లులు గ్రూప్ చైర్మన్ మంచి మనసు.. ముగ్గురి జీవితాన్ని నిలబెట్టారు

లులు గ్రూప్ చైర్మన్ మంచి మనసు.. ముగ్గురి జీవితాన్ని నిలబెట్టారు

భారత బిలియనీర్, లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ ఉదారతను చాటుకున్నారు. ఆసరా కోల్పోయి ఇద్దరు పిల్లలతో నడిరోడ్డున పడిన ఓ మహిళకు తాను అండగా నిలబడ్డారు. ఆమె అప్పు తీర్చడమే కాకుండా.. జీవితంలో స్థిరపడేందుకు మరో 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు.

ఏం జరిగిందంటే..?

కేరళలోని ఉత్తర పరవూర్‌కు చెందిన సంధ్య, ఆమె భర్త ఇంటి నిర్మాణం కోసం 2019లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ మణప్పురం ఫైనాన్స్ నుండి రూ.4 లక్షల రుణం తీసుకున్నారు. రెండేళ్ల తరువాత భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో ఇంటి పెద్ద భార్య పిల్లను పిల్లల్ని వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దాంతో కుటుంబ పోషణ భారమయ్యింది. ఆమె రుణం సకాలంలో చెల్లించలేకపోయింది. రోజులు గడిచే కొద్దీ ఆ రుణం వడ్డీతో సహా దాదాపు రూ.8 లక్షలకు పెరిగింది. 

రుణ చెల్లింపులు నిలిచిపోవడంతో లోన్ ఇచ్చిన కంపెనీ సంధ్యకు పలుమార్లు నోటీసులు జారీ చేసింది. బతుకుదెరువు కోసం స్థానికంగా ఉన్న దుకాణంలో రూ.10 వేల జీతానికి పనిచేస్తున్న ఆమె.. వచ్చిన నోటీసులకు సమాధానం చెప్పలేకపోయింది. దాంతో కంపెనీ ఇంటి జప్తు ప్రక్రియను ప్రారంభించింది. ఇటీవల ఆమె పనిలోకి వెళ్లగా.. రుణం ఇచ్చిన సంస్థ ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంది. ఆ విషయం తెలుసుకున్న ఆమె హుటాహుటీన అక్కడికి చేరుకొని.. ఇంట్లోని తమ సామాన్లు తీసుకుంటామని అభ్యర్థించినా వారు కరుణించలేదు. దాంతో వారు కట్టుబట్టలతో రోడ్డుపై నిలబడాల్సి వచ్చింది. ఈ ఘటన స్థానికుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. 

ALSO READ | రెండు దశల్లో జార్ఖండ్ ఎన్నికలు: షెడ్యూల్ ఇదే

ఈ కథనం మీడియా ఛానెళ్లలో ప్రసారం కావడంతో విషయం యూసఫ్ అలీ దృష్టికి చేరింది. ఆయన తన సిబ్బందిని పంపి సదరు మహిళ ఇంటిపైనున్న రుణం మొత్తాన్ని చెల్లించడమే కాకుండా, ఆమెకు మరో రూ.10 లక్షలు ఆర్థిక సాయంగా అందజేశారు. లులు గ్రూప్ మీడియా కోఆర్డినేటర్ స్వరాజ్ సంధ్యకు తాళం చెవిని అందజేశారు. బిలియనీర్ చేసిన ఈ సహాయం ప్రతిఒక్కరినీ కదిలించింది. యూసఫ్ అలీ లేకుంటే తాను, తన పిల్లలు చాలా దుర్భర స్థితిలో ఉండేవారమన్న సంధ్య.. బిలియనీర్ యూసఫ్ అలీకి కృతజ్ఞతలు తెలియజేసింది.