
కోల్‌కతా: పరుగులు వరదలా పారిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తృటిలో గట్టెక్కింది. నికోలస్ పూరన్ (36 బాల్స్‌లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 87 నాటౌట్), మిచెల్ మార్ష్ (48 బాల్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81), మార్‌క్రమ్ (28 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) హిట్టింగ్‌కు తోడుగా బౌలర్లు కీలక టైమ్‌లో వికెట్లు పడగొట్టడంతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 4 రన్స్ స్వల్ప తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై నెగ్గింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 238/3 స్కోరు చేసింది. తర్వాత కోల్‌కతా 20 ఓవర్లలో 234/7 స్కోరు సాధించింది. రహానె (35 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61), వెంకటేశ్ అయ్యర్ (52 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 45), రింకూ సింగ్ (15 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్) దంచికొట్టినా ప్రయోజనం దక్కలేదు. పూరన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
పరుగుల మోత..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో టాప్–3 బ్యాటర్లు కోల్‌కతా బౌలింగ్‌ను ఊచకోత కోశారు. రెండో ఓవర్‌లోనే మార్‌క్రమ్ రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో 18 రన్స్ దంచాడు. రెండో ఎండ్‌లో వైభవ్ అరోరా ఆఫ్ స్టంప్ లైన్‌తో తన తొలి రెండు ఓవర్లలో 8 రన్సే ఇచ్చాడు. ఐదో ఓవర్‌లోనే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని దించడంతో మార్ష్ ఆచితూచి ఆడాడు. వరుణ్ తొలి మూడు ఓవర్లలో 16 రన్సే ఇచ్చినా వికెట్ తీయలేకపోయాడు. ఫలితంగా లక్నో 59/0తో పవర్‌ప్లేను ముగించింది.
ఫీల్డింగ్ పెరిగిన తర్వాత మార్ష్ గ్యాప్‌ల్లో రన్స్ రాబట్టాడు. తర్వాతి నాలుగు ఓవర్లలో 40 రన్స్ వచ్చాయి. 11వ ఓవర్‌లో హర్షిత్ రాణా (2/51) అఫ్ కట్టర్‌తో మార్‌క్రమ్‌ను ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు 99 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఈ దశలో వచ్చిన పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుణ్, నరైన్‌ను టార్గెట్ చేసి భారీ సిక్సర్లు బాదాడు. వీలైనప్పుడల్లా బౌండ్రీలు కొట్టిన మార్ష్ 36 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. డేంజర్‌గా మారిన ఈ జోడీని 16వ ఓవర్‌లో రసెల్ (1/32) విడగొట్టాడు.
షార్ట్ వైడ్ బాల్‌తో మార్ష్‌ను ఔట్ చేయడంతో రెండో వికెట్‌కు 30 బాల్స్‌లో 71 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. అబ్దుల్ సమద్ (6)కు ఎక్కువగా స్ట్రయిక్ ఇవ్వకుండా ఆడిన పూరన్ 21 బాల్స్‌లోనే ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. మూడో వికెట్‌కు 51 రన్స్ జోడించి సమద్ వెనుదిరగాడు. మొత్తంగా తొలి పది ఓవర్లలో 95 రన్స్ చేసిన లక్నో తర్వాతి పది ఓవర్లలో ఏకంగా
143 రన్స్ దంచింది.
20 బాల్స్ తేడాలో 5 వికెట్లు
భారీ ఛేజింగ్‌లో కోల్‌కతా కూడా దీటుగా పోరాడినా మధ్యలో వికెట్లు చేజార్చుకోవడంతో టార్గెట్‌ను అందుకోలేకపోయింది. తొలి ఓవర్ నుంచే హిట్టింగ్ మొదలుపెట్టిన డికాక్ (15) మూడో ఓవర్‌లో వెనుదిరగడంతో తొలి వికెట్‌కు 37 రన్స్ ముగిశాయి. నరైన్‌తో జతకలిసిన రహానె ఫోర్లు, సిక్సర్లతో లక్నో బౌలర్లను బెంబేలెత్తించాడు. దీంతో పవర్‌ప్లేలో కేకేఆర్ 90/1 స్కోరు చేసింది. కానీ ఏడో ఓవర్‌లో దిగ్వేశ్ రాఠీ (1/33) వేసిన వైడ్ బాల్‌కు మార్‌క్రమ్ ఔటయ్యాడు.
రెండో వికెట్‌కు 54 రన్స్ జతయ్యాయి. వచ్చీ రావడంతో వెంకటేశ్ ఫోర్లతో విరుచుకుపడ్డాడు. తర్వాతి నాలుగు ఓవర్లలో 39 రన్స్ రాబట్టడంతో ఫస్ట్ టెన్‌లో నైట్‌రైడర్స్129/2 స్కోరుతో నిలిచింది. ఈ దశలో రహానె నెమ్మదించినా వెంకటేశ్ సింగిల్స్, ఫోర్లతో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. అయితే 13వ ఓవర్‌లో శార్దూల్ (2/52).. రహానెను ఔట్ చేసి మ్యాచ్‌ను కీలక మలుపు తిప్పాడు. మూడో వికెట్‌కు 71 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది.
ఈ టైమ్‌లో మరింత పట్టుబిగించిన లక్నో బౌలర్లు వరుస విరామాల్లో రమణ్‌దీప్ (1), రఘువంశీ (5), రసెల్ (7)తో పాటు వెంకటేశ్‌ను ఔట్ చేశారు. 20 బాల్స్ తేడాలో ఐదు కీలక వికెట్లు పడటంతో 162/2తో ఉన్న స్కోరు కాస్త 185/7గా మారింది. ఈ ఒత్తిడిలోనూ రింకూ సింగ్ హిట్టింగ్‌కు దిగాడు. 12 బాల్స్‌లో 38 రన్స్ అవసరమైన దశలో రింకూ 6, 4, 4, 4, 4 , 6 దంచాడు. మధ్యలో హర్షిత్ రాణా (10 నాటౌట్) రెండు ఫోర్లు రాబట్టినా కేకేఆర్‌కు ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
లక్నో: 20 ఓవర్లలో 238/3 (పూరన్ 87*, మార్ష్ 81, హర్షిత్ 2/51).
కోల్‌కతా: 20 ఓవర్లలో 234/7 (రహానె 61, వెంకటేశ్ 45, శార్దూల్ 2/52).