్చాడు.
రహానె పోరాటంలో పవర్ ప్లేను చెన్నై 51/2తో ముగించింది. తొమ్మిదో ఓవర్లో రహానెను క్రునాల్ బౌల్డ్ చేయగా.. హార్డ్ హిట్టర్ శివం దూబే (3) ఫెయిలయ్యాడు. స్టోయినిస్ బౌలింగ్‌లో కీపర్ రాహుల్ పట్టిన చురుకైన క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆ వెంటనే క్రునాల్ బౌలింగ్‌లో సమీర్ రిజ్వీ (1)ని రాహుల్ స్టంపౌట్ చేయడంతో 89/5తో చెన్నై ఇబ్బందుల్లో పడింది. వరుసగా ఐదు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా రాకపోవడంతో రన్‌రేట్ తగ్గింది. జడేజా జాగ్రత్తగా ఆడటంతో 15 ఓవర్లకు గానీ స్కోరు వంద దాటలేదు. అయితే స్లాగ్ ఓవర్లలో సీఎస్కే జోరు పెంచింది.
క్రీజులో కుదురుకున్న జడేజా వెంటవెంటనే ఫోర్, సిక్స్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. మరోవైపు మొయిన్ అలీ ఒక్కసారిగా గేరు మార్చాడు. బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టాడు. అదే జోరులో మరో షాట్‌కు ప్రయత్నించి బదోనికి క్యాచ్ ఇవ్వడంతో ఆరో వికెట్‌కు 51 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ధోనీ రాకతో స్టేడియం హోరెత్తింది. వరుసగా రెండో మ్యాచ్‌లో మహీ ధనాధన్ షాట్లతో ఫ్యాన్స్‌ను అలరించాడు. మోసిన్ ఖాన్ బౌలింగ్‌లో 4, 6 కొట్టిన అతను... యశ్ ఠాకూర్ వేసిన చివరి ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లతో స్కోరు 170 దాటించి ఇన్నింగ్స్‌కు అదిరిపోయే ఫినిషింగ్ ఇచ్చాడు.
ఓపెనర్ల జోరు
ఛేజింగ్‌లో లక్నో ఓపెనర్లు డికాక్, కేఎల్ రాహుల్ స్టార్టింగ్ నుంచే దుమ్ము రేపారు. పేసర్లు, స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఓవర్‌కు 9 రన్‌రేట్‌తో టీమ్‌ను ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీని విడదీయడానికి సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మొదట్లో డికాక్ కుదురుకునేందుకు సమయం తీసుకోగా.. దీపక్ చహర్ వేసిన నాలుగో ఓవర్లో 4, 6తో రాహుల్ జోరందుకున్నాడు. దేశ్‌పాండే బౌలింగ్‌లో రాహుల్ ఫోర్ కొట్టగా.. డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్స్‌తో డికాక్ సైతం స్పీడు పెంచాడు.
దీపక్ చహర్‌ను టార్గెట్ చేసిన కేఎల్ మరో 4, 6 రాబట్టడంతో పవర్ ప్లేలో లక్నో54/0తో నిలిచింది. పవర్ ప్లే తర్వాత కూడా ఈ ఇద్దరూ జోరు కొనసాగించారు. స్పిన్నర్ జడేజా కాస్త ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా వెనక్కుతగ్గలేదు. డికాక్ 31 రన్స్ వద్ద జడేజా బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను పతిరణ డ్రాప్ చేశాడు. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ అతను ముందుకెళ్లాడు. దీటుగా ఆడుతున్న కెప్టెన్‌కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.
జడ్డూ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన కేఎల్ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. 11 ఓవర్లకు స్కోరు వంద దాటింది. 42 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న డికాక్.. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో తొలి వికెట్‌కు 134 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. అప్పటికే మ్యాచ్ లక్నో చేతుల్లోకి వచ్చేసింది. మరో 43 రన్స్ అవసరం అవగా నికోలస్ పూరన్ ( 23 నాటౌట్) వచ్చీరాగానే సిక్స్, రెండు ఫోర్లతో విజృంభించాడు. పతిరణ బౌలింగ్‌లో జడ్డూ పట్టిన సూపర్ క్యాచ్‌కు రాహుల్ వెనుదిరిగినా పూరన్ గెలుపు లాంఛనం పూర్తి చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 176/6 (జడేజా 57*, రహానె 36, క్రునాల్ 2/16).
లక్నో: 19 ఓవర్లలో 180 /2 (రాహుల్ 82, డికాక్ 54, పతిరణ 1/29)