గుడిహత్నూర్, వెలుగు : లక్కీ డ్రాలో బంగారంతోపాటు ఓ బైక్‌ను గెలుపొందారని ఓ మహిళకు మాయమాటలు చెప్పి ఆమె బంగారు ఆభరణాలతో ఉడాయించిన ఘటన గుడిహత్నూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వడ్డెర కాలనీలో నివసించే లలిత ఇంటికి మంగళవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి తాము లక్కీ డ్రా నిర్వహించగా అందులో రెండు తులాల బంగారం, బైక్ గెలుచుకున్నారని చెప్పాడు.
అవి దక్కాలంటే దానికి సరిపడా బంగారం తాకట్టు పెట్టాల్సి ఉంటుందని నమ్మించాడు. అతడి మాయమాటలు నమ్మిన సదరు మహిళ తన దగ్గర ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసు అతనికిచ్చిసదరు వ్యక్తి బైక్‌పై జ్యువెలరీ షాప్‌కు తూకం వేయడానికి వెళ్లింది.
వెనుక కూర్చున్న లలిత కిందకు దిగగానే, బైక్‌తో అతడు పరారయ్యాడు. ఊహించని ఘటనతో తేరుకున్న బాధిత మహిళ లబోదిబోమంటూ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఇమ్రాన్ తెలిపారు.